‘ఇఫ్కో’ సూక్ష్మ ఎరువులకు పెరుగుతున్న డిమాండ్‌ | Increasing demand for micro fertilizers | Sakshi
Sakshi News home page

‘ఇఫ్కో’ సూక్ష్మ ఎరువులకు పెరుగుతున్న డిమాండ్‌

Published Sat, Jun 15 2024 5:33 AM | Last Updated on Sat, Jun 15 2024 5:33 AM

Increasing demand for micro fertilizers

దేశీయంగా పెరుగుతున్న నానో ఎరువుల వినియోగం 

అన్ని పోషకాలతో పర్యావరణ హితంగా నానో ఎరువులు 

సంప్రదాయ ఎరువులకంటే ధర తక్కువ ∙అమెరికాతో సహా పలు దేశాలూ ఆసక్తి 

ఇఫ్కో బాటలోనే కోరమాండల్,  పీపీఎల్‌లో సూక్ష్మ ఎరువుల తయారీ 

మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిన అమ్మకాలు 

వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఏపీ 

వచ్చే ఖరీఫ్‌ నుంచి నానో కాపర్, నానో జింక్‌ ఎరువులు 

సాక్షి, అమరావతి: ఎరువుల్లో నానో ఎరువులు ఓ సంచలనం. సంప్రదాయ ఎరువులకు భిన్నంగా నానో టెక్నాలజీ ద్వారా ద్రవ రూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతులు ఎరువులు సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్‌లోకి తీసుకొచ్చి0ది. ఈ నానో ఎరువులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. విదేశాలు సైతం ఇఫ్కో సూక్ష్మ ఎరువుల కోసం క్యూకడుతున్నాయి. మరో వైపు దేశీయంగా ఇతర ఎరువుల కంపెనీలు సైతం వీటి తయారీకి ముందుకొస్తున్నాయి. 

నానో యూరియాకు పేటెంట్‌ హక్కు 
ప్రపంచంలోనే తొలిసారిగా నానో బయో టెక్నాలజీ ద్వారా ఇఫ్కో సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన సూక్ష్మ ఎరువులకు ఇఫ్కో పేటెంట్‌ హక్కు పొందింది. నానో యూరియాను 2021–22 సీజన్‌లో భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఇఫ్కో గతేడాది నుంచి నానో డీఏపీని కూడా తీసుకొచ్చి0ది.

500 మిల్లీ లీటర్ల బాటిల్‌లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా ధర రూ.266.50 ఉంటే, నానో యూరియా బాటిల్‌ ధర రూ.225 మాత్రమే. డీఏపీ ఎరువుల బ్యాగ్‌ ధర రూ.1,350గా ఉండగా, నానో డీఏపీ 500 మిల్లీ లీటర్ల బాటిల్‌ ధర రూ.600కే అందుబాటులోకి తెచ్చారు. 

మూడేళ్లలో 3 రెట్లు పెరిగిన డిమాండ్‌ 
పర్యావరణ హితంతో పాటు సంప్రదాయ ఎరువులో ఉండే పోషకాలన్నీ నానో ఎరువుల్లో ఉంటాయి. భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిరూపితమవడంతో రైతులు కూడా వీటి పట్ల ఆసక్తిని చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 

ఫలితంగా గత మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2021–22 సీజన్‌లో దేశవ్యాప్తంగా 2.12 కోట్ల బాటిల్స్‌ విక్రయాలు జరగ్గా, 2022–23లో 3.30 కోట్ల బాటిల్స్‌ విక్రయమయ్యాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన 2023–24 సీజన్‌లో 2.50 కోట్ల బాటిల్స్‌ విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్‌లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిల్స్‌ విక్రయం లక్ష్యంగా నిర్ణయించారు. 

ఏపీలో రికార్డు స్థాయి అమ్మకాలు 
నానో ఎరువుల వినియోగంలో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌ రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గడిచిన మూడేళ్లలో ఏపీలో ఆర్బీకేల ద్వారా రికార్డుస్థాయిలో 10.50 లక్షల బాటిల్స్‌ విక్రయాలు జరిగాయి. 

2024–25 సీజన్‌ కోసం 10 లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిల్స్‌ను ఏపీ రైతుల కోసం ఇఫ్కో సరఫరా చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చి0ది. 

విదేశాలకు ఎగుమతులు 
సూక్ష్మ ఎరువుల వినియోగానికి విదేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్, జాంబియా, గునియా, శ్రీలంక, ఆఫ్రికన్‌ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 2024–25 సీజన్‌లో 72 వేల లీటర్ల యూరియా, డీఏపీ బాటిల్స్‌ ఎగుమతి చేసేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల తయారీలో దేశీయ ఎరువుల కంపెనీలు కూడా భాగస్వాములవుతుండగా, మరికొన్ని మార్కెటింగ్‌ చేస్తున్నాయి. 

మురుగప్పా గ్రూప్‌నకు చెందిన కాకినాడలోని కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం నానో యూరియా, నానో డీఏపీ తయారు చేస్తోంది. ఒడిశాలోని పారాదీప్‌ ఫాస్పేట్‌ లిమిటెడ్‌ (పీపీఎల్‌) కూడా సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌), రాష్రీ్టయ కెమికల్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌)తో పాటు ఫ్యాక్ట్‌ వంటి ఎరువుల కంపెనీలు ఇఫ్కో సూక్ష్మ ఎరువులను మార్కెటింగ్‌ చేస్తున్నాయి. 

సూక్ష్మ ఎరువులకు డిమాండ్‌ పెరుగుతోంది 
ఇఫ్కో సూక్ష్మ ఎరువులకు రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రపంచ దేశాలు సైతం వీటి వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇఫ్కో బాటలోనే ఇతర ఎరువుల కంపెనీలు సైతం సూక్ష్మ ఎరువుల తయారీకి ముందుకొస్తున్నాయి. తొలి ఏడాది 2 కోట్ల బాటిల్స్‌ అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 6.60 కోట్ల బాటిల్స్‌ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 

నానో యూరియా, నానో డీఏపీతో పాటు ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి నానో యూరియా ప్లస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాం. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. – టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్‌ మార్కెటింగ్‌ మేనేజర్, ఇఫ్కో 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement