Testing centers
-
పశువీర్య ఉత్పత్తిలో నంద్యాలదే అగ్రస్థానం
సాక్షి, బొమ్మల సత్రం(కర్నూలు): పశుజాతి అంతరించిపోతున్న ఈ రోజుల్లో నాణ్యమైన వీర్యాన్ని అందించి పశువులను ఉత్పత్తి చేయడంలో నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రం కీలకం పాత్ర పోషిస్తుంది. ఏడాదికి 10 లక్షల నుండి 20 లక్షల వరకు డోస్‌ల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ సంస్థలో 10 జాతుల పశువులను వీర్యాన్ని సేకరించి భద్రపరిచి అవసరమైన జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలో కూడా ఈ కేంద్రం నుండి వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు. నంద్యాల పశుగణాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రంపై సాక్షి ప్రత్యేక కథనం. పట్టణంలోని కడప – కర్నూలు జాతీయ రహదారి పక్కన నూనెపల్లెలోని 15.27 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ పశుగణనాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రం ఉంది. ఈ కేంద్రం 1976 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన నంద్యాలలో ప్రారంభించారు. ఈ ఘనీకృత వీర్య కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, సిబ్బంది పని చేస్తున్నారు. 15.27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఘనీకృత వీర్య కేంద్రం 5 ఎకరాలలో భవనాలు ఉండగా 10.27 ఎకరాలలో ఆబోతులకు కావాల్సిన సూపర్ నేపియర్, కాకిజొన్న, గనిగడ్డి లాంటి నాణ్యమైన పశుగ్రాసాన్ని పండిస్తున్నారు. వీర్య నాశికలను సరైన సమయంలో ఉత్పత్తి చేసి సరఫరా చేయడం. నిరంతరం వీర్య నాణ్యతను పరిశీలిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచించిన మినిమం స్టాండెడ్స్ ప్రోటోకాల్‌ను పాటించడం ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం.1982లో ఘనీకృత పశువీర్యాన్ని నంద్యాలలోనే ఉత్పత్తి చేయడం ప్రారంభించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరఫరా చేశారు. 2000 సంవత్సరంలో ఈ కేంద్రం అభివృద్ధి చెంది ఆంధప్రదేశ్ పశుగణనాభివృద్ధి సంస్థలో చేర్చారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రంలో పలుజాతుల పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరుస్తారు. ఇక్కడ ఉన్న ఆబోతులను బయోసెక్యూలర్ జోన్లో ఉంచి వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేసి ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ ఘనీకృత వీర్యకేంద్రంలో తయారు చేసిన వీర్యనాశికలు మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కేరళ, కలకత్తా, భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన వీర్య ఉత్పత్తి ఇలా.. ఒక్కొక్క వీర్యనాశికలో 0.25 ఎంఎల్ వీర్యం ఉంటుంది. అందులో దాదాపుగా 2 కోట్ల వీర్యకణాలు ఉంటాయి. వీర్యంను సేకరించిన తర్వాత దానిని పరీక్షించి భద్రపరుస్తారు. ఉత్పత్తి చేసిన వీర్యంతో పశువుకు గర్భదారణ చేసిన అనంతరం పశువు అనారోగ్యానికి గురి కాకుండా చూస్తారు. వీర్యంలో నిర్దేశించిన కణాల శాతం కచ్చితంగా ఉండేలా చూస్తారు. ఆబోతులు అనారోగ్యానికి గురి కాకుంగా పలుజాగ్రత్తలు తీసుకుంటారు. అనంతరం ఈ వీర్యాన్ని విశాఖపట్నంలోని ఆండ్రాలజీ ల్యాబోరేటరీకి పంపి నాణ్యతను పరీక్షించి అనంతరం ఇక్కడ నుండి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. సంస్థ సాధించిన విజయాలు.. ► 2007 సంవత్సరంలో మానిటరింగ్ యూనిట్‌చే నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఏగ్రేడ్ సాధించింది. 2010లో బీగ్రేడ్ను సాధించింది. ► 2013సంవత్సరంలో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ వారు నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రానికి ఏగ్రేడ్ రెండవ సారి ప్రధానం చేశారు. ఈ సంవత్సరంలోనే నంద్యాల నుండి జేకే ట్రస్టు ద్వారా అదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బాసరా, తమిళనాడు రాష్ట్రాలకు వీర్యనాశికులు సరఫరా చేసింది. ► 2016–17 సంవత్సరంలో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ వారిచే మూడవసారి నాణ్యమైన వీర్య ఉత్పత్తిలో ఏగ్రేడు సాధించింది. -
రైతులకు వెన్నుదన్నుగా అగ్రిల్యాబ్‌లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎరువులు, విత్తన, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను పండించేందుకు ఎంతో దోహపడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ ల్యాబ్ ద్వారా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్ సిబ్బందికి సైతం నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ రైతు సేవలో తరిస్తున్నాయి. తాడేపల్లిగూడెం: భూమాతను నమ్ముకుని హలం పట్టి పొలం దున్ని స్వేదం చిందించి పుడమితల్లి ధాన్యపు రాశులతో, పంటలతో విరాజిల్లడానికి కృషి చేసే రైతులకు విత్తనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు దివిటీలుగా మారాయి. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్‌లు వ్యవసాయంలో వినూత్న మార్పులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో వ్యవసాయం పండుగగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాడేపల్లిగూడెంలో ఎరువులు, పురుగుమందులు, విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక మార్గదర్శనం సైతం గూడెంలోని సెంట్రల్ ల్యాబ్ ద్వారా అందుతోంది. ఈ ల్యాబ్‌ల ద్వారా అందుతున్న సేవలు ఇలా ఉన్నాయి. ఆరు జిల్లాలకు విత్తన పరీక్షలు ధాన్యం, కూరగాయలు, అపరాల వంగడాలలో మొలకశాతాన్ని విశ్లేషించి ఫలితాలను రైతులకు అందజేయడానికి తాడేపల్లిగూడెంలో 1972లో విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, అపరాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలలో మొలకశాతాన్ని విశ్లేషించి నాణ్యతను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు సేవలందిస్తున్నారు. వ్యవసాయాధికారులు, ఏడీఏల ద్వారా వంగడాల శాంపిల్స్ ఇక్కడకు వస్తాయి. వాటిలో మొలకశాతాలను వివిధ దశల్లో పరీక్షల ద్వారా నిర్థారించి ఫలితాలను 30 రోజుల వ్యవధిలో పంపిస్తారు. శీతలీకరణ పద్ధతుల్లో విత్తనాలను భద్రపర్చి తర్వాత మొలకశాతాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని మూడింటిలో ఒకటి 1979 ఫిబ్రవరి 17న ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు మొత్తం మూడు ఉండగా, ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయగా, మిగిలినవి అనంతపురం, బాపట్లలో ఉన్నాయి. వీటిని లీగల్ ల్యాబ్స్ అని కూడా అంటారు. అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి, సాంకేతికపరమైన శిక్షణ ఈ ల్యాబ్ ద్వారా ఇచ్చారు. ఎరువులలో కల్తీ, నాణ్యత పరిశీలనకు నమూనాలను ఇక్కడకు పంపిస్తారు. గుంటూరులో కోడింగ్ సెంటర్‌కు ఈ నమూనాలు చేరితే, అక్కడి నుంచి ఇక్కడి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. గతంలో 60 రోజుల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, ప్రస్తుతం అధునాతన పరీక్ష యంత్రాలు అందుబాటులోకి రావడంతో 2018 నుంచి 15 రోజుల్లోనే ఫలితాలను తేల్చేస్తున్నారు. ఫరీదాబాద్‌లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన నిపుణులు ఈ ల్యాబ్‌లో సేవలందిస్తున్నారు. ప్రమాణాలకు తగ్గట్టుగా పురుగుమందు పరీక్షలు 1984 మే రెండో తేదీన ఇక్కడ పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా 68 ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏడు ల్యాబ్‌లుండగా, రాష్ట్ర విభజనలో రెండు వరంగల్, రాజేంద్రనగర్ ల్యాబ్‌లు తెలంగాణలోకి వెళ్లాయి. మిగిలిన ఐదు ల్యాబ్‌లు రాష్ట్రానికి దక్కాయి. వాటిలో ఒకటి తాడేపల్లిగూడెం ల్యాబ్ కాగా, గుంటూరు అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణాలలో ల్యాబ్‌లు ఉన్నాయి. పురుగుమందుల్లో మూల పదార్థం స్థాయి ప్రమాణాల పరిమితికి అనుకూలంగా ఉందో లేదా అనేది ఈ పరీక్ష కేంద్రాల్లో నిర్ధారిస్తారు. గుంటూరులో ఉన్న కోడింగ్ సెంటర్‌కు తిరిగి ఫలితాలను పంపిస్తారు. పురుగుమందుల్లో క్రియాశీల పదార్థా శాతాన్ని పరీక్షిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం జిల్లాలో ఏర్పాటుచేసే అగ్రిల్యాబ్ లలో పనిచేసే సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చాం. సెంట్రల్ యాక్టు ద్వారా ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో పరిశోధనా పద్ధతులు, ఇతర విషయాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చాం. – జె.శశిబిందు, ఏడీఏ, ఎరువుల పరిశోధన, సెంట్రల్ ల్యాబ్, తాడేపల్లిగూడెం -
తెలుగు రాష్ట్రాల్లో అలర్జీ పరీక్ష కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: అన్ని రకాల అలర్జీలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జెరాత్ పాథ్ ల్యాబ్స్, అలర్జీ టెస్టింగ్ సెంటర్ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 80 నుంచి 130 అలర్జీలకు సంబంధించిన పరీక్షలను 50 శాతానికి పైగా రాయితీతో చేయనున్నట్లు పేర్కొంది. జూలై 2, 3, 4, 5వ తేదీల్లో ఈ కేంద్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. అలర్జీ పరీక్షలతో పాటు థైరాయిడ్, కిడ్నీ, లివర్, కీళ్లు, లిపిడ్, ఎలక్ట్రోలైట్స్ వంటి 40 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది. -
