నగరంలో ఆరు కేంద్రాల్లో పరీక్ష
చిత్తూరు (గిరింపేట) : మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు చిత్తూరులో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆర్‌ఐవో నాగభూషణం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. ఎక్కడగానీ మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్షలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదన్నారు.
చిత్తూరులోని కణ్ణన్, పీసీఆర్, నారాయణ, విజ్ఞాన సుమ, క్రిష్ణవేణి, విజయం కళాశాలల్లో పరీక్ష లు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 2 నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. తనిఖీ నిమిత్తం ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను సైతం నియమించినట్లు తెలిపారు.