
న్యూఢిల్లీ: భారత్ ఎరువుల దిగుమతి పరిమాణం జనవరిలో 3.9 శాతం పెరిగి 19.04 లక్షల టన్నులకు చేరింది. 2022 జనవరిలో ఈ పరిమాణం 18.33 లక్షల టన్నులు. ఎరువుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం..
► 2023 జనవరి మొత్తం 19.04 లక్షల టన్నుల దిగుమతుల్లో యూరియా 10.65 లక్షల టన్నులు. డీ అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) 5.62 లక్షల టన్నులు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) 1.14 లక్షల టన్నులు. కాంప్లెక్స్‌లు 1.63 లక్షల టన్నులు. 2022 జనవరిలో యూరియా దిగుమతుల పరిమాణం 12.48 లక్షల టన్నులు. డీఏపీ 2.45 లక్షల టన్నులు. ఎంఓపీ 3.40 లక్షల టన్నులు. ఎంఓపీ పరిమాణం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు రెండింటి వినియోగానికి ఉద్దేశించినది.
► ఈ ఏడాది జనవరిలో దేశీయ ఎరువుల ఉత్పత్తి 2022 ఇదే నెలతో పోల్చితే 32.16 లక్షల టన్నుల నుంచి 39.14 లక్షల టన్నులకు పెరిగింది.
► అంతర్జాతీయ మార్కెట్‌లో పలు రకాలు ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. యూరియా ధరలు (రవాణాకు సిద్ధమైన) ఈ ఏడాది జనవరిలో టన్నుకు 44.26 శాతం క్షీణించి 897 డాలర్ల నుండి 500 డాలర్లుగా నమోదయ్యాయి.డీఏపీ ధరలు 26.28 శాతం క్షీణించి టన్నుకు 679 డాలర్లకు చేరాయి. ఫాస్పరిక్ యాసిడ్ ధర 11.65 శాతం తగ్గి, టన్నుకు 1176 డాలర్లకు తగ్గింది. అమోనియా రేటు 17.42 శాతం తగ్గి, టన్నుకు 928 డాలర్లకు దిగివచ్చింది. సల్ఫర్ ధర కూడా టన్నుకు 52.51 శాతం తగ్గి 161 డాలర్లకు చేరింది.
► కాగా, ఎంఓపీ ధర మాత్రం 2023 జనవరిలో 2022 జనవరితో పోల్చి టన్నుకు 32.58 శాతం పెరిగి 445 డాలర్ల నుంచి 590 డాలర్లకు చేరింది. రాక్ ఫాస్పేట్ ధర సైతం ఇదే కాలంలో 68.06 శాతం పెరిగి టన్నుకు 144 డాలర్ల నుంచి 242 డాలర్లకు ఎగసింది.