Covid Test: 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు
యాంటీజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆ ఫలితాన్ని నమ్మలేం. కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. కానీ చాలా మంది చేయించుకోవట్లేదు. అందుకే మరిన్ని ఆర్టీపీసీఆర్ కేంద్రాలు. వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రామగుండం, భువనగిరి, జనగాం, వికారాబాద్ జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు. సాక్షి, హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు కొత్తగా 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తు న్నారు. ప్రస్తుతం 17 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీనికోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణకు 2 రకాల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ర్యాపిడ్ యాంటిజెన్, రెండోది ఆర్టీపీసీఆర్. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ద్వారా పావు గంటలోనే ఫలితం వస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే, అది పూర్తిగా కరెక్టే. కానీ నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం దాని ఫలితాన్ని పూర్తిగా నమ్మలేం. మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనేది నిబంధన. చాలామంది యాంటిజెన్ పరీక్ష చేయించుకొని అందులో నెగటివ్ వచ్చి.. లక్షణాలున్నా కూడా సాధారణంగా తిరిగేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం లేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అంతగా అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణం. ఇలా అనేక కేసులు మిస్ కావడం, సీరియస్ అవుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. అంతేకాదు రాష్ట్రంలో 90 శాతంపైగా ర్యాపిడ్ పరీక్షలే జరుగుతున్నాయని కేంద్రం ఇటీవల వెల్లడించింది. 10 శాతంలోపే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయంది. దీంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. యాంటిజెన్ పరీక్ష ద్వారా పాజిటివ్ ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించడానికి వీలుంది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాలంటే ఇప్పుడు రెండుమూడు రోజులకు కూడా ఫలితం రావడంలేదు. ఒక్కోసారి వారం సమయం కూడా పడుతోంది. అందుకే వైద్యాధికారులు, ప్రజలు యాంటిజెన్ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు. కొత్తగా ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుపడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
కోవిడ్ టెస్టింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు తప్పని తిప్పలు
-
డ్రోన్ల ద్వారా కరోనా టెస్ట్ కిట్ల సరఫరా
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ఇద్దరు ట్రైనీ డాక్టర్లు ప్రారంభించిన స్టార్టప్ ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. హమాద్ జిలానీ, క్రిస్టోఫర్ లా అనే ఈ వైద్యులు మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి సేకరించిన కరోనా వైరస్ నమూనాలు, టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి.. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు డ్రోన్ల ద్వారా చేరవేయడమే దీని ఉద్దేశ్యం. ఈ డ్రోన్లకు చిన్న రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు 2 కిలోల బరువును 96 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలవు. మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.12.48 కోట్ల ఆర్థిక సాయం అందజేయడానికి యూకే అంతరిక్ష పరిశోధనా సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుకొచ్చాయి. వైరస్ శాంపిల్స్, టెస్టింగ్ కిట్లను డ్రోన్లతో చేరవేస్తే కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చని జిలానీ, క్రిస్టోఫర్ లా చెబుతున్నారు. -
మొబైల్ కరోనా పరీక్షాకేంద్రాలుగా వజ్ర బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి గుదిబండగా మారి, నష్టాలు మూటగట్టిన వజ్ర మినీ బస్సులు కోవిడ్ పరీక్షల విషయంలో బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రయోగాత్మకంగా ఇటీవల 3 వజ్ర ఏసీ బస్సులను కోవిడ్ సం చార పరీక్షాకేంద్రాలుగా మార్చారు. వాటిని రవాణామంత్రి పువ్వాడ అజయ్ సొంత జిల్లా ఖమ్మంలో వినియోగిస్తున్నారు. నిత్యం ఈ బస్సుల ద్వారా దాదాపు 750 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనివ్వడంతో మిగతా బస్సులను కూడా సం చార ల్యాబ్‌లుగా మార్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పట్లో కోవిడ్ సమస్య సమసిపోయేలా లేకపోవటంతో మిగతాజిల్లాలకు కూడా వీటిని ల్యాబ్‌లుగా మార్చి వినియోగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కో బస్సు మార్పిడికి రూ.1.15లక్షలు ఆర్టీసీలో వంద వరకు వజ్ర బస్సులున్నాయి. వీటిల్లో యాక్సిడెంట్లు అయినవి, మరమ్మతులకు నోచుకోనివి పోను 66 బస్సులు కండీషన్లో ఉన్నాయి. కోవిడ్ సమస్య ఉత్పన్నం కాకముందు వరకు ఆ బస్సులు నడిచాయి. అయితే వాటికి ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండి భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో గతేడాది సమ్మె తర్వాత ఈ బస్సులను వేలం వేసి అమ్మేయాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు వీటిని కొనే అవకాశం ఉండటంతో ధర కూడా మెరుగ్గానే పలుకుతుందని ఆర్టీసీ భావించింది. అయితే కోవిడ్ సమస్య కారణంగా ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇవి ఏసీ బస్సులు కావటంతో కోవిడ్ పరీక్షకు అనువుగా ఉంటాయని భావించి ప్రయోగాత్మకంగా మూడు బస్సులను ఆర్టీసీ వర్క్‌షాపులోనే కోవిడ్ సంచార ప్రయోగశాలలుగా మార్చారు. వాటిని ఖమ్మంకు కేటాయించటం తో అక్కడ సత్ఫలితాలనిస్తున్నాయి. ఒక్కో బస్సుల్లో ముగ్గురు టెక్నీషియన్లు ఉండేలా ఏర్పాటు చేశారు. బస్సు వెలుపల కరోనా అనుమానితులు నిలబడితే, కిటికీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా టెక్నీషియన్లు నమూనాలు సేకరించేలా ఏర్పాటు చేశారు. ఇది సురక్షితంగా ఉండటంతో టెక్నీషియన్లు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా నమూనాలు సేకరిస్తున్నారు. మినీ బస్సులు కావటంతో ఇరుకు ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోగలుగుతున్నాయి. కోవిడ్ సమస్య మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉన్నందున మిగతా 63 బస్సులను కూడా సంచార ప్రయోగశాలలుగా మార్చి ఇతర జిల్లాలకు కేటాయించాలనే సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ సమస్య సమసిన తర్వాత వేలం రూపంలో బస్సులను అమ్మేయబోతున్నారు. -
సరైన సమయంలో సరైన నిర్ణయాలు: మోదీ
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటం విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నోయిడా, ముంబై, కోల్‌కతాలో కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలను ఆయన సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనవరిలో దేశంలో కరోనా టెస్టులు జరిపేందుకు ఒకే సెంటర్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,300కు చేరిందని ప్రధాని తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్య రోజుకు 5 లక్షలకు పెరిగిందని చెప్పారు. నోయిడా, ముంబై, కోల్‌కతాల్లో ప్రారంభిస్తున్న ఈ టెస్టింగ్ సెంటర్లలో రోజుకు 10 వేలకు పైగా శాంపిళ్లను పరీక్షించగలవని మోదీ అన్నారు. -
తెలంగాణ : 27 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 27 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ రెండు రోజుల క్రితం సవరించిన ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో 9 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా, 18 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌లలో ఉచితంగా పరీక్షలు నిర్వహించనుండగా, ప్రైవేటు ల్యాబ్‌లలో మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించి పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ల్యాబ్‌లు ఇవీ.. ► గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్ ► ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్ ► సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్–కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్ ► నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), హైదరాబాద్ ► ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) హైదరాబాద్ ► ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, హైదరాబాద్ ► కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ ► సెంటర్ ఫర్ సెల్యులార్–మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ ► సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్– డయా గ్నొస్టిక్స్, హైదరాబాద్. ప్రైవేటు ల్యాబ్స్ ఇవే.. ► జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లేబొరేటరీ సర్వీసెస్ ► హిమాయత్‌నగర్‌లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్ ► చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ ► అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లేబొరేటరీ బోయినపల్లి ► పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ ► మేడ్చల్‌లోని పాత్ కేర్ ల్యాబ్‌లు ► లింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్ ► న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్ పాత్లాబ్స్ ► సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం ► మల్కాజిగిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్ ► బంజారాహిల్స్‌లో టెనెట్ డయాగ్నొస్టిక్స్ ► ఏఐజీ హాస్పిటల్, మైండ్‌స్పేస్, గచ్చిబౌలి ► మాదాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్ ► బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్ ► సికింద్రాబాద్‌లోని కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ► లెప్రా సొసైటీ–బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి ► సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నొస్టిక్స్ ► బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్ -
డెంగ్యూ, చికున్ గున్యాకు చెక్
సత్వర వైద్యానికి చర్యలు ► రాష్ట్రంలో కొత్తగా 20 పరీక్ష కేంద్రాలు ► ఈ ఏడాది ఏడు ప్రారంభం వచ్చే ఏడాది మరో 13 ఏర్పాటు ► ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శరీరంలోని అన్ని వ్యవస్థల ను దెబ్బతీస్తూ... జీవితకాలం ఆరోగ్య సమస్య లను తెస్తున్న డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులను వెంటనే గుర్తించి వేగంగా చికిత్స అందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆరోగ్య శాఖ భావిస్తోంది. నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14 చోట్ల డెంగ్యూ, చికున్ గున్యా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భద్రాచలం, కొత్తగూడెం కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమ య్యాయి. సిద్దిపేట, తాండూరు, కామారెడ్డి, నిర్మల్, బాన్సువాడలో త్వరలో కొత్త కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాక వచ్చే ఏడాది మరో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఉండడంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నవి, కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 34 పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీం తో వేగంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స జరగ నుంది. దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్ర తపై అందరికీ అవగాహన కల్పిస్తూ నే... చికున్ గున్యా, డెంగ్యూ చికిత్సను వేగంగా అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అదన పు సంచాలకురాలు ఎస్.ప్రభావతి తెలిపారు. చికున్ గున్యా, డెంగ్యూ పరీక్ష కేంద్రాలు ప్రస్తుతం పని చేస్తున్నవి: వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని ఐపీఎం, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, రొనాల్డ్ రాస్ ఆస్పత్రులు. ప్రతిపాదిత కేంద్రాలు యాదాద్రి, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, జనగామ, మహబూబాబాద్, అర్మూర్, బోధన్. డెంగ్యూ కేసులు... జిల్లా పేరు 2016 2017 ఖమ్మం 1416 205 హైదరాబాద్ 780 71 రంగారెడ్డి 568 31 నిజామాబాద్ 258 18 కరీంనగర్ 210 15 వరంగల్ 207 08 మహబూబ్‌నగర్ 122 12 మెదక్ 93 11 నల్లగొండ 66 01 ఆదిలాబాద్ 39 04 వివరాలు.. 2017 ఆగస్టు 16 వరకు. చికున్ గున్యా కేసులు జిల్లాల వారీగా జిల్లా పేరు 2016 2017 హైదరాబాద్ 22 5 మహబూబ్‌నగర్ 23 3 ఖమ్మం 15 0 రంగారెడ్డి 7 2 నిజామాబాద్ 1 1 ఆదిలాబాద్ 0 1 వరంగల్ 0 1. -
ఆరు కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలు
నగరంలో ఆరు కేంద్రాల్లో పరీక్ష చిత్తూరు (గిరింపేట) : మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు చిత్తూరులో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆర్ఐవో నాగభూషణం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. ఎక్కడగానీ మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్షలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదన్నారు. చిత్తూరులోని కణ్ణన్, పీసీఆర్, నారాయణ, విజ్ఞాన సుమ, క్రిష్ణవేణి, విజయం కళాశాలల్లో పరీక్ష లు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 2 నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. తనిఖీ నిమిత్తం ఫ్లైయింగ్ స్క్వాడ్లను సైతం నియమించినట్లు తెలిపారు. -
నిమిషం లేటైనా... నో ఎంట్రీ
కన్వీనర్ ఎన్వీ రమణరావు రేపే ఎంసెట్-2014 ప్రవేశపరీక్ష నగరంలో 8 జోన్లు.. 148 పరీక్ష కేంద్రాలు గ్రేటర్ నుంచి 81,445 మంది అభ్యర్థులు మెడిసిన్‌కు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికం సాక్షి, సిటీబ్యూరో: ‘ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)-2014 గురువారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరుగుతాయి. అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తాం. నిమిషం లేటుగా వచ్చినా అనుమతించం. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చే శాం. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టాం’ అని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు పేర్కొన్నారు. నగరంలో ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన విలేకరులకు వివరించారు. మరో 24గంటల్లో ఎంసెట్ పరీక్షకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. కన్వీనర్ ఏం చెప్పారంటే.. నగరంలో మెట్రోపనులు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు వారి నివాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల రేడియస్‌లో పరీక్షా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకు ఈసారి మెడికల్ పరీక్ష ఉన్న కేంద్రాల్లో ఇంజినీరింగ్ అభ్యర్థుల సంఖ్యను తగ్గించాం. గతంలో మాదిరిగానే ‘నిమిషం లేటు’ నిబంధన ఈసారి కూడా అమల్లో ఉంది. ఒక్క నిమిషం లేటైనా అనుమతించం. అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులు పరీక్షాకేంద్రాన్ని ఒకరోజు ముందుగా చూసుకుంటే మేలు. చివరి నిమిషంలో పరీక్షాకేంద్రం ఎక్కడుందోనన్న హైరానా తప్పుతుంది. అలాగే ఒక అభ్యర్థి వెంట అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు వీలైనంత వరకు(ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా) రాకుండా ఉంటే మంచిది. అభ్యర్థులు తమ వెంట కేవలం బాల్‌పాయింట్ పెన్నులు, హాల్‌టికెట్, ఆన్లైన్ దరఖాస్తు ఫారం, ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారైతే కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే చాలు. సెల్ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలు.. వగైరా గ్యాడ్జెట్లు నిషేధం. తెల్లకాగితం తెచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షాకేంద్రాల సమీపంలో ఉండే హోటళ్లు, దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలపై మఫ్టీలో ఉన్న పోలీసుల నిఘా ఉంటుంది. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్ష హాల్లోనూ ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. 24న ప్రాథమిక కీ ప్రకటిస్తాం. వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి తుది కీని వెలువరిస్తాం. జూన్ 9న ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశాం. దళారులను నమ్మొద్దు. ప్రలోభాలకు గురికావద్దు. మాయమాటలు చెబుతున్న వారి సమాచారాన్ని పోలీసులకు గానీ, ఎంసెట్ అధికారులకు గానీ తెల్పండి. ఎంసెట్ ప్రక్రియంతా పారదర్శకంగా ఉంటుంది. 81,445మంది అభ్యర్థులు ఎంసెట్-2014కి నగరం నుంచి 81,445మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు 58242మంది అభ్యర్థులు ఉండగా, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 23203మంది అభ్యర్థులున్నారు. ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో అబ్బాయిలు 37,644మంది ఉండగా, అమ్మాయిలు 20,598మంది ఉన్నారు. మెడికల్ అండ్ అగ్రికల్చర్‌కు మాత్రం అబ్బాయి కంటే అమ్మాయిలే అధికంగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష 7197మంది అబ్బాయిలు రాస్తుండగా, రెట్టింపు సంఖ్యలో 16006 మంది అమ్మాయిలు రాస్తున్నారు. నగరంలో ఇంజినీరింగ్ పరీక్షకు 100 కేంద్రాలు, మెడికల్ పరీక్షకు ఏకంగా 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు.