తాడేపల్లిగూడెంలోని విత్తన పరీక్ష కేంద్రం కార్యాలయం
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎరువులు, విత్తన, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను పండించేందుకు ఎంతో దోహపడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ ల్యాబ్ ద్వారా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్ సిబ్బందికి సైతం నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ రైతు సేవలో తరిస్తున్నాయి.
తాడేపల్లిగూడెం: భూమాతను నమ్ముకుని హలం పట్టి పొలం దున్ని స్వేదం చిందించి పుడమితల్లి ధాన్యపు రాశులతో, పంటలతో విరాజిల్లడానికి కృషి చేసే రైతులకు విత్తనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు దివిటీలుగా మారాయి. ఆర్‌బీకేలు, అగ్రిల్యాబ్‌లు వ్యవసాయంలో వినూత్న మార్పులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో వ్యవసాయం పండుగగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాడేపల్లిగూడెంలో ఎరువులు, పురుగుమందులు, విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక మార్గదర్శనం సైతం గూడెంలోని సెంట్రల్ ల్యాబ్ ద్వారా అందుతోంది. ఈ ల్యాబ్‌ల ద్వారా అందుతున్న సేవలు ఇలా ఉన్నాయి.
ఆరు జిల్లాలకు విత్తన పరీక్షలు
ధాన్యం, కూరగాయలు, అపరాల వంగడాలలో మొలకశాతాన్ని విశ్లేషించి ఫలితాలను రైతులకు అందజేయడానికి తాడేపల్లిగూడెంలో 1972లో విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, అపరాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలలో మొలకశాతాన్ని విశ్లేషించి నాణ్యతను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు సేవలందిస్తున్నారు. వ్యవసాయాధికారులు, ఏడీఏల ద్వారా వంగడాల శాంపిల్స్ ఇక్కడకు వస్తాయి. వాటిలో మొలకశాతాలను వివిధ దశల్లో పరీక్షల ద్వారా నిర్థారించి ఫలితాలను 30 రోజుల వ్యవధిలో పంపిస్తారు. శీతలీకరణ పద్ధతుల్లో విత్తనాలను భద్రపర్చి తర్వాత మొలకశాతాలను పరిశీలిస్తారు.
రాష్ట్రంలోని మూడింటిలో ఒకటి
1979 ఫిబ్రవరి 17న ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు మొత్తం మూడు ఉండగా, ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయగా, మిగిలినవి అనంతపురం, బాపట్లలో ఉన్నాయి. వీటిని లీగల్ ల్యాబ్స్ అని కూడా అంటారు. అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి, సాంకేతికపరమైన శిక్షణ ఈ ల్యాబ్ ద్వారా ఇచ్చారు. ఎరువులలో కల్తీ, నాణ్యత పరిశీలనకు నమూనాలను ఇక్కడకు పంపిస్తారు. గుంటూరులో కోడింగ్ సెంటర్‌కు ఈ నమూనాలు చేరితే, అక్కడి నుంచి ఇక్కడి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. గతంలో 60 రోజుల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, ప్రస్తుతం అధునాతన పరీక్ష యంత్రాలు అందుబాటులోకి రావడంతో 2018 నుంచి 15 రోజుల్లోనే ఫలితాలను తేల్చేస్తున్నారు. ఫరీదాబాద్‌లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన నిపుణులు ఈ ల్యాబ్‌లో సేవలందిస్తున్నారు.
ప్రమాణాలకు తగ్గట్టుగా పురుగుమందు పరీక్షలు
1984 మే రెండో తేదీన ఇక్కడ పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా 68 ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏడు ల్యాబ్‌లుండగా, రాష్ట్ర విభజనలో రెండు వరంగల్, రాజేంద్రనగర్ ల్యాబ్‌లు తెలంగాణలోకి వెళ్లాయి. మిగిలిన ఐదు ల్యాబ్‌లు రాష్ట్రానికి దక్కాయి. వాటిలో ఒకటి తాడేపల్లిగూడెం ల్యాబ్ కాగా, గుంటూరు అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణాలలో ల్యాబ్‌లు ఉన్నాయి. పురుగుమందుల్లో మూల పదార్థం స్థాయి ప్రమాణాల పరిమితికి అనుకూలంగా ఉందో లేదా అనేది ఈ పరీక్ష కేంద్రాల్లో నిర్ధారిస్తారు. గుంటూరులో ఉన్న కోడింగ్ సెంటర్‌కు తిరిగి ఫలితాలను పంపిస్తారు. పురుగుమందుల్లో క్రియాశీల పదార్థా శాతాన్ని పరీక్షిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు.
సిబ్బందికి శిక్షణ ఇచ్చాం
జిల్లాలో ఏర్పాటుచేసే అగ్రిల్యాబ్ లలో పనిచేసే సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చాం. సెంట్రల్ యాక్టు ద్వారా ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో పరిశోధనా పద్ధతులు, ఇతర విషయాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చాం.
– జె.శశిబిందు, ఏడీఏ, ఎరువుల పరిశోధన, సెంట్రల్ ల్యాబ్, తాడేపల్లిగూడెం
Comments
Please login to add a commentAdd a comment