Fertilizers Corporation of India
-
ఇకపై ఈ దుకాణాలకి.. ధ్రువీకరణ ఉండాల్సిందే..
కరీంనగర్: దుకాణాల్లో విరామం లేకుండా గడిపే డీలర్లు తరగతి గదిలో కూర్చోవాల్సిందే. ఇక విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లెక్కలతో కుస్తీ పట్టేవారంతా నిపుణుల బోధనలు వినాల్సిందే. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ డీలర్ వ్యవసాయ శాఖ నుంచి డీఏఈఎస్ఐ డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం పొందాల్సిందేనని స్పష్టం చేసింది. లేదంటే వారిక విక్రయాలు చేసే అవకాశం ఉండదు.కట్టుదిట్టమైన శిక్షణ.. తదుపరి డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం, ఆపై రైతులకు విక్రయిస్తున్న వాటిపై నిఘా వంటి ప్రత్యేక కార్యాచరణ ఉండనుంది. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) నేతృత్వంలో డిప్లొమా కోర్సు నిర్వహించనున్నారు. గతంలో జమ్మికుంట కేవీకేలో పలువురు డీలర్లకు డిప్లమా కోర్సు శిక్షణ జరగగా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సవరించింది. రైతు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు ఇచ్చి ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. డీలర్లు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ పేర్కొన్నారు.48 వారాలు.. నిపుణులతో బోధన..డీలర్లకు ఏడాది పాటు శిక్షణనివ్వనున్నారు. వారంలో ఒక రోజు ప్రతీ ఆదివారం తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. కృషి భవన్‌ను శిక్షణకు వేదికగా నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోనే డిప్లమా కోర్సు శిక్షణ ఉండాలని కేంద్రం నిర్దేశించగా తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు శిక్షణ కేంద్రం ఏడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిక్షణలో 48 ఆదివారాలు తరగతి గదిలో దుక్కుల నుంచి విత్తనాలు, సస్యరక్షణ చర్యలు తదితర సమగ్ర అంశాలను వివరించనున్నారు. మిగతా 8 వారాలు క్షేత్రస్థాయి శిక్షణ ఉండనుంది. వివరాలకు 81796 49595 నంబర్‌ను సంప్రదించాలని ఏడీ సూచించారు.ఒక్కో బ్యాచ్‌కు 40మంది డీలర్లు..విత్తన క్రిమిసంహారక, ఎరువు విక్రయ డీలర్లకు డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ టు ఇన్పుట్ డీలర్స్ (డీఏఈఎస్ఐ) డిప్లమా కోర్సుకు ఒక్కో బ్యాచ్‌కు 40 మందిని ఎంపిక చేయనున్నారు. లైసెన్స్ పొందిన డీలర్ల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కలెక్టరేట్ వ్యవసాయ శాఖలోని రైతు శిక్షణ కేంద్రం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. డీలర్ల లైసెన్స్ ప్రతిని సంబంధిత ఏడీఏ ధ్రువీకరణతో సమర్పించాలి. దరఖాస్తుదారు తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు రూ.10వేలు డీడీ చెల్లించి, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు.పరీక్ష పాసైతేనే ధ్రువీకరణ..ఏదో మొక్కుబడిగా కాకుండా సమగ్ర అవగాహన కలిగేలా కోర్సును ఏర్పాటు చేశారు. కాలక్షేపం చేస్తే సదరు డీలరుకు ఇబ్బందులు తప్పవు. 48 వారాలు జరిగిన కోర్సుపై పరీక్షలు నిర్వహించనున్నారు. ప్ర తీ అంశంపై పట్టు సాధించాల్సిందే. పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు జరుగనుండగా భోజన వసతి కల్పించనున్నారు.ఫెసిలిటేటర్ నియామకానికి గడువు 15ఇందుకు ఫెసిలెటేటర్ను నియమించేందుకు ఆత్మ ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ(అగ్రికల్చర్) లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి వ్యవసాయశాఖ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా కేవీకేలో 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిని ఫెసిలిటేటర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్దేశించింది. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 గడువు. ప్రతి ఆదివారం జరిగే శిక్షణలో శాస్త్రవేత్తలు, నిపుణులతో తరగతులు నిర్వహించడం వీరి విధి. త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని, డీలర్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ వివరించారు.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
రైతులకు మరింత ‘సహకారం’
సాక్షి, హైదరాబాద్: ఎరువుల నుంచి విత్తనాలు, పురుగుల మందులు ఇలా అన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. రైతులకు అవసరయ్యే సేవలు విస్తరించేందుకు ‘వన్‌స్టాప్ షాప్’ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాస్ (పీఎంకేఎస్కే) పథకంలో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇది ఇక్కడ కూడా అమలులోకి వస్తే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ‘వన్‌స్టాప్ షాప్’ కేంద్రాలుగా మార్చుతారు. ఒకేచోట అన్ని సేవలు... దేశవ్యాప్తంగా లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఉన్నాయి. వాటిల్లో 73,098 ప్యాక్స్‌లు ఎరువుల లైసెన్స్ కలిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా లైసెన్స్ పరిధిలోకి తీసుకొస్తారు. తెలంగాణలో 1,423 ప్యాక్స్ ఉన్నాయి. అందులో 1,261 చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,915 ఎరువుల రిటైల్ దుకాణాలుండగా, 14,870 చురుగ్గా పనిచేస్తున్నాయి. అన్ని ప్యాక్స్‌లను ఎరువుల వ్యాపారంలోకి తీసుకొచ్చి అవన్నీ చురుగ్గా పనిచేసేలా కృషి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్యాక్స్‌ల ద్వారా రైతులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి వాటిల్లో అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా అన్ని రకాల వ్యవసాయ ఉపకరణాలు అందించాలనేదే ఉద్దేశం. నాణ్యమైన సేవలు అందించవచ్చు దేశంలో సహకార వ్యవసాయ పద్ధతులు అనుసరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ప్రైవేట్‌లో ఎరువులు, పురుగు మందులు, విత్తన వ్యాపారుల ద్వారా అనేకచోట్ల కల్తీ, నకిలీ రాజ్యమేలుతోంది. ఆ దందాకు చెక్ పెట్టాలంటే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం మేలని కేంద్రం చెబుతోంది. ప్యాక్స్ ద్వారా యూరియా వెళ్లడం వల్ల బ్లాక్ మార్కెట్ జరగకుండా చూసుకోవచ్చు. అంతేగాకుండా కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రైతులకు అంటగట్టకుండా నిరోధించవచ్చు. తక్కువ ధరల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు , సేంద్రీయ ఎరువులు కూడా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో ప్యాక్స్ ద్వారానే మార్కెటింగ్ వసతి కల్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్యాక్స్‌ల్లో అనేకం అప్పుల్లో కూరుకుపోయాయని, అవి ప్యాక్స్ రాజకీయాల్లో మునిగిపోవడం వల్ల వాటిల్లో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయన్న చర్చ జరుగుతోంది. వాటిని అన్ని రకాలుగా బలోపేతం చేస్తే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం విజయవంతమవుతుందని అధికారులు అంటున్నారు. -
ఎరువులను 24 గంటల్లో ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ వద్ద నున్న కేంద్రం పంపించిన ఎరువుల ను 24 గంటల్లో రైతులకు ఇవ్వక పోతే...ఆ కార్యాలయాలను బీజేపీ కార్యకర్తలు ముట్టడించి ప్రజలకు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 17న సభ కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ ఇవ్వా లంటూ కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వ్యాపార సంబంధాలు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్లు కలిసి పోటీ చేయడంపై చెప్పాలని డిమాండ్ చేశారు. -
పెరిగిన ఎరువుల దిగుమతి
న్యూఢిల్లీ: భారత్ ఎరువుల దిగుమతి పరిమాణం జనవరిలో 3.9 శాతం పెరిగి 19.04 లక్షల టన్నులకు చేరింది. 2022 జనవరిలో ఈ పరిమాణం 18.33 లక్షల టన్నులు. ఎరువుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ► 2023 జనవరి మొత్తం 19.04 లక్షల టన్నుల దిగుమతుల్లో యూరియా 10.65 లక్షల టన్నులు. డీ అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) 5.62 లక్షల టన్నులు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) 1.14 లక్షల టన్నులు. కాంప్లెక్స్‌లు 1.63 లక్షల టన్నులు. 2022 జనవరిలో యూరియా దిగుమతుల పరిమాణం 12.48 లక్షల టన్నులు. డీఏపీ 2.45 లక్షల టన్నులు. ఎంఓపీ 3.40 లక్షల టన్నులు. ఎంఓపీ పరిమాణం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు రెండింటి వినియోగానికి ఉద్దేశించినది. ► ఈ ఏడాది జనవరిలో దేశీయ ఎరువుల ఉత్పత్తి 2022 ఇదే నెలతో పోల్చితే 32.16 లక్షల టన్నుల నుంచి 39.14 లక్షల టన్నులకు పెరిగింది. ► అంతర్జాతీయ మార్కెట్లో పలు రకాలు ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. యూరియా ధరలు (రవాణాకు సిద్ధమైన) ఈ ఏడాది జనవరిలో టన్నుకు 44.26 శాతం క్షీణించి 897 డాలర్ల నుండి 500 డాలర్లుగా నమోదయ్యాయి.డీఏపీ ధరలు 26.28 శాతం క్షీణించి టన్నుకు 679 డాలర్లకు చేరాయి. ఫాస్పరిక్ యాసిడ్ ధర 11.65 శాతం తగ్గి, టన్నుకు 1176 డాలర్లకు తగ్గింది. అమోనియా రేటు 17.42 శాతం తగ్గి, టన్నుకు 928 డాలర్లకు దిగివచ్చింది. సల్ఫర్ ధర కూడా టన్నుకు 52.51 శాతం తగ్గి 161 డాలర్లకు చేరింది. ► కాగా, ఎంఓపీ ధర మాత్రం 2023 జనవరిలో 2022 జనవరితో పోల్చి టన్నుకు 32.58 శాతం పెరిగి 445 డాలర్ల నుంచి 590 డాలర్లకు చేరింది. రాక్ ఫాస్పేట్ ధర సైతం ఇదే కాలంలో 68.06 శాతం పెరిగి టన్నుకు 144 డాలర్ల నుంచి 242 డాలర్లకు ఎగసింది. -
RFCL: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. 5 రాష్ట్రాలకు బాసట.. సగం వాటా తెలంగాణకే
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సిగలో మరో మణిహారంగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అడుగడుగునా ఏర్పడిన అవాంతరాలను అధిగమిస్తూ పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ జోరుగా ఉత్పత్తి కొనసాగిస్తూ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల రైతులకు బాసటగా నిలుస్తోంది. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్రప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక గత మార్చి 22 నుంచి వాణిజ్యకార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్పత్తిలో సగం వాటా తెలంగాణ రాష్ట్ర అవసరాలకే కేటాయించనున్నారు. వేప నూనె, విదేశీ సాంకేతికతతో.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ ప్రాజెక్టు విలువ రూ.6,338.16 కోట్లు కాగా, వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.75 లక్షల మెట్రిక్ టన్నులు. ఆర్ఎఫ్సీఎల్ అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్టోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేయ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తోంది. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేసి, వేపనూనెతో యూరియా, అమ్మోనియా తయారుచేయడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకత. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
రైతులకు వెన్నుదన్నుగా అగ్రిల్యాబ్‌లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎరువులు, విత్తన, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను పండించేందుకు ఎంతో దోహపడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ ల్యాబ్ ద్వారా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్ సిబ్బందికి సైతం నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ రైతు సేవలో తరిస్తున్నాయి. తాడేపల్లిగూడెం: భూమాతను నమ్ముకుని హలం పట్టి పొలం దున్ని స్వేదం చిందించి పుడమితల్లి ధాన్యపు రాశులతో, పంటలతో విరాజిల్లడానికి కృషి చేసే రైతులకు విత్తనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు దివిటీలుగా మారాయి. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్‌లు వ్యవసాయంలో వినూత్న మార్పులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో వ్యవసాయం పండుగగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాడేపల్లిగూడెంలో ఎరువులు, పురుగుమందులు, విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక మార్గదర్శనం సైతం గూడెంలోని సెంట్రల్ ల్యాబ్ ద్వారా అందుతోంది. ఈ ల్యాబ్‌ల ద్వారా అందుతున్న సేవలు ఇలా ఉన్నాయి. ఆరు జిల్లాలకు విత్తన పరీక్షలు ధాన్యం, కూరగాయలు, అపరాల వంగడాలలో మొలకశాతాన్ని విశ్లేషించి ఫలితాలను రైతులకు అందజేయడానికి తాడేపల్లిగూడెంలో 1972లో విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, అపరాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలలో మొలకశాతాన్ని విశ్లేషించి నాణ్యతను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు సేవలందిస్తున్నారు. వ్యవసాయాధికారులు, ఏడీఏల ద్వారా వంగడాల శాంపిల్స్ ఇక్కడకు వస్తాయి. వాటిలో మొలకశాతాలను వివిధ దశల్లో పరీక్షల ద్వారా నిర్థారించి ఫలితాలను 30 రోజుల వ్యవధిలో పంపిస్తారు. శీతలీకరణ పద్ధతుల్లో విత్తనాలను భద్రపర్చి తర్వాత మొలకశాతాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని మూడింటిలో ఒకటి 1979 ఫిబ్రవరి 17న ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు మొత్తం మూడు ఉండగా, ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయగా, మిగిలినవి అనంతపురం, బాపట్లలో ఉన్నాయి. వీటిని లీగల్ ల్యాబ్స్ అని కూడా అంటారు. అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి, సాంకేతికపరమైన శిక్షణ ఈ ల్యాబ్ ద్వారా ఇచ్చారు. ఎరువులలో కల్తీ, నాణ్యత పరిశీలనకు నమూనాలను ఇక్కడకు పంపిస్తారు. గుంటూరులో కోడింగ్ సెంటర్‌కు ఈ నమూనాలు చేరితే, అక్కడి నుంచి ఇక్కడి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. గతంలో 60 రోజుల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, ప్రస్తుతం అధునాతన పరీక్ష యంత్రాలు అందుబాటులోకి రావడంతో 2018 నుంచి 15 రోజుల్లోనే ఫలితాలను తేల్చేస్తున్నారు. ఫరీదాబాద్‌లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన నిపుణులు ఈ ల్యాబ్‌లో సేవలందిస్తున్నారు. ప్రమాణాలకు తగ్గట్టుగా పురుగుమందు పరీక్షలు 1984 మే రెండో తేదీన ఇక్కడ పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా 68 ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏడు ల్యాబ్‌లుండగా, రాష్ట్ర విభజనలో రెండు వరంగల్, రాజేంద్రనగర్ ల్యాబ్‌లు తెలంగాణలోకి వెళ్లాయి. మిగిలిన ఐదు ల్యాబ్‌లు రాష్ట్రానికి దక్కాయి. వాటిలో ఒకటి తాడేపల్లిగూడెం ల్యాబ్ కాగా, గుంటూరు అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణాలలో ల్యాబ్‌లు ఉన్నాయి. పురుగుమందుల్లో మూల పదార్థం స్థాయి ప్రమాణాల పరిమితికి అనుకూలంగా ఉందో లేదా అనేది ఈ పరీక్ష కేంద్రాల్లో నిర్ధారిస్తారు. గుంటూరులో ఉన్న కోడింగ్ సెంటర్‌కు తిరిగి ఫలితాలను పంపిస్తారు. పురుగుమందుల్లో క్రియాశీల పదార్థా శాతాన్ని పరీక్షిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం జిల్లాలో ఏర్పాటుచేసే అగ్రిల్యాబ్ లలో పనిచేసే సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చాం. సెంట్రల్ యాక్టు ద్వారా ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో పరిశోధనా పద్ధతులు, ఇతర విషయాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చాం. – జె.శశిబిందు, ఏడీఏ, ఎరువుల పరిశోధన, సెంట్రల్ ల్యాబ్, తాడేపల్లిగూడెం -
త్వరలోనే రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్, ఎఫ్‌సీఐ అనే మూడు ప్రభుత్వరంగ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాయని లోక్‌సభలో పెట్రోలియంశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం తెలిపారు. డిసెంబర్ 31లోగా జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటవుతుందని, వచ్చే మార్చి 31 నాటికి ఒప్పందం కుదురుతుందని వివరించారు.