invigilators
-
82 మార్కులు సాధిస్తే 18 వేశారు!
బత్తలపల్లి: పదో తరగతిలో ఫెయిల్‌గా చూపిన ఓ విద్యార్థి.. జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 82 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. వివరాలు... బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన గోగుల సూర్యనారాయణ కుమారుడు అంజి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివాడు. ఈ ఏడాది మార్చిలో బత్తలపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ కేంద్రంగా పబ్లిక్ పరీక్షలు రాశాడు. తెలుగులో 98, హిందీ 89, గణితం 92, భౌతిక శాస్త్రం 87, సాంఘిక శాస్త్రంలో 86 మార్కులు సాధించాడు. అయితే ఇంగ్లిష్‌లో కేవలం 18 మార్కులు వేయడంతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. మెరిట్ విద్యారి్థగా మన్ననలు పొందిన అంజి ఫెయిల్ అయ్యాడనగానే ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. మానసికంగా కుదేలైన బాధిత విద్యారి్థకి సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ధైర్యం చెప్పి వెంటనే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయించారు. ఈ ఫలితాలు సోమవారం అందాయి. 100కు 82 మార్కులు వచ్చాయి. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడు ఇన్ని రోజులు మానసిక వేదన అనుభవించాడని తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను కోరారు. -
ఇన్విజిలేటర్ కొట్టాడని విద్యార్థి బలవన్మరణం
నర్సంపేట రూరల్: పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ మందలించి, చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన భూక్యా ఈర్య– పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు భూక్య సాయికుమార్ (23) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బ్యాక్‌లాగ్‌లు ఉండడంతో అదే పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సెంటర్లో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం పరీక్షలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో గమనించిన ఇన్విజిలేటర్.. సాయికుమార్‌ను మందలించి కొట్టాడు. దీంతో మనోవేదనకు గురై, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయికుమార్ మృతికి ఇన్విజిలేటర్, యాజమాన్యం కారణమంటూ కుటుంబ సభ్యులు.. మృతదేహంతో కాలేజీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడంతో కళాశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులతో మాట్లాడిన నర్సంపేట సీఐ పులి రమేష్çగౌడ్... మృతదేహాన్ని గ్రామానికి పంపించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌రాజ్‌ను వివరణ కోరగా... సాయి కుమార్ అనే విద్యార్థి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తోపాటు బుక్‌లెట్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని, గుర్తించిన ఇన్విజిలేటర్ మందలించి, తమ వద్దకు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థి రిక్వెస్ట్‌తో పరీక్ష రాసేందుకు అనుమతించామే తప్ప.. ఎవరూ కొట్టలేదన్నారు. -
పదో తరగతి పరీక్షలు.. ఇన్విజిలేటర్లు ఎలా మెలగాలి?
ఏప్రిల్ 3 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు. పిల్లలు ఒత్తిడిలో ఉంటారు. పెద్దలు ఒత్తిడి పెడుతుంటారు. వీటికి తోడు పరీక్షా హాలులో ఇన్విజిలేటర్లు కూడా ఒత్తిడి పెడితే విద్యార్థుల పరిస్థితి సంకటంలో పడుతుంది. ‘ఇన్విజిలేటర్ల పని పిల్లలు ప్రశాంతంగా రాసేలా చూడటం. వారితో మృదువుగా ఉంటూనే పరీక్షల నియమ నిబంధనలు పాటించవచ్చు’ అంటారు పియాలి బెనర్జీ. ‘పిల్లలు ఎప్పుడూ కనిపించేలా అల్లరిగా కాకుండా గంభీరంగా మారిపోయే సమయం అది’ అంటుంది పియాలి బెనర్జీ పరీక్షల సమయం గురించి. ఆమె ముంబైలో సుదీర్ఘ కాలం హైస్కూల్లో ఇంగ్లిష్ బోధించింది. చాలాసార్లు ఇన్విజిలేటర్‌గా పని చేసింది. ‘ఇన్విజిలేటర్‌కు పిల్లలను పరీక్షలు రాయడానికి ఉత్సాహపరిచే స్వభావం ఉండాలి. అది లేనప్పుడు కనీసం ఊరికే ఉంటే చాలు. ఏవో ఒక మాటలు చెప్పి, గద్దించి వారిని నిరుత్సాహపరిచే హక్కు మాత్రం లేదు’ అంటుందామె. తాను ఇన్విజిలేటర్‌గా ఉన్నప్పుడు గమనించిన అంశాలు పియాలి చెప్పింది. ‘ఒకసారి ఒక పిల్లాడు తల ఒంచుకుని కూచుని ఉన్నాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అనుకున్నాను. రెండు నిమిషాలైనా కదల్లేదు. దగ్గరికెళ్లి చూశాను. నిద్రలో జారుకున్నాడు. పాపం రాత్రి ఎంతసేపు చదివాడో. మెల్లగా తట్టి లేపాను. ఉలిక్కిపడి లేచాడు. వాస్తవంలోకి వచ్చి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నానని గ్రహించి పూర్తిగా కంగారుపడిపోయాను. మెల్లగా చెప్పాను– ఐదు నిమిషాలే పడుకున్నావు. ఏం కొంపలు మునగలేదు. రాయి అని. స్థిమితపడి రాయడంలో పడ్డాడు. పరీక్ష అయ్యాక మొహమాటంగా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. తల్లిదండ్రులు పరీక్ష ముందురోజు రాత్రి తొమ్మిదిన్నరకంతా పిల్లలను నిద్రపోయేలా చూడాలి. పిల్లల్ని అలా చదువు ప్లాన్ చేసుకోమని చెప్పాలి. ఇంకోసారి ఇంకో పిల్లాడు మాటిమాటికి టైమ్ వైపు చూసుకుంటూ కంగారుగా రాస్తున్నాడు. టైమ్ సరిపోదేమోనని భయం. దగ్గరగా ఒంగి చెప్పాను– హైరానా పడకు. మూడు గంటల్లో పూర్తయ్యేలాగే నీ ప్రశ్నలు ఉంటాయి. వాచీ చూడకు. రాసుకుంటూ వెళ్లు. నేను టైమ్ అలెర్ట్ చెప్తానుగా అన్నాను. పిల్లలను టైమ్ చాలదని భయపెట్టకూడదు’ అంటుంది పియాలి బెనర్జీ. కొంతమంది పిల్లలు హడావిడిలో పెన్ను పెన్సిల్ కూడా తీసుకురారు. ఇంక్ అయిపోయిందని పెన్ కోసం అడుగుతారు. అప్పుడు వారిని సూటిపోటిగా ఏదో ఒక మాట అంటే తర్వాత ఏం రాస్తారు? చిర్నవ్వుతో ఒక పెన్ అందిస్తే ఏం పోతుంది?’ అంటుందామె. ఎగ్జామినేషన్ హాల్లో పెద్దగా అరవడం సరిౖయెన పద్ధతి కాదు అంటుందామె. ఎవరైనా కాపీ చేస్తూనో మరో కోతి పని చేస్తూనో దొరికిపోయినా హాలంతా అదిరిపోయేలా అరిచి అందరు పిల్లలనూ బెంబేలెత్తించకూడదు. చాలా నిశ్శబ్దంగానే ఆ కాపీ చేస్తున్న పిల్లలను హాలు బయటకు తీసుకెళ్లి వ్యవహారం తేల్చాలి అంటుందామె. ‘పిల్లలు ఏవైనా అనవసరమైనవి పెట్టుకున్నారా తమ దగ్గర అని ఒకసారి చెక్ చేస్తే చాలు. పరీక్ష మధ్యలో మాటి మాటికి వారిని శల్యపరీక్షకు గురి చేసి ఏకాగ్రతను భంగం కలిగించకూడదు’ అని చెబుతుంది. ‘పిల్లలు సరిగ్గా తమ నంబర్ వేశారో లేదో చెక్ చేయడం ఇన్విజిలేటర్ ప్రధానమైన పని. అది మాత్రం ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్లి చెక్ చేసి వారికి ఓకే చెప్పాలి. లేదంటే పరీక్ష రాసి ఇంటికెళ్లినా నంబర్ సరిగ్గా వేశానా లేదా అని కంగారు పడతారు’’ అంటుంది పియాలి. పదో తరగతి పరీక్షలంటే పిల్లలు జీవితంలో మొదట ఎదుర్కొనే పరీక్షలు. ఆ సమయంలో ఇన్విజిలేటర్లు వారి దృష్టితో ఆలోచించి వీలైనంత కంఫర్ట్‌గా పరీక్ష రాసేలా చూడాలి. వారు రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్లు శ్రద్ధగా, విసుగు లేకుండా ఉండటం అన్నింటి కంటే ముఖ్యం అని సూచిస్తున్నదామె. -
ప్రశ్నపత్రం..పచ్చ కుట్ర
అనంతపురం విద్య/ సిటీ/ కదిరి: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అందరి మన్ననలు పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అంటూ పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లాలో పదో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో షేర్ చేసిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇదంతా కుట్ర అని పోలీసులు సాక్ష్యాధారాలతో సహా తేల్చారు. ప్రశ్నపత్రం ఫొటో తీసి తన సన్నిహితుడికి పంపించిన నల్లచెరువు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కె.విజయకుమార్‌ను అరెస్టు చేసి..రిమాండ్‌కు పంపించారు. ఈయన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట ప్రసాద్ ప్రధాన అనుచరుడు. దీన్నిబట్టి చూస్తే పచ్చ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా ఫొటో తీసిన విజయ్‌కుమార్ 2006లో రివాల్వర్ కేసులో అనంతపురం వన్‌టౌన్ పోలీసులు టీడీపీ నేత కందికుంట ప్రసాద్‌తో పాటు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసులో వీరు నెల రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. అప్పుడు సస్పెండ్ అయిన విజయ్‌కుమార్ రెండేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం నల్లచెరువు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంగా ఉండగా.. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో గాండ్లపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌గా అధికారులు నియమించారు. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్ ప్రశ్నపత్రం ఫొటో తీసి.. తనకు బాగా సన్నిహితుడైన నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ద్వారా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయించారు. శ్రీనివాసరావు బంధువుల అమ్మాయి పదో తరగతి పరీక్ష రాస్తుండగా.. ఆమెకు సహకరించే కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు మొబైల్‌ను పరీక్ష కేంద్రంలోకి పంపించారు. స్వయంగా విజయ్‌కుమారే ప్రశ్నపత్రం ఫొటో తీసి పంపించారు. ఇదే అదనుగా భావించిన శ్రీనివాసరావు పరీక్ష ప్రారంభమైన తర్వాత దాన్ని ఓడీచెరువు వైఎస్సార్సీపీ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. ఆ విషయాన్ని వారే మీడియాకు చేరవేసి... వైఎస్సార్సీపీ నాయకులే ఇదంతా చేశారనే విధంగా దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్రలో భాగంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష ప్రారంభమయ్యాక ప్రశ్నపత్రం ప్రత్యక్షం తొలిసారిగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా జరుగుతున్నాయి. ప్రశ్న పత్రాలను ఇప్పటికే పరీక్ష కేంద్రానికి దగ్గర్లో ఉన్న పోలీస్స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష సమయానికి గంట ముందు అంటే ఉదయం 8:30 గంటలకు ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కలిసి ప్రశ్నపత్రాలను స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి విత్‌డ్రా చేసుకుంటారు. 9 గంటలకు పరీక్ష కేంద్రానికి తీసుకెళతారు. అక్కడ ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో ఉదయం 9:15 గంటలకు సీల్ తీస్తారు. 9:25 గంటలకు గదుల్లోకి పంపుతారు. 9:30 గంటలకు విద్యార్థుల చేతికి అందిస్తారు. అయితే విజయ్‌కుమార్ ప్రశ్నపత్రం ఫొటో తీయగా..దాన్ని శ్రీనివాసరావు పరీక్ష ప్రారంభమయ్యాక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఆ తర్వాత ప్రశ్నపత్రం లీక్ అంటూ దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా వెళ్లినా... విద్యార్థులందరూ పరీక్ష కేంద్రంలోనే ఉంటారు కాబట్టి వారికి ముందే తెలిసే అవకాశం ఉండదు. కేవలం రాజకీయ కుట్రకోణంలో భాగంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేసినట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. హెచ్ఎం, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ పదో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి పంపిన వ్యవహారంలో హెచ్ఎం కె.విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ వెంకట కృష్ణా రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసరావు అలియాస్ అమడగూరు స్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. మరోవైపు ఈ ఘటనలో సూత్రధారులతో పాటు పాత్రధారులపైనా పోలీసు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరికీ కదిరి టీడీపీ నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో వారి పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తొలి నుంచీ వివాదాస్పదమే ఆంగ్ల ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన ఉదంతంలో సస్పెండైన నల్లచెరువు మండల పరిషత్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసరావు అలియాస్ అమడగూరు స్వామి వ్యవహారం తొలి నుంచీ వివాదాస్పదమే. అమడగూరు ఉన్నత పాఠశాలలో పని చేస్తూ జూనియర్ అసిస్టెంట్‌గా ఇటీవలే పదోన్నతి పొందిన శ్రీనివాసరావును నల్లచెరువు మండల పరిషత్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే అక్కడ చేరడం ఇష్టం లేని అతను తన పలుకుబడి ఉపయోగించి మళ్లీ అమడగూరు హైస్కూల్‌కు డిప్యుటేషన్ వేయించుకున్నాడు. అతని వ్యవహారం నచ్చని అక్కడి హెడ్మాస్టర్... శ్రీనివాసరావును జాయిన్ చేసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో విధిలేక తిరిగి నల్లచెరువు మండల పరిషత్ కార్యాలయంలో చేరిపోయాడు. ఈ క్రమంలో కదిరి ప్రాంతంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల వారితో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. వారు విద్యాశాఖ కార్యాలయాల్లో తమ పనుల కోసం స్వామిని ఆశ్రయించేవారు. కమీషన్లు తీసుకొని కావాల్సిన పనులను స్వామి చక్కబెట్టేవాడని తెలుస్తోంది. విద్యా శాఖతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేసే అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లకు పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లు వేయిస్తానంటూ భారీగా వసూలు చేసేవాడని జెడ్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆంగ్ల ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో పంపిన శ్రీనివాసరావు.. శుక్రవారం విధులకు గైర్హాజరైనట్లు జెడ్పీ అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఎంపీడీఓను అడగ్గా.. సెలవు చీటి పెట్టకపోగా, కనీసం అనుమతి కూడా తీసుకోకుండానే గైర్హాజరైనట్లు సమాధానం చెప్పారు. శ్రీనివాసరావు వ్యవహారాలపై లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉంది. (చదవండి: మృత్యువులోనూ వీడని బంధం) -
జేఈఈలో ‘పేపర్’ గొడవ
దుండిగల్: ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడి భవిష్యత్ అంధకారమైందని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు జేఈఈ పరీక్ష కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరికి పరీక్ష రాసేందుకు వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలపడంతో ఉద్రికత్త నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుండిగల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి బిక్కుమల్ల విష్ణుసాయి ఉదయం షిప్ట్‌లో పరీక్షకు హాజరయ్యాడు. ఆన్లైన్లో 3 గంటల పాటు జరిగిన ఈ పరీక్షలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రతి ప్రశ్నకు జవాబు రాబట్టేందుకు వీలుగా విద్యార్థులు రఫ్ పేపర్లను వినియోగిస్తారు. అయితే విష్ణుసాయి పరీక్ష కేంద్రంలో ముందుగా రెండు అడిషనల్ షీట్ లు తీసుకున్నాడు. అనంతరం అదనంగా అడిషనల్ షీట్ కావాలని కోరగా ఇన్విజిలేటర్ అందుకు నిరాకరించాడు. కేవలం నాలుగు పేపర్లను మాత్రమే ఇవ్వడంతో సదరు విద్యార్థి పరీక్ష సరిగా రాయలేక పోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వీరికి మద్దతు తెలపడంతో పరీక్షా కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడికి వచ్చిన కళాశాల ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అబ్జర్వర్ రాము మాట్లాడుతూ సిబ్బంది పొరపాటు కారణంగా తప్పిదం జరిగిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించి మరోసారి విద్యార్థికి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయినా తల్లిదండ్రులు శాంతించకపోవడంతో తమ ఇన్విజిలేటర్ తప్పిదం ఉందని అంగీకరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఐదేళ్లుగా కష్టపడుతున్నా.. జేఈఈ పరీక్ష కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నా. ఎంట్రన్స్ పరీక్షలో 75 ప్రశ్నలకు జవాబులు రాయాలంటే కనీసం 20 రఫ్ పేపర్లు అవసరముంటుంది. అయితే ఇన్విజిలేటర్ సార్‌ను ఎంత బతిమాలినా కేవలం నాలుగు పేపర్లే ఇవ్వడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను. దయచేసి నేను మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలి.–విష్ణుసాయి, విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది మా కుమారుడు విష్ణుసాయి టెన్త్‌లో 88 శాతం మార్కులు సాధించాడు. రెండు సార్లు ఒలంపియాడ్లో విన్నర్‌గా నిలిచాడు. అతడికి 8వ తరగతి నుంచి ఐఐటీ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఎంతో కష్టపడి చదివి ఎంట్రన్స్‌లో పాస్ అవుతాడన్న నమ్మకం ఉంది. అయితే ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల మా కుమారుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. –శ్రీకాంత్, విద్యార్థి తండ్రి -
సారూ! ఇదేమి తీరు...
చిత్తూరు, పుత్తూరు: పరీక్షలంటేనే విద్యార్థులు మానసిక వత్తి డికి గురవుతారు. అలాంటిది పదేపదే తనిఖీల పే రుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురువుతున్న ట్లు తెలిసింది. పట్టణంలోని ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాలతోపాటు హిమజ, వేదవ్యాస, సాయిజ్యోతి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రా రంభం నుంచి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలు ఇన్వి జిలేటర్లు, పరీక్ష కేంద్రం ఉన్నతాధికారులను ప్రలోభాలతో లొంగదీసుకుని, పోటీ కళాశాలకు చెందిన విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మైండ్ గేమ్ ఫలానా కళాశాల విద్యార్థి మెరిట్ సాధిస్తారనే సమాచారం సేకరించిన ప్రైవేట్ కళాశాలలు పరీక్ష కేంద్రంలో ఆ మెరిట్ విద్యార్థుల ఏకాత్రగతను దెబ్బతీసేలా స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పరీక్ష కేంద్రం అధికారులు, ఇన్విజిలేటర్లుతో ‘తనిఖీలు’ చేయాలని రహస్య అవగాహనతో తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని తెలిసింది. మెరిట్ విద్యార్థులను పదేపదే తనిఖీ చేస్తూ వారి ఏకాగ్రతకు దెబ్బతీసే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జంబ్లింగ్‌కు మంగళం ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకేషనల్ విద్యార్థులకు ఈ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. రెగ్యులర్ కోర్సు విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు జంబ్లింగ్‌లో విధానంలో పరీక్షలు నిర్వహించడానికి బదులు ఒకేషనల్ విద్యార్థులందరినీ మూడు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో కళాశాల అధికారులే పరోక్షంగా మాస్ కాపీయింగ్‌కు సహకారం ఇచ్చినట్లైంది. ఇకనైనా ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి వీటికి చెక్ పెట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ♦ నారాయణవనంకు చెందిన విద్యార్థి పుత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. పట్టణంలోని ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. ఇన్విజిలేటర్ తనిఖీల పేరుతో అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని, మిగిలిన పరీక్షలకు హాజరుకానని తల్లిదండ్రుల వద్ద తనగోడు వెళ్లగక్కాడు. ♦ పుత్తూరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఈమె తండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉద్యోగి. గణితం పరీక్ష రోజు బాలికకు చెమటలు పట్టాయి. పరీక్ష కేంద్రం ఉన్నతాధికారి బాలిక పరీక్ష రాస్తున్న గదిలోకి వెళ్లి బాలిక తండ్రి పేరు చెప్పి ఆయన కుమార్తె ఎవరని ప్రశ్నించారు. దీంతో బిత్తరపోయిన ఆ మళ్లీ మిగిలిన పరీక్షలకు హాజరుకానని భీష్మించుకు కూర్చుంది. తండ్రి నచ్చ చెప్పడంతో హాజరవుతోంది. బాలిక తండ్రికి పరీక్ష కేంద్రం ఉన్నతాధికారికి ఏవో మనస్పర్థలు ఉండడంతోనే ఇలా బాలికను ఇబ్బంది పెట్టారని ఇంటర్మీడియెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ♦ ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా జంబ్లింగ్ పద్ధతిలోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. అయితే ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకేషనల్ విద్యార్థులను మూడు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందని ప్రచారంలోకి వచ్చింది. అలాంటిదేమీ లేదు మాస్ కాపీయింగ్ ఏమీ లేదు. ఒకేషనల్ విద్యార్థులకు కూడా జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం.–జయసూర్య, ప్రిన్సిపల్, ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పుత్తూరు -
ఇన్విజిలేటర్ల జంబ్లింగ్
