IFFCO
-
‘ఇఫ్కో’ సూక్ష్మ ఎరువులకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, అమరావతి: ఎరువుల్లో నానో ఎరువులు ఓ సంచలనం. సంప్రదాయ ఎరువులకు భిన్నంగా నానో టెక్నాలజీ ద్వారా ద్రవ రూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతులు ఎరువులు సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్లోకి తీసుకొచ్చి0ది. ఈ నానో ఎరువులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. విదేశాలు సైతం ఇఫ్కో సూక్ష్మ ఎరువుల కోసం క్యూకడుతున్నాయి. మరో వైపు దేశీయంగా ఇతర ఎరువుల కంపెనీలు సైతం వీటి తయారీకి ముందుకొస్తున్నాయి. నానో యూరియాకు పేటెంట్ హక్కు ప్రపంచంలోనే తొలిసారిగా నానో బయో టెక్నాలజీ ద్వారా ఇఫ్కో సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన సూక్ష్మ ఎరువులకు ఇఫ్కో పేటెంట్ హక్కు పొందింది. నానో యూరియాను 2021–22 సీజన్లో భారతీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఇఫ్కో గతేడాది నుంచి నానో డీఏపీని కూడా తీసుకొచ్చి0ది.500 మిల్లీ లీటర్ల బాటిల్లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా ధర రూ.266.50 ఉంటే, నానో యూరియా బాటిల్ ధర రూ.225 మాత్రమే. డీఏపీ ఎరువుల బ్యాగ్ ధర రూ.1,350గా ఉండగా, నానో డీఏపీ 500 మిల్లీ లీటర్ల బాటిల్ ధర రూ.600కే అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్లలో 3 రెట్లు పెరిగిన డిమాండ్ పర్యావరణ హితంతో పాటు సంప్రదాయ ఎరువులో ఉండే పోషకాలన్నీ నానో ఎరువుల్లో ఉంటాయి. భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిరూపితమవడంతో రైతులు కూడా వీటి పట్ల ఆసక్తిని చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా గత మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2021–22 సీజన్లో దేశవ్యాప్తంగా 2.12 కోట్ల బాటిల్స్ విక్రయాలు జరగ్గా, 2022–23లో 3.30 కోట్ల బాటిల్స్ విక్రయమయ్యాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన 2023–24 సీజన్లో 2.50 కోట్ల బాటిల్స్ విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిల్స్ విక్రయం లక్ష్యంగా నిర్ణయించారు. ఏపీలో రికార్డు స్థాయి అమ్మకాలు నానో ఎరువుల వినియోగంలో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గడిచిన మూడేళ్లలో ఏపీలో ఆర్బీకేల ద్వారా రికార్డుస్థాయిలో 10.50 లక్షల బాటిల్స్ విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్ కోసం 10 లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిల్స్‌ను ఏపీ రైతుల కోసం ఇఫ్కో సరఫరా చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి0ది. విదేశాలకు ఎగుమతులు సూక్ష్మ ఎరువుల వినియోగానికి విదేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్, జాంబియా, గునియా, శ్రీలంక, ఆఫ్రికన్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 2024–25 సీజన్లో 72 వేల లీటర్ల యూరియా, డీఏపీ బాటిల్స్ ఎగుమతి చేసేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల తయారీలో దేశీయ ఎరువుల కంపెనీలు కూడా భాగస్వాములవుతుండగా, మరికొన్ని మార్కెటింగ్ చేస్తున్నాయి. మురుగప్పా గ్రూప్‌నకు చెందిన కాకినాడలోని కోరమాండల్ ఎరువుల కర్మాగారం నానో యూరియా, నానో డీఏపీ తయారు చేస్తోంది. ఒడిశాలోని పారాదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ (పీపీఎల్) కూడా సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), రాష్రీ్టయ కెమికల్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్)తో పాటు ఫ్యాక్ట్ వంటి ఎరువుల కంపెనీలు ఇఫ్కో సూక్ష్మ ఎరువులను మార్కెటింగ్ చేస్తున్నాయి. సూక్ష్మ ఎరువులకు డిమాండ్ పెరుగుతోంది ఇఫ్కో సూక్ష్మ ఎరువులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ దేశాలు సైతం వీటి వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇఫ్కో బాటలోనే ఇతర ఎరువుల కంపెనీలు సైతం సూక్ష్మ ఎరువుల తయారీకి ముందుకొస్తున్నాయి. తొలి ఏడాది 2 కోట్ల బాటిల్స్ అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 6.60 కోట్ల బాటిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. నానో యూరియా, నానో డీఏపీతో పాటు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. – టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
‘కిసాన్ డ్రోన్స్’ వచ్చేశాయ్
సాక్షి, అమరావతి: సాగులో కూలీల వెతలకు చెక్ పెట్టడమే కాకుండా తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా సాగు ఖర్చుల్ని తగ్గించే ప్రధాన లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలోని సీహెచ్‌సీల్లో రైతులు, నిరుద్యోగ యువతకు ఉచితంగా డ్రోన్ పైలట్ శిక్షణ కూడా ఇస్తోంది. ఏపీ బాటలోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి దశలో దేశవ్యాప్తంగా 2,500 డ్రోన్స్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని ఇఫ్కో సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్‌కు 160 డ్రోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పటికే 70 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. మార్చి నెలాఖరు నాటికి మిగిలిన యూనిట్లను కూడా విడుదల చేయనుంది. మహిళలకు ఉచిత శిక్షణ ఏపీకి కేటాయించిన ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయిస్తారు. వీటిని పొందగోరే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ యువతకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 18–50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల పాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. శిక్షణ పూర్తికాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తారు. యూనిట్ అంచనా వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్‌పై 2 రోజుల పాటు ఆన్‌ఫీల్డ్ ట్రైనింగ్ కోసం అభ్యర్థులు మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 20 వేల ఎకరాల్లో పిచికారీ చేస్తే ఓనర్షిప్ డ్రోన్ పొందిన అభ్యర్థులు కనీసం 20వేల ఎకరాల్లో పిచికారీ చేయడం గానీ.. ఐదేళ్ల పాటు నిర్వహించిన తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం ఓనర్ షిప్‌ను అభ్యర్థుల పేరిట బదిలీ అవుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకుఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 60 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 10 మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 70 డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వెహికల్స్ చేరుకున్నాయి. మార్చి నాటికి మిగిలిన వారికి సమకూర్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్‌లో డిమాండ్‌ను బట్టి మరింత మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొస్తాం.– టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్‌గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్‌షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్‌ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. -
నెల్లూరులో నానో యూరియా ప్లాంట్!.. రూ.250 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన బెంగళూరులో తొలి ప్లాంట్ నెలకొల్పిన భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) రెండో ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్లాంట్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు జరుపుతోంది. ఎందుకింత ఆదరణ....? సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా దవ్ర రూపంలో ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరియా బస్తాతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, మెరుగైన పనితీరు, ద్రవరూప యూరియా బాటిళ్లను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుండటం, రవాణా ఖర్చులు ఆదా కావడం దీనికి ప్రధాన కారణాలు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నానో యూరియా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఏపీలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది. కోటి లీటర్ల సామర్థ్యంతో నెల్లూరు అగ్రి సెజ్‌లో ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో ఆసక్తి చూపుతోంది. కనీసం 20 ఎకరాల్లో ప్లాంట్ నెలకొల్పేందుకు భూ కేటాయింపుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. బస్తా యూరియాతో సమానం.. 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియాను బాటిళ్లలో ఇఫ్కో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా నానో యూరియా బాటిల్ రూ.240కే లభిస్తోంది. సంప్రదాయ ఎరువుల్లో ఉండే పోషకాలన్నీ కలిగి ఉండడం, అన్ని పంటలకు అనుకూలమైనది కావడం, 80–90 శాతం యూరియా మొక్కకు అందడం, భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని రుజువు కావడంతో ‘నానో’ పట్ల రైతుల్లో ఆదరణ పెరుగుతోంది. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా సుమారు 20 వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17,064 లీటర్లు) కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది డీఏపీ, జింక్, కాపర్ కూడా.. నానో యూరియా విక్రయాలను ప్రోత్సహిస్తూ రిటైల్ మార్కెట్లతో పాటు ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత రబీ సీజన్ కోసం 5.25 లక్షల బాటిల్స్ (2.65 లక్షల లీటర్లు) అందుబాటులో ఉంచగా రికార్డు స్థాయిలో 4.35 లక్షల బాటిళ్ల (2.17 లక్షల లీటర్లు) విక్రయాలు జరిగాయి. డిమాండ్‌ను బట్టి నిల్వ పెంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేస్తోంది. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ఇఫ్కో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ఉత్పత్తులతో ట్రయిల్ రన్ నిర్వహించింది. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కలుపు తగ్గింది.. దిగుబడి పెరిగింది ఖరీఫ్‌లో ఆరు ఎకరాల్లో ఎం–7 వరి రకం సాగు చేశా. 30వ రోజు, 60వ రోజు నానో యూరియాను రెండుసార్లు లీటర్ నీటిలో 4 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేశాం. కలుపు సమస్య, ఖర్చు తగ్గింది. దిగుబడి సరాసరిన రెండు బస్తాలు అధికంగా వచ్చింది. – అశోక్‌కుమార్, ఎల్లాయపాడు, నెల్లూరు జిల్లా త్వరలో ప్లాంట్‌కు పునాది రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇఫ్కో అంగీకరించింది. నెల్లూరులో భూములను కేటాయించడంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ప్లాంట్‌కు పునాదిరాయి వేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. – వై.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ -
సహకార సంస్థల మెగా సదస్సు ప్రారంభం: కొత్త కార్యక్రమానికి శ్రీకారం
Cooperative Conference: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రి ఇవాళ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖ ఆధ్వర్యంలో శనివారం సహకార సంస్థల మెగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడనున్నారు. ఈ వేదిక మీద అమిత్ షా ప్రసంగించనున్నారు. (చదవండి: నరేంద్ర మోదీ ఒక హీరో.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ప్రశంసలు వర్షం) ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగుతుండగా.. ఈ కాన్ఫరెన్స్‌ను సహకార సంస్థలు ఐఎఫ్ఎఫ్సీఓ, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, నాఫెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ), క్రిబ్చో (KRIBHCO)తోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి. చదవండి: మూడే రోజులు... ఎన్నో అంశాలు -
తొలిసారిగా.. అర లీటర్ సీసాలో బస్తా యూరియా
సాక్షి, అమరావతి: సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) దీనిని ఇటీవల ఆవిష్కరించింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కారం. నానో టెక్నాలజీపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతుండగా.. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాను ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. ఏమిటీ నానో యూరియా.. తరతరాలుగా మనందరికీ తెలిసిన సంప్రదాయ యూరియా తెల్లటి గుళికల రూపంలో ఉంటుంది. బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను కేవలం 500 మిల్లీలీటర్ల సీసాలో పట్టేలా చేశారు. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయి. పైగా ఇది మహా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సీసాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. భావి ఎరువుల మార్కెట్ రంగంలో ఇదో మేలి మలుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుంది. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.240 కాగా.. యూరియా బస్తా ధర రూ.268. -
భారీగా పెరిగిన డీఏపీ ధరలు..
సాక్షి, హైదరాబాద్: ఎరువుల ధరలను ఇఫ్కో కంపెనీ భారీగా పెంచింది. 50 కేజీల డీఏపీ బస్తా ధర ఇదివరకు రూ. 1,200 ఉండగా... దాన్ని ఏకంగా రూ.1,900 చేయడం గమనార్హం. అంటే ఒక బస్తాపై రూ.700 పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వచ్చాయని ఇఫ్కో తెలిపింది. అలాగే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా ఒక్కో బ్యాగుపై రూ. 425 నుంచి రూ. 615 వరకు పెరిగాయి. పాత స్టాకును పాత ధరకే విక్రయించాలని, కొత్త సరుకుకు మాత్రమే పెరిగిన ధరలు వసూలు చేయాలని ఇఫ్కో తెలిపింది. అయితే ఇప్పుడు పాత స్టాకే అందుబాటులో ఉందని, ఇంకా కొత్త స్టాక్ మొదలు కాలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరుగుతూ అనేక రకాలుగా అన్నదాతలపై భారం పడుతుండగా ఎరువుల ధర భారీగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పైగా మన రాష్ట్రంలో రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. రాష్ట్రంలో రెండు సీజన్లలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు వాడుతున్నారు. అయితే వేయాల్సిన దానికంటే ఎక్కువగా వేస్తున్నారు. ఇది కూడా అన్నదాతపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దేశంలో సగటున ఎకరానికి 51.2 కిలోల ఎరువులు వాడితే, రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల ఎరువులు రైతులు వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే ఒక బస్తా ఎరువులు వేయాల్సిన చోట మరో రెండు, మూడు బస్తాలు ఎక్కువ వేస్తున్నారు. దేశంలో యూరియా ధరలపై కేంద్రం నియంత్రణ ఉంది. ధరల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. కానీ మిగతా ఎరువుల విషయానికొస్తే మాత్రం కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ఏమైనా అంటే ముడిసరకుల ధరల పెరుగుదలను కారణంగా చూపుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ముడిసరకును ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఫాస్పరిక్ ఆమ్లం ధర పెరగడంతో ఎరువుల ధర భారీగా పెంచాల్సి వస్తోందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరగడంతో తాము అనివార్యంగా రైతులపైనే భారం వేయాల్సి వస్తోందంటున్నారు. కాగా ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచాలని నెలన్నర క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..! -
యూపీలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ సమీపంలోని ఫూల్పూర్ ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) ప్లాంటులో బుధవారం గ్యాస్ లీకేజ్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా.. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.'అమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఇఫ్కో కర్మాగారంలో గ్యాస్ లీకేజీని నిలిపివేశామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని' ప్రయాగరాజ్ జిల్లా మెజిస్ట్రేట్ భానుచంద్ర గోస్వామి చెప్పారు.కాగా ఈ ఘటనలో ఇఫ్కో అధికారులు వీపీ సింగ్, అభయ్ నందన్ లు మరణించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు అధికారులు మరణించడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఇఫ్కో ప్లాంటులో గ్యాస్ లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. -
భూములు లీజుకిచ్చే హక్కు ఎవరిచ్చారు?
► ఇఫ్కోకు హైకోర్టు న్యాయమూర్తి అక్షింతలు ► తుది విచారణకు 28 కి వాయిదా కొడవలూరు: భూములు లీజుకిచ్చే హక్కు మీకెవరిచ్చారని హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్‌తో కూడిన బెంచ్ ఇఫ్కో కిసాన్ సెజ్ అధికారులకు అక్షింతలు వేసింది. ఇఫ్కో కిసాన్ సెజ్‌కు భూమలు కోల్పోయిన రైతులు ఎకరాకు రూ.60 నుంచి రూ.70 లక్షల పరిహారమివ్వాలని హైకోర్టులో కేసు వేయగా విచారణకు స్వీకరించడం తెల్సిందే. అదేవిధంగా ఇఫ్కో కిసాన్ సెజ్‌లో కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటు చేసి పర్యావరణానికి హాని తెస్తున్నారని ముగ్గురు రైతులు హైకోర్టులో కేసు వేసి ఉన్నారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించి సెజ్‌లో ఎలాంటి పనులు చేపట్టరాదని స్టేటస్కొ ఇచ్చి ఉంది. పై రెండు కేసులపై రమేష్ రంగనాథన్ బెంచ్ మంగళవారం విచారించింది. ఈ విచారణకు ఇఫ్కో తరఫున గవర్నమెంట్ ప్లీడర్ మాట్లాడుతూ సెజ్‌పై ఉన్న స్టేటస్కోను ఎత్తివేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా సెజ్‌లోని భూములను ఏ హక్కుతో లీజుకిస్తున్నారంటూ ఇఫ్కో ప్రతినిధులకు చీఫ్ జస్టిస్ అక్షింతలు వేస్తూ స్టేటస్కోను 4 వారాలపాటు పొడిగించారు. ఈ కేసుతో పాటు పరిహారంపై వేసిన కేసును కూడా ఈ నెల 28 నుంచి తుది విచారణ చేసి తుది తీర్పు వెల్లడిస్తామని బెంచ్ ప్రకటించింది. -
గ్రామీణ్ హెల్త్‌కేర్‌లో ఇఫ్కోకు 26% వాటా
న్యూఢిల్లీ: సహకార ఎరువుల తయారీ దిగ్గజం ఇఫ్కో తాజాగా స్టార్టప్ సంస్థ గ్రామీణ్ హెల్త్ కేర్‌లో 26 శాతం వాటాలు దక్కించుకుంది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రామీణ్ హెల్త్ కేర్.. ప్రత్యేక క్లినిక్‌ల ద్వారా అధునాతన వైద్య పరీక్షలు మొదలైన సేవలు అందిస్తోంది. 2016 మే నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో 30 హెల్త్ కేర్ క్లినిక్‌లు ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి మరో 20 ప్రారంభించాలని సంస్థ యోచిస్తోంది. ప్రాథమిక వైద్య సేవల కల్పన కోసం నెలవారీ స్వల్ప రుసుములతో హెల్త్ కార్డ్‌లు కూడా జారీ చేసే అంశం పరిశీలిస్తోంది. చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి తేవడం ద్వారా గ్రామీణ్ హెల్త్ కేర్ సర్వీసులు రైతాంగంలో ప్రాథమిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఉపయోగపడగలవని ఇఫ్కో ఎండీ యూఎస్ అవస్తి తెలిపారు. తృతీయ శ్రేణి గ్రామీణ హబ్‌లలో ఉండే ఇఫ్కో బజార్ అవుట్‌లెట్స్‌లో కూడా ప్రాథమిక వైద్య కేంద్రాల ఏర్పాటుకు గ్రామీణ్ హెల్త్ కేర్ సంస్థలో పెట్టుబడులు తోడ్పడగలవని వివరించారు.