Fertilizer Corporation
-
‘ఇఫ్కో’ సూక్ష్మ ఎరువులకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, అమరావతి: ఎరువుల్లో నానో ఎరువులు ఓ సంచలనం. సంప్రదాయ ఎరువులకు భిన్నంగా నానో టెక్నాలజీ ద్వారా ద్రవ రూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతులు ఎరువులు సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్లోకి తీసుకొచ్చి0ది. ఈ నానో ఎరువులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. విదేశాలు సైతం ఇఫ్కో సూక్ష్మ ఎరువుల కోసం క్యూకడుతున్నాయి. మరో వైపు దేశీయంగా ఇతర ఎరువుల కంపెనీలు సైతం వీటి తయారీకి ముందుకొస్తున్నాయి. నానో యూరియాకు పేటెంట్ హక్కు ప్రపంచంలోనే తొలిసారిగా నానో బయో టెక్నాలజీ ద్వారా ఇఫ్కో సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన సూక్ష్మ ఎరువులకు ఇఫ్కో పేటెంట్ హక్కు పొందింది. నానో యూరియాను 2021–22 సీజన్లో భారతీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఇఫ్కో గతేడాది నుంచి నానో డీఏపీని కూడా తీసుకొచ్చి0ది.500 మిల్లీ లీటర్ల బాటిల్లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా ధర రూ.266.50 ఉంటే, నానో యూరియా బాటిల్ ధర రూ.225 మాత్రమే. డీఏపీ ఎరువుల బ్యాగ్ ధర రూ.1,350గా ఉండగా, నానో డీఏపీ 500 మిల్లీ లీటర్ల బాటిల్ ధర రూ.600కే అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్లలో 3 రెట్లు పెరిగిన డిమాండ్ పర్యావరణ హితంతో పాటు సంప్రదాయ ఎరువులో ఉండే పోషకాలన్నీ నానో ఎరువుల్లో ఉంటాయి. భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిరూపితమవడంతో రైతులు కూడా వీటి పట్ల ఆసక్తిని చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా గత మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2021–22 సీజన్లో దేశవ్యాప్తంగా 2.12 కోట్ల బాటిల్స్ విక్రయాలు జరగ్గా, 2022–23లో 3.30 కోట్ల బాటిల్స్ విక్రయమయ్యాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన 2023–24 సీజన్లో 2.50 కోట్ల బాటిల్స్ విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిల్స్ విక్రయం లక్ష్యంగా నిర్ణయించారు. ఏపీలో రికార్డు స్థాయి అమ్మకాలు నానో ఎరువుల వినియోగంలో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గడిచిన మూడేళ్లలో ఏపీలో ఆర్బీకేల ద్వారా రికార్డుస్థాయిలో 10.50 లక్షల బాటిల్స్ విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్ కోసం 10 లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిల్స్‌ను ఏపీ రైతుల కోసం ఇఫ్కో సరఫరా చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి0ది. విదేశాలకు ఎగుమతులు సూక్ష్మ ఎరువుల వినియోగానికి విదేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్, జాంబియా, గునియా, శ్రీలంక, ఆఫ్రికన్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 2024–25 సీజన్లో 72 వేల లీటర్ల యూరియా, డీఏపీ బాటిల్స్ ఎగుమతి చేసేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల తయారీలో దేశీయ ఎరువుల కంపెనీలు కూడా భాగస్వాములవుతుండగా, మరికొన్ని మార్కెటింగ్ చేస్తున్నాయి. మురుగప్పా గ్రూప్‌నకు చెందిన కాకినాడలోని కోరమాండల్ ఎరువుల కర్మాగారం నానో యూరియా, నానో డీఏపీ తయారు చేస్తోంది. ఒడిశాలోని పారాదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ (పీపీఎల్) కూడా సూక్ష్మ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), రాష్రీ్టయ కెమికల్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్)తో పాటు ఫ్యాక్ట్ వంటి ఎరువుల కంపెనీలు ఇఫ్కో సూక్ష్మ ఎరువులను మార్కెటింగ్ చేస్తున్నాయి. సూక్ష్మ ఎరువులకు డిమాండ్ పెరుగుతోంది ఇఫ్కో సూక్ష్మ ఎరువులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ దేశాలు సైతం వీటి వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇఫ్కో బాటలోనే ఇతర ఎరువుల కంపెనీలు సైతం సూక్ష్మ ఎరువుల తయారీకి ముందుకొస్తున్నాయి. తొలి ఏడాది 2 కోట్ల బాటిల్స్ అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 6.60 కోట్ల బాటిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. నానో యూరియా, నానో డీఏపీతో పాటు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. – టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
‘కిసాన్ డ్రోన్స్’ వచ్చేశాయ్
సాక్షి, అమరావతి: సాగులో కూలీల వెతలకు చెక్ పెట్టడమే కాకుండా తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా సాగు ఖర్చుల్ని తగ్గించే ప్రధాన లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలోని సీహెచ్‌సీల్లో రైతులు, నిరుద్యోగ యువతకు ఉచితంగా డ్రోన్ పైలట్ శిక్షణ కూడా ఇస్తోంది. ఏపీ బాటలోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి దశలో దేశవ్యాప్తంగా 2,500 డ్రోన్స్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని ఇఫ్కో సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్‌కు 160 డ్రోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పటికే 70 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. మార్చి నెలాఖరు నాటికి మిగిలిన యూనిట్లను కూడా విడుదల చేయనుంది. మహిళలకు ఉచిత శిక్షణ ఏపీకి కేటాయించిన ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయిస్తారు. వీటిని పొందగోరే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ యువతకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 18–50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల పాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. శిక్షణ పూర్తికాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తారు. యూనిట్ అంచనా వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్‌పై 2 రోజుల పాటు ఆన్‌ఫీల్డ్ ట్రైనింగ్ కోసం అభ్యర్థులు మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 20 వేల ఎకరాల్లో పిచికారీ చేస్తే ఓనర్షిప్ డ్రోన్ పొందిన అభ్యర్థులు కనీసం 20వేల ఎకరాల్లో పిచికారీ చేయడం గానీ.. ఐదేళ్ల పాటు నిర్వహించిన తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం ఓనర్ షిప్‌ను అభ్యర్థుల పేరిట బదిలీ అవుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకుఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 60 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 10 మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 70 డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వెహికల్స్ చేరుకున్నాయి. మార్చి నాటికి మిగిలిన వారికి సమకూర్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్‌లో డిమాండ్‌ను బట్టి మరింత మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొస్తాం.– టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
'భయో' ఫెర్టిలైజర్
సాక్షి, హైదరాబాద్ : బయో ఫెర్టిలైజర్ పేరిట బలవంతంగా ‘గోల్డ్ కంపోస్ట్’తమకు అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి కొనాల్సిందేనని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో బహుళజాతి కంపెనీలు తక్కువ ధరకు ఇస్తున్నా, గోల్డ్ కంపోస్ట్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రోమోర్ కంపెనీకి చెందిన బయో ఫెర్టిలైజర్ 40 కేజీల బస్తా రూ. 300 వరకు మార్కెట్లో ఉండగా, స్థానికంగా రాష్ట్రంలో తయారయ్యే ‘మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’ధర మాత్రం ఏకంగా రూ. 472 ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. మార్క్‌ఫెడ్ నుంచి ఒత్తిడి పెరగడంతో ప్యాక్స్‌లు గోల్డ్ కంపోస్ట్‌ను కొనుగోలు చేయక తప్పడంలేదు. అయితే రైతులు కొనుగోలు చేయనిచోట ఆ మేరకు ప్యాక్స్‌ల వద్దే నిల్వ ఉండిపోతున్నాయి. గత వానాకాలం సీజన్ నుంచి పూర్తిస్థాయిలో దీనిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడంతో అప్పటినుంచి ఈ ఫెర్టిలైజర్‌ను అంటగట్టే పనిలో మార్క్‌ఫెడ్ నిమగ్నమైంది. జిల్లాల్లోని మార్క్‌ఫెడ్ మేనేజర్లకు ఇండెంట్ పెట్టి మరీ దీనిని విక్రయిస్తున్నారు. దీంతో రైతులు, డీలర్లు, ప్యాక్స్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. టెండర్లు లేకుండానే ఒప్పందం... బయో ఫెర్టిలైజర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని గతేడాది మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. పంటలకు రసాయన ఎరువులను తగ్గించేందుకు ’మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’పేరుతో సేంద్రియ ఎరువును మార్కెట్లోకి తీసుకొచ్చింది. వరి, మొక్కజొన్న, పత్తితోపాటు ఉద్యాన పంటలకూ వినియోగించేలా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విశ్వ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో పెద్ద ప్లాంట్ నిర్మించి దీనిని తయారు చేస్తున్నారు. ఈ సంస్థతో మార్క్‌ఫెడ్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎరువుల దుకాణాలతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ వీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని మార్కెఫెడ్ నిర్ణయించింది. ఈ సేంద్రియ ఎరువును వరి, టమాటా, మిరప, మామిడి, బత్తాయి, నిమ్మ, నారింజ, అరటి, డ్రాగన్ ఫ్రూట్ సహా అన్నిరకాల పూలతోటలు, ఆయిల్‌పామ్, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పసుపు, చెరకు పంటలకు ఉపయోగించడం వల్ల నేల సారవంతమవుతుందని, అధిక దిగుబడి వస్తుందని మార్క్‌ఫెడ్ చెబుతోంది. అయితే ఇలాంటి సేంద్రియ ఎరువులకు ప్రసిద్ధి చెందిన అనేక కంపెనీలు జాతీయస్థాయిలో చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు విశ్వ ఆగ్రోటెక్తో ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెండర్ పిలవకుండా ఏకంగా ‘మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’పేరుతో దానికి నామకరణం చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వానికి చెందిన మార్క్‌ఫెడ్ పేరును ఉపయోగించుకోవడంపై ఉద్యోగులు, కొందరు అధికారుల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంబంధిత కంపెనీ పేరు పెట్టుకుంటే సరేననుకోవచ్చు. అంతేకానీ మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్ అని నామకరణం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మార్క్‌ఫెడ్ బోర్డులో ఆమోదం తెలుపుకోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌లో ఒక ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి సహా కొందరు పెద్దస్థాయి వ్యక్తులకు ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ కంపెనీతో వారికి లోపాయికారీ సంబంధాలు ఉన్నాయన్న చర్చా జరుగుతోంది. అందుకే టెండర్లు లేకుండానే ఒప్పందం చేసుకొని మార్కెట్లోకి ప్రవేశపెట్టారని చెబుతున్నారు. అంతేకాదు అధిక ధరకు విక్రయించడంపై రైతులు, డీల ర్లు, ప్యాక్స్ నిర్వాహకులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వందృష్టిసారించాలన్న విన్నపాలు తమకు భారంగా మారిన గోల్డ్ కంపోస్ట్ ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. గ్రోమోర్ వంటి కంపెనీ ఉండగా, నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కంపెనీకి ప్రాధాన్యం ఇవ్వడంపైనా విమర్శలున్నాయి. ఏ ప్రమాణాల ప్రకారం ఆ కంపెనీతో అవగాహనకు వచ్చారో కొత్త ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. -
కోరమాండల్ లాభం రూ.755 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.20 శాతం ఎగసి రూ.757 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.1,059 కోట్లుగా ఉంది. టర్నోవర్ 31 శాతం క్షీణించి రూ.6,988 కోట్లకు వచ్చి చేరింది. ఫలితాల నేపథ్యంలో కోరమాండల్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 3.84 శాతం పడిపోయి రూ.1,073.85 వద్ద స్థిరపడింది. -
పెరిగిన ఎరువుల దిగుమతి
న్యూఢిల్లీ: భారత్ ఎరువుల దిగుమతి పరిమాణం జనవరిలో 3.9 శాతం పెరిగి 19.04 లక్షల టన్నులకు చేరింది. 2022 జనవరిలో ఈ పరిమాణం 18.33 లక్షల టన్నులు. ఎరువుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ► 2023 జనవరి మొత్తం 19.04 లక్షల టన్నుల దిగుమతుల్లో యూరియా 10.65 లక్షల టన్నులు. డీ అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) 5.62 లక్షల టన్నులు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) 1.14 లక్షల టన్నులు. కాంప్లెక్స్‌లు 1.63 లక్షల టన్నులు. 2022 జనవరిలో యూరియా దిగుమతుల పరిమాణం 12.48 లక్షల టన్నులు. డీఏపీ 2.45 లక్షల టన్నులు. ఎంఓపీ 3.40 లక్షల టన్నులు. ఎంఓపీ పరిమాణం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు రెండింటి వినియోగానికి ఉద్దేశించినది. ► ఈ ఏడాది జనవరిలో దేశీయ ఎరువుల ఉత్పత్తి 2022 ఇదే నెలతో పోల్చితే 32.16 లక్షల టన్నుల నుంచి 39.14 లక్షల టన్నులకు పెరిగింది. ► అంతర్జాతీయ మార్కెట్లో పలు రకాలు ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. యూరియా ధరలు (రవాణాకు సిద్ధమైన) ఈ ఏడాది జనవరిలో టన్నుకు 44.26 శాతం క్షీణించి 897 డాలర్ల నుండి 500 డాలర్లుగా నమోదయ్యాయి.డీఏపీ ధరలు 26.28 శాతం క్షీణించి టన్నుకు 679 డాలర్లకు చేరాయి. ఫాస్పరిక్ యాసిడ్ ధర 11.65 శాతం తగ్గి, టన్నుకు 1176 డాలర్లకు తగ్గింది. అమోనియా రేటు 17.42 శాతం తగ్గి, టన్నుకు 928 డాలర్లకు దిగివచ్చింది. సల్ఫర్ ధర కూడా టన్నుకు 52.51 శాతం తగ్గి 161 డాలర్లకు చేరింది. ► కాగా, ఎంఓపీ ధర మాత్రం 2023 జనవరిలో 2022 జనవరితో పోల్చి టన్నుకు 32.58 శాతం పెరిగి 445 డాలర్ల నుంచి 590 డాలర్లకు చేరింది. రాక్ ఫాస్పేట్ ధర సైతం ఇదే కాలంలో 68.06 శాతం పెరిగి టన్నుకు 144 డాలర్ల నుంచి 242 డాలర్లకు ఎగసింది. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ బోర్లా- ఎన్ఎఫ్ఎల్ ఖుషీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో(ఏప్రిల్- అక్టోబర్) నాన్యూరియా ఫెర్టిలైజర్స్ అమ్మకాలు జోరందుకోవడంతో నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. వెరసి గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్ భారీ నష్టాలతో కళ తప్పగా.. ఎన్ఎఫ్ఎల్ భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గోద్రెజ్ ప్రాపర్టీస్ నికర లాభం 78 శాతం క్షీణించి రూ. 7 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 65 శాతం నీరసించి రూ. 90 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 69 శాతం పడిపోయి రూ. 22.6 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.3 శాతం కుప్పకూలి రూ. 1,036 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,030 వరకూ వెనకడుగు వేసింది. ఎన్ఎఫ్ఎల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో అన్నిరకాల యూరియాయేతర ఎరువుల అమ్మకాలు జోరందుకున్నట్లు నేషనల్ ఫెర్టిలైజర్స్ తెలియజేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే తదితర ఎరువుల వాడకంలో రైతులకు కంపెనీ ఇస్తున్న శిక్షణ ఇందుకు దోహదం చేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా పానిపట్‌లో తయారైన బెంటోనైట్ సల్ఫర్ అమ్మకాలు 3478 ఎంటీ నుంచి 11,730 ఎంటీకి ఎగశాయి. ఇదేవిధంగా ఎస్ఎస్పీ విక్రయాలు 6323 ఎంటీ నుంచి 14,726 ఎంటీకి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్ఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 32.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 34 వరకూ ఎగసింది. -
సిద్ధమవుతున్న రామగుండం ప్లాంటు
న్యూఢిల్లీ: రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటు తిరిగి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇక్కడ 99.58 శాతం పనులు పూర్తి అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గోరఖ్‌పూర్ (యూపీ), సింద్రి (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిషా) వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇతర ఖాయిలా పడ్డ యూనిట్లలో పనులు జరుగుతున్నాయని వివరించింది. గోరఖ్‌పూర్, సింద్రి యూనిట్లలో 2021లో, తాల్చేర్ ప్లాంటులో 2023లో యూరియా ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి మొదలు కానున్నాయి. బిహార్‌లోని బరౌనిలో హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌కు చెందిన యూనిట్‌ను సైతం పునరుద్ధరిస్తున్నారు. 77.60 శాతం పనులు పూర్తి అయిన ఈ ప్లాంటు వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఒక్కో ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.27 మిలియన్ టన్నులు ఉండనుంది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా యూరియా తయారీ చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో మూతపడ్డ ఈ అయిదు ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
ఆర్ఎఫ్సీఎల్కు రాజకీయ గ్రహణం
సాక్షి, రామగుండం: తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్ నిర్మిస్తున్నారు. ప్లాట్ నిర్మాణం 99.5శాతం పూర్తి కాగా, త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఎఫ్సీఎల్లో మరో ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుండడంతో రాజకీయ గ్రహణం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్లాంట్‌లో పట్టుకోసం పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల జేఏసీలు ప్రయత్నిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు.. కొందరు దళారులు తెరపైకి వచ్చి స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలిప్పిస్తామంటూ.. సొమ్ములు దండుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. 1970 అక్టోబర్ 2న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కంపెనీని స్థాపించారు. ఆ సమయంలో వీర్లపల్లి, లక్ష్మీపురం, అడ్డగుంటపల్లి, ఎల్కలపల్లి గ్రామాలకు సంబంధించిన 1284 ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారు. 1980 నవంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. దాదాపు 19 సంవత్సరాలపాటు సాగిన ఉత్పత్తిని నష్టాలు రావడంతో 1999 మార్చి 31న కంపెనీని మూసివేశారు. ఇందులో 1,069 పర్మినెంట్ ఉద్యోగులకు వీఎస్ఎస్ ద్వారా తొలగించారు. అలాగే రెండువేల మంది కాంట్రాక్ట్ కార్మికులను అర్దాంతరంగా రోడ్డున పడేశారు. తిరిగి ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుద్ధరణ నష్టాల్లో ఉన్న ఎఫ్‌సీఐని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు రూ.5,254 కోట్లతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. పునరుద్ధరణ వ్యయం రూ.5,254 కోట్ల నుంచి రూ.6120 కోట్లకు పెరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 63శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 11శాతం, 26శాతం ప్రైవేట్ సంస్థలకు వాటాగా నిర్ణయించారు. కంపెనీలో ప్రతిరోజు 2,200 టన్నుల ఆమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేనా...? ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభ సమయంలో 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల, ప్రభావిత గ్రామల ప్రజలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‌సీఐ నిర్మాణానికి లక్ష్మీపురం, ఎల్కలపల్లి, జనగామ, వీర్లపల్లి గ్రామాల ప్రజలు ఎరువుల కర్మాగారం నిర్మాణానికి 1,284 ఎకరాల భూమిని ఇచ్చారు. అప్పట్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న యాజమాన్యం ఇంత వరకు వారికి ఉద్యోగావకాశాలు చూపించలేదు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు, ప్లాంట్‌లో పనిచేసి వీఎస్ఎస్ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన వారికి, కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాలు ఏ విధంగా లభిస్తాయో వేచి చూడాలి. రాజకీయ గ్రహణం.. ‘స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగం’ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తూ.. పలు రాజకీయ పార్టీలు ఆర్ఎఫ్సీఎల్లో ఇప్పటినుంచే పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. రోజుకో కార్మికసంఘం పేరిట ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. దీనికి తోడు ఆర్ఎఫ్సీఎల్ పునః ప్రారంభం అవుతుండడంతో పుట్టగొడుగుల్లా దళారులు పుట్టుకొస్తున్నారు.ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇప్పటికే కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగంపై ఉన్న ఆశతో యువకులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నట్లు సమాచారం.ఇప్పటికైనా యాజమాన్యం దళారీ వ్యవస్థను అరికట్టాల్సి అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
రామగుండం ఎరువుల ప్లాంటుకు జేవీ ఏర్పాటు
న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ కోసం ప్రభుత్వ రంగ ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కలసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ నెల 17న జేవీని ఏర్పాటు చేసినట్లు బీఎస్ఈకి నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్) తెలియజేసింది. కొత్తగా ఏర్పడిన సంస్థలో ఎన్ఎఫ్ఎల్, ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) కంపెనీలకు చెరి 26 శాతం, ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌కి 11 శాతం వాటాలు ఉంటాయి. జేవీలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చే ఇతర సంస్థలకు మిగతా వాటాలు దక్కనున్నాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం ఎరువుల యూనిట్లో 1999 నుంచి యూరియా, అమ్మోనియా ఉత్పత్తిని నిలిపివేశారు. లాభదాయకత లేకపోవడమే ఇందుకు కారణం. తాజాగా మూతబడిన ఎరువుల ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రామగుండం ప్లాంటుకు కూడా మోక్షం లభించింది. దాదాపు రూ. 5,000 కోట్ల వ్యయంతో దీన్ని పునరుద్ధరించనున్నారు.