సాక్షి ప్రతినిధి, కడప : పకడ్బందీ ఏర్పాట్ల నడుమ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించబోయే వార్షిక పరీక్షలకు అధికా రులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారిగా ఈ పరీక్షల పర్యవేక్షించే ఇన్విజిలేటర్లు జంబ్లింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా చూసిరాతల నిరోధానికి అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. అదేవిధంగా ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు పహారా మధ్య జిల్లావ్యాప్తంగా 53 స్టోరేజీ పాయింట్లలో ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. చూచిరాతల నిరోధానికి చర్యలు జిల్లాలో టెన్త్ వార్షిక పరీక్షల నిర్వహణకు 164 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో జంబ్లింగ్ విధానంలో విద్యార్థులను కేటాయించారు. చూచిరాతల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం విద్యాశాఖ సిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బందిని అన్ని కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్లుగా నియమించనున్నారు. ప్రతి జోన్‌లోని ఒక కేంద్రంలో రెగ్యులర్ విద్యార్థులతోపాటు ప్రైవేటు విద్యార్థులు పరీ క్షలు రాసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో టెన్త్ పరీక్షలకు మొత్తం 35,737 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 18,513మంది, బాలికలు 17,224 మంది ఉన్నారు. 15నుంచి 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం జిల్లావ్యాప్తంగా 1,640 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉండనున్నారు. వీరిని పరీక్ష కేంద్రాలకు జంబ్లింగ్ విధానంలో నియమిస్తారు. ప్రతి మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్లను మారుస్తుంటారు. ఇన్విజిలేటర్లెవరైనా విద్యార్థులను చూచిరాతలకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై విమర్శలు జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాలను వదలేసి సీగ్రేడ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూల్ విద్యార్థులు పరీక్ష రాస్తున్న కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. వాటిపై దృష్టిపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెల్ఫోన్లు నిషిద్ధం: పరీక్ష కేంద్రాల్లోపలికి సెల్ఫోన్లను నిషేధించారు. చీఫ్ సూపరింటెండెంట్ వద్ద మినహా ఎవరి వద్దా సెల్ఫోన్లు ఉండడానికి వీల్లేదు. ఆయన కూడా ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులు తెలిపే సూచనలను వినేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ను ముఖ్య పర్యవేక్షకులు వినియోగించాలి తప్ప ఇతర కాల్స్ మాట్లాడకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవాలి విద్యార్థులు హాల్‌టిక్కెట్, పరీక్షలు రాసేందుకు అవసరమైన సామగ్రి తప్ప సెల్ఫోన్లుకానీ, ఎలక్ట్రానిక్ వస్తువులుకానీ వెంట తీసుకురాకూడదు. పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా కేంద్రాలకు చేరుకోవడం అన్నివిధాలా మంచిది. అనుకోని పరిస్థితుల్లో విద్యార్థులెవరైనా నిర్ణీత సమాయానికి కేంద్రానికి చేరుకోకపోయినా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల వరకు కేంద్రంలోనికి అనుమతిస్తాం. –పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి -
ఇన్విజిలేటర్లకూ జంబ్లింగ్
విజయనగరం అర్బన్: పదోతరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లపై చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షల్లో ఇప్పటివరకు ఇన్విజిలేషన్ నిర్వహించే ఉపాధ్యాయులకు ఏ పరీక్షకు ఏ గది కేటాయించేది ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు నిర్ణయించేవారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆయా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకుని తమకు నచ్చిన వారిని ఆయా పాఠశాలల విద్యార్ధులున్న ఫలానా గదిలో వేయాలని లాబీయింగ్ చేసుకునే వారు. చాలా పాఠశాలల్లో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ తతంగంతో తీవ్రంగా నష్టపోయేవారు. మాస్ కాపీయింగ్ కూడా జోరుగా సాగేది. అయితే వీటన్నింటికి అడ్డుకుట్ట వేసేందుకు ఈ ఏడాది ఈ విధానానికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. రోజూ పరీక్ష నిర్వహణకు అరగంట ముందు చీఫ్ సూపరింటెండెంట్ ఆయా పరీక్ష కేంద్రాల్లో లాటరీ తీసి ఇన్విజిలేటర్‌కు ఏ గది వచ్చిందో తెలియజేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేస్తున్న నూతన విధానంతో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు మాత్రం గంట ముందుగానే పరీక్ష కేంద్రాల విధులకు హాజరు కావాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్ల మార్పు.. ఇన్విజిలేటర్లకు లాటరీ ద్వారా గంట ముందు గదులను కేటాయించడంతో పాటు మూడు రోజులకోసారి పరీక్ష కేంద్రాన్ని మార్చుతారు. తాజాగా ఉన్నతస్థాయిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇన్విజిలేటర్‌ను మూడు రోజులకోసారి కచ్చితంగా పాఠశాలలను మార్చాలని నిర్ణయించారు. అదే విధంగా పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాల అధికారులు, పర్యవేక్షకులుగా వెళ్లే వారు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కఠన చర్యలు అనుభవించాల్సి వస్తుంది. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజవైతే కఠిన చర్యలు తప్పవు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదు. ఈ నెల 15 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఇది తప్పనిసరిగా అమలు చేస్తున్నామని పరీక్షల రాష్ట్ర పరిశీలకులు, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.భాస్కరరావు, డీఈఓ జి.నాగమణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పది పరీక్షల ఏర్పాట్లపై వారు వివరించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి.. పరీక్ష కేంద్రాలకు ఇన్విజిలేటర్ గంట ముందే వెళ్లాలి. విద్యార్థిని నిశితంగా తనిఖీ చేసి 30 నిముషాల ముందు గదిలోకి పంపాలి. ఓఎంఆర్ షీట్లో విద్యార్థి వివరాలను పూర్తి చేసే సమయంలోనూ జాగ్రత్తలు వహించాలి. 137 పరీక్ష కేంద్రాలకు 1,515 మంది ఇన్విజిలేటర్లు.. జిల్లాలో ఈ నెల 15 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు 30,248 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. బాలురు 15,009, బాలికలు 15,239 మంది ఉన్నారు. మరో 264 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 137 పరీక్ష కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. వీటిలో స్టోరేజీ పాయింట్స్ మూడు కిలోమీటర్ల దూరం ఉన్న సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలు 37 ఉన్నాయి. మొత్తం 1,515 మంది ఇన్విజిలేటర్లను, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 137, చీఫ్ ఇన్విజేటర్లు 137 మంది, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తారు. అలాగే స్టోరేజ్ పాయింట్స్ 37, పంపిణీ రూట్స్ 16 ఏర్పాటు చేశారు. నేలపై కూర్చొనే పరీక్ష కేంద్రం ఉండదు.. జిల్లాలో పది పరీక్షలు నిర్వహిస్తున్న 137 కేంద్రాలలోనూ అభ్యర్ధులకు బెంచీలను ఏర్పాటు చేస్తున్నాం. చెంచీలు లేని పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశాం. ఎక్కడా నేలకూర్చొని రాసే పరిస్థితి లేదు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు రెండు రోజుల ముందే వెళ్లి తాగునీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటారు. విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాం. ఇందుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్న పాఠశాలలనే పరీక్ష కేంద్రాలుగా గుర్తించాం. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరాను పరిగణలోకి తీసుకున్నాం. ప్రతి కేంద్రం వద్ద మట్టి కుండలను ఏర్పాటు చేసి అందులో మినరల్ వాటర్, ప్రతి పరీక్ష గదిలో రెండు ఫ్యాన్లు ఉండేలా ఏర్పాట్లు చేశాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు.. పాఠశాలలకు పంపిన హాల్ టికెట్లను యాజమాన్యాలు ఇవ్వని పక్షంలో ‘బీఎస్ఈ.ఏపీ.బీఓవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ నంబబర్ ‘08922–252253, 9493313271, 8179928099 (బొబ్బిలి డివి జన్)లకు సూచనలు, ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు. అందుబాటులో ఆర్టీసీ సర్వీసులు.. పట్టణాలకు దూరంగా ఉన్న 37 సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలకు రవాణా ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ సేవలను అందుబాటులో ఉంచాం. ఈ మేరకు ఆర్టీసీ ఆధికారులను విద్యాశాఖ అధికారులు కోరారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు.. సమస్యాత్మక కేంద్రాలుగా జిల్లాలో ఆరింటిని గుర్తించారు. పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లోని డోకిశీల, చినమేరంగి, టిక్కబాయి, రేగిడి, కొత్తవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏ, బీ పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పక్కా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
కఠిన పరీక్ష
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతోంది. పరీక్ష విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, కాపీయింగ్‌కు పాల్పడినా కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతోంది. పర్యవేక్షకులుగా వేళ్లేవారు విధుల్లో అప్రమత్తంగా లేకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఈనెల15 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అమలు చేయనున్న నిబంధనలు చూస్తే విద్యార్థులకు పరీక్ష అయినా సిబ్బందికి మాత్రం అగ్నిపరీక్షే అని పలువురు అంటున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే గతంలో పరీక్ష విధుల నుంచి తొలగించేవారు. కానీ ఇప్పుడు సంబంధిత నిబంధనలను కఠినతరంగా చేశారు. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే క్రిమినల్ కేసు నమోదుతోపాటు ఆరునెలల నుంచి 3 సంవత్సరాల వరకూ జైలు, రూ.5 వేలు నుంచి రూ.లక్ష దాకా జరిమానా విధించనున్నట్ల తెలిసింది. కాఫీలకు పాల్పడితే..: పరీక్ష కేంద్రంలోకి స్క్వాడ్ వచ్చినప్పుడు విద్యార్థులు చీటిలతో పట్టుబడినా పక్కవారి పేపర్లో చూచిరాస్తున్నా అందుకు సంబంధించిన ఇన్విజిలేటర్‌తోపాటు డిపార్టుమెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరిండెంట్పైనా చర్యలు చేపట్టనున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించినట్లు తెలుస్తోంది. సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు జిల్లాలోని 8 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో దువ్వూరు, చక్రాయపేట(గండి), కమలాపురం(బాయిస్), నందిమండలం, బి.మఠం, పెనగలూరు మండలం చక్రంపేట, కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు, వనిపెం ట జెడ్పీ హైస్కూల్స్ ఉన్నాయి. æవీటిలో విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆందోళనలో ఇన్విజిరేటర్లు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో ఉపాధ్యాయిని ఇన్విజిలేటర్‌గా ఉంటే బాలికలను తనిఖీ చేయడం వీలవుతుంది. పురుష ఉపాధ్యాయుడైతే బాలురను తనిఖీ చేయడం కుదురుతుంది. కానీ చాలా పరీక్ష గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండేచోట సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కొందరు వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఇన్విజిలేటర్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సంఘాలు అంటున్నాయి. ఈ ఏడాది 35,737 మంది ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరతగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా 35,737 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికోసం 164 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా నిర్వహిస్తాం ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలను మొదలుపెట్టాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 164 పరీక్ష కేంద్రాలలో ఎవరు కూడా కింద కూర్చోని పరీక్షలు రాయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. దీంతో పాటు అన్ని కేంద్రాలలో విద్యార్థులకు తాగునీరు వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల విధుల పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని లేనిపక్షంలో చట్టం 25ను అమలుచేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్యక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పొన్నతోట శైలజ, డీఈఓ -
పరీక్షల నిర్వహణ ఇలాగేనా..!
విజయనగరం,బొబ్బిలి: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్ల సమస్య వచ్చి పడింది. జిల్లాలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో అర్హత లేని వారిని నియమించి పరీక్షలు జరిపించేస్తున్నారు. ఎక్కువ రూమ్‌లున్న కేంద్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్‌ను వారిని కాకుండా ఇతర సబ్జెక్ట్‌లకు సంబంధించిన వారిని నియమించాల్సి ఉంది. వారికి కూడా తగిన విద్యార్హతలుండాలి. ప్రతి ఏటా ఈ విధంగానే నిబంధనల ప్రకారం అర్హులనే ఇన్విజిలేటర్లుగా నియమించగా, ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా అనర్హులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. దిగువ స్థాయి అర్హత ఉన్నవారిని ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 49,078 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పలు కళాశాలల్లో వార్డెన్లు, ఇతర తక్కువ స్థాయి విద్యార్హత ఉన్నవారినే ఇన్విజిలేటర్లుగానియమించారు. జరుగుతున్న పరీక్షకు సంబంధించిన వారిని కాకుండా వేరే వారిని ఇన్విజిలేటర్లుగా నియమించాలి. అయితే అంతమంది అందుబాటులో లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కూడా నియమిస్తున్నారు. దీని వల్ల పరీక్షల్లో ఇబ్బందులు లేకపోయినప్పటికీ కాస్తయినా పరిజ్ఙానం ఉండాల్సిన వారు అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సౌకర్యాలు అంతంతమాత్రం.. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యాలు కూడా పట్టిపీడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పలు కేంద్రాల్లో మరుగుదొడ్లు లేకపోవడం విచారకరం. చర్యలు తీసుకుంటాం. అర్హతగల ఇన్విజిలేటర్ల నియామకానికి అన్ని చర్యలూ తీసుకున్నాం. కొన్ని చోట్ల గదులు ఎక్కువ ఉన్న కారణంగా అంత మందిని సిద్ధం చేయలేకపోయాం. పరీక్షలు సక్రమంగానే జరుగుతున్నాయి. మూడు బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్లతో పాటు నేను కూడా స్థానికంగా పర్యవేక్షిస్తున్నాను. – విజయలక్ష్మి, ఆర్ఐఓ, విజయనగరం -
విధుల నుంచి ఇన్విజిలేటర్ల తొలగింపు
గుత్తి : గుత్తిలోని మోడల్ పాఠశాలలో శుక్రవారం పదోతరగతి తెలుగు-1 పరీక్షలో ఇద్దరు విద్యార్థులకు 01టీ బదులు 03టీ ప్రశ్నపత్రాలు అందజేసిన ఇన్విజిలేటర్లు పెద్దన్న, జోహార్‌బానును పరీక్ష విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ వేణుగోపాల్ శనివారం తెలిపారు. ఇన్విజిలేటర్లు 01టీకు బదులు 03 టీ ఇవ్వడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఇన్విజిలేటర్లను శనివారం రిలీవ్ చేశారు. వారిపై పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ అన్నారు. -
పరీక్షలపై నిఘాకు డ్రోన్ ఇన్విజిలేటర్లు!
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లు, స్క్వాడ్లు ఉంటారు. అయినా.. విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో వారిని బురిడీ కొట్టిస్తుంటారు. అందుకే.. చైనాలో విద్యాశాఖ అధికారులు ఏకంగా మానవ రహిత గగనతల వాహనాల(డ్రోన్స్)నే రంగంలోకి దించారు. ‘ఇన్విజిలేటర్ డ్రోన్స్’గా పిలుస్తున్న వీటిని ఆదివారం నుంచి ల్యూయాంగ్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే ‘గవోకవో’ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు ఉపయోగించనున్నారు. కాపీ కొడుతూ దొరికిపోతే మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా సస్పెండ్ చేస్తారు. అయినా విద్యార్థులు టెక్నాలజీతో మాయ చేస్తుండటంతో ఈ డ్రోన్స్‌ను ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే.. పరీక్ష హాలు మీదుగా, చుట్టూ నిరంతరం చక్కర్లు కొడతాయి. 360 డిగ్రీల కోణంలో ప్రత్యేక పరికరాలతో స్కాన్ చేస్తాయి. సెల్ఫోన్లు, రహస్య స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ఉపయోగిస్తే వాటి నుంచి వెలువడే రేడియో సిగ్నళ్లను పసిగడతాయి. ఒక్కో డ్రోన్ ఒక్కో విడతలో 30 నిమిషాల పాటు గాలిలో ఎగురుతూ సిబ్బందికి సమాచారం అందజేస్తూ ఉంటుంది. పరీక్షలపై నిఘాకు ఇంత కసరత్తా? అంటే ఆ పరీక్షలే అలాంటివి మరి! మనకు ఎంసెట్, ఐఐటీ ప్రవేశపరీక్షలు ఎలానో.. చైనీయులకు కూడా గవోకవో పరీక్షలు అలాంటివే. ఉన్నత విద్యలో ప్రవేశం కోసం జరిగే ఈ పోటీ పరీక్షలకు ఏటా 90 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతారట! -
పరీక్షే..!
-
అ‘టెన్’షన్
రాయవరం, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖాధికారులకు కూడా టెన్షన్ మొదలైంది. పదో తరగతి ఫలితాలపైనే జిల్లా విద్యాశాఖాధికారుల పనితీరు ఆధారపడి ఉండడంతో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందు కు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. 312 పరీక్షా కేంద్రాలు జిల్లాలో 60,753 మంది రెగ్యులర్ విద్యార్థులు, 7,936 మంది ప్రైవేట్ విద్యార్థులు 312 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలను రాయనున్నారు. రాజమండ్రి, కాకినాడల్లో 13 పరీక్షా కేంద్రాలు (ఏ సెంటర్లు), పోలీస్టేషన్‌కు దగ్గర్లో 212 పరీక్షా కేంద్రాలు (‘బీ’ సెంటర్లు) ఉన్నాయి. పోలీస్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల పైబడి 87 పరీక్షా కేంద్రాలు (‘సీ’ సెంటర్లు) ఉన్నాయి. 312 పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్ట్మెంట్ అధికారుల నియమించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకట్రావు తెలిపారు. 15 ఫ్లెయింగ్ స్క్వాడ్స్ పరీక్షల్లో కాపీ జరగకుండా చూసేందుకు 15 ఫ్లెయింగ్స్క్వాడ్స్ను ఏర్పాటు చేసినట్టు వెంకట్రావు తెలిపారు. ఈ స్క్వాడ్స్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు. అదేవిధంగా 87 సెంటర్లలో కార్ కస్టోడియన్లను నియమించామన్నారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆరు రోజులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. ఈ పేపర్లను ఆయా పరీక్షా కేంద్రాల దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్లో భద్రపరుస్తున్నారు. పరీక్ష రోజున వాటిని కేంద్రానికి తీసుకువెళతారు. మిగిలిన పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలు ఈ నెల 24వ తేదీ నాటికి జిల్లాకు రానున్నట్టు సమాచారం. ఇన్విజిలేటర్ల సమస్య ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించాల్సి ఉంది. దాని ప్రకారం జిల్లాలో 3,434 మంది ఇన్విజిలేటర్లు అవసరమవుతారు. పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించేవారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఇన్విజిలేషన్ విధులకు నియమించవద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను కోరాయి. దాంతో పదోతరగతి ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, తప్పకపోతే ఎస్జీటీలను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షలు, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ సమస్యను జిల్లా విద్యాశాఖ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. -
రిస్ట్ వాచ్...బ్లూటూత్ ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల సందర్భంగా చేతి గడియారానికి అమర్చిన బ్లూటూత్ ద్వారా ఫోన్లో సమాధానాలు కాపీ కొడుతూ విశాఖలో ఓ విద్యార్థి చిక్కాడు. గురువారం ద్వితీయ ఏడాది ద్వితీయ భాష పేపరు పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి రిస్ట్ వాచ్‌లోని బ్లూటూత్ సహాయంతో ఫోన్లో సమాధానాలు వింటూ దొరికిపోయినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. విశాఖపట్నం బుచ్చిరాజుపాలెంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ విద్యార్థి పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చిక్కిన విద్యార్థి పేరు తపస్య అని తెలిసింది. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అధికారులను రామశంకర్ నాయక్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలున్న చోట జిరాక్స్ యంత్రాలను ఇన్స్పెక్షన్ అధికారులు కచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. గురువారం పరీక్షకు 46,943 మంది (5. 24 శాతం)గైర్హాజరు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేశామన్నారు.