ఇన్విజిలేటర్‌ కొట్టాడని విద్యార్థి బలవన్మరణం | Forced death of the student | Sakshi
Sakshi News home page

ఇన్విజిలేటర్‌ కొట్టాడని విద్యార్థి బలవన్మరణం

Published Sat, Jun 24 2023 3:10 AM | Last Updated on Sat, Jun 24 2023 3:10 AM

Forced death of the student - Sakshi

నర్సంపేట రూరల్‌: పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ చేస్తుండగా ఇన్విజిలేటర్‌ మందలించి, చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన భూక్యా ఈర్య– పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు భూక్య సాయికుమార్‌ (23) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

బ్యాక్‌లాగ్‌లు ఉండడంతో అదే పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సెంటర్‌లో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడటంతో గమనించిన ఇన్విజిలేటర్‌.. సాయికుమార్‌ను మందలించి కొట్టాడు. దీంతో మనోవేదనకు గురై, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయికుమార్‌ మృతికి ఇన్విజిలేటర్, యాజమాన్యం కారణమంటూ కుటుంబ సభ్యులు.. మృతదేహంతో కాలేజీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు.

ఉద్రిక్తత నెలకొనడంతో కళాశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులతో మాట్లాడిన నర్సంపేట సీఐ పులి రమేష్‌çగౌడ్‌... మృతదేహాన్ని గ్రామానికి పంపించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్‌ రామ్‌రాజ్‌ను వివరణ కోరగా... సాయి కుమార్‌ అనే విద్యార్థి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌తోపాటు బుక్‌లెట్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని, గుర్తించిన ఇన్విజిలేటర్‌ మందలించి, తమ వద్దకు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థి రిక్వెస్ట్‌తో పరీక్ష రాసేందుకు అనుమతించామే తప్ప.. ఎవరూ కొట్టలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement