సాక్షి, అమరావతి: సాగులో కూలీల వెతలకు చెక్ పెట్టడమే కాకుండా తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా సాగు ఖర్చుల్ని తగ్గించే ప్రధాన లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలోని సీహెచ్‌సీల్లో రైతులు, నిరుద్యోగ యువతకు ఉచితంగా డ్రోన్ పైలట్ శిక్షణ కూడా ఇస్తోంది.
ఏపీ బాటలోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి దశలో దేశవ్యాప్తంగా 2,500 డ్రోన్స్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని ఇఫ్కో సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్‌కు 160 డ్రోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పటికే 70 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. మార్చి నెలాఖరు నాటికి మిగిలిన యూనిట్లను కూడా విడుదల చేయనుంది.
మహిళలకు ఉచిత శిక్షణ
ఏపీకి కేటాయించిన ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయిస్తారు. వీటిని పొందగోరే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ యువతకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 18–50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల పాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది.
అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. శిక్షణ పూర్తికాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తారు. యూనిట్ అంచనా వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్‌పై 2 రోజుల పాటు ఆన్‌ఫీల్డ్ ట్రైనింగ్ కోసం అభ్యర్థులు మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
20 వేల ఎకరాల్లో పిచికారీ చేస్తే ఓనర్‌షిప్
డ్రోన్ పొందిన అభ్యర్థులు కనీసం 20వేల ఎకరాల్లో పిచికారీ చేయడం గానీ.. ఐదేళ్ల పాటు నిర్వహించిన తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం ఓనర్ షిప్‌ను అభ్యర్థుల పేరిట బదిలీ అవుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకుఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 60 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 10 మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 70 డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వెహికల్స్ చేరుకున్నాయి. మార్చి నాటికి మిగిలిన వారికి సమకూర్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది.
సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్‌లో డిమాండ్‌ను బట్టి మరింత మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొస్తాం.– టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో
Comments
Please login to add a commentAdd a comment