మాట్లాడుతున్న పది పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు భాస్కరరావు, డీఈఓ నాగమణి
విజయనగరం అర్బన్: పదోతరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లపై చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షల్లో ఇప్పటివరకు ఇన్విజిలేషన్ నిర్వహించే ఉపాధ్యాయులకు ఏ పరీక్షకు ఏ గది కేటాయించేది ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్‌లు నిర్ణయించేవారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆయా కేంద్రాల సూపరింటెండెంట్‌లు, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకుని తమకు నచ్చిన వారిని ఆయా పాఠశాలల విద్యార్ధులున్న ఫలానా గదిలో వేయాలని లాబీయింగ్ చేసుకునే వారు.
చాలా పాఠశాలల్లో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ తతంగంతో తీవ్రంగా నష్టపోయేవారు. మాస్ కాపీయింగ్ కూడా జోరుగా సాగేది. అయితే వీటన్నింటికి అడ్డుకుట్ట వేసేందుకు ఈ ఏడాది ఈ విధానానికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. రోజూ పరీక్ష నిర్వహణకు అరగంట ముందు చీఫ్ సూపరింటెండెంట్ ఆయా పరీక్ష కేంద్రాల్లో లాటరీ తీసి ఇన్విజిలేటర్‌కు ఏ గది వచ్చిందో తెలియజేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేస్తున్న నూతన విధానంతో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు మాత్రం గంట ముందుగానే పరీక్ష కేంద్రాల విధులకు హాజరు కావాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్ల మార్పు..
ఇన్విజిలేటర్లకు లాటరీ ద్వారా గంట ముందు గదులను కేటాయించడంతో పాటు మూడు రోజులకోసారి పరీక్ష కేంద్రాన్ని మార్చుతారు. తాజాగా ఉన్నతస్థాయిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇన్విజిలేటర్‌ను మూడు రోజులకోసారి కచ్చితంగా పాఠశాలలను మార్చాలని నిర్ణయించారు. అదే విధంగా పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాల అధికారులు, పర్యవేక్షకులుగా వెళ్లే వారు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కఠన చర్యలు అనుభవించాల్సి వస్తుంది. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజవైతే కఠిన చర్యలు తప్పవు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదు. ఈ నెల 15 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఇది తప్పనిసరిగా అమలు చేస్తున్నామని పరీక్షల రాష్ట్ర పరిశీలకులు, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.భాస్కరరావు, డీఈఓ జి.నాగమణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పది పరీక్షల ఏర్పాట్లపై వారు వివరించారు.
గంట ముందే పరీక్ష కేంద్రానికి..
పరీక్ష కేంద్రాలకు ఇన్విజిలేటర్ గంట ముందే వెళ్లాలి. విద్యార్థిని నిశితంగా తనిఖీ చేసి 30 నిముషాల ముందు గదిలోకి పంపాలి. ఓఎంఆర్ షీట్‌లో విద్యార్థి వివరాలను పూర్తి చేసే సమయంలోనూ జాగ్రత్తలు వహించాలి.
137 పరీక్ష కేంద్రాలకు 1,515 మంది ఇన్విజిలేటర్లు..
జిల్లాలో ఈ నెల 15 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు 30,248 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. బాలురు 15,009, బాలికలు 15,239 మంది ఉన్నారు. మరో 264 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 137 పరీక్ష కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. వీటిలో స్టోరేజీ పాయింట్స్ మూడు కిలోమీటర్ల దూరం ఉన్న సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలు 37 ఉన్నాయి. మొత్తం 1,515 మంది ఇన్విజిలేటర్లను, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు 137, చీఫ్ ఇన్విజేటర్లు 137 మంది, 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పనిచేస్తారు. అలాగే స్టోరేజ్ పాయింట్స్ 37, పంపిణీ రూట్స్ 16 ఏర్పాటు చేశారు.
నేలపై కూర్చొనే పరీక్ష కేంద్రం ఉండదు..
జిల్లాలో పది పరీక్షలు నిర్వహిస్తున్న 137 కేంద్రాలలోనూ అభ్యర్ధులకు బెంచీలను ఏర్పాటు చేస్తున్నాం. చెంచీలు లేని పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశాం. ఎక్కడా నేలకూర్చొని రాసే పరిస్థితి లేదు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు రెండు రోజుల ముందే వెళ్లి తాగునీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటారు. విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాం. ఇందుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్న పాఠశాలలనే పరీక్ష కేంద్రాలుగా గుర్తించాం. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరాను పరిగణలోకి తీసుకున్నాం. ప్రతి కేంద్రం వద్ద మట్టి కుండలను ఏర్పాటు చేసి అందులో మినరల్ వాటర్, ప్రతి పరీక్ష గదిలో రెండు ఫ్యాన్లు ఉండేలా ఏర్పాట్లు చేశాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు..
పాఠశాలలకు పంపిన హాల్ టికెట్లను యాజమాన్యాలు ఇవ్వని పక్షంలో ‘బీఎస్‌ఈ.ఏపీ.బీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చు. ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ నంబబర్ ‘08922–252253, 9493313271, 8179928099 (బొబ్బిలి డివి జన్)లకు సూచనలు, ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు.
అందుబాటులో ఆర్టీసీ సర్వీసులు..
పట్టణాలకు దూరంగా ఉన్న 37 సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలకు రవాణా ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ సేవలను అందుబాటులో ఉంచాం. ఈ మేరకు ఆర్టీసీ ఆధికారులను విద్యాశాఖ అధికారులు కోరారు.
సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు..
సమస్యాత్మక కేంద్రాలుగా జిల్లాలో ఆరింటిని గుర్తించారు. పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లోని డోకిశీల, చినమేరంగి, టిక్కబాయి, రేగిడి, కొత్తవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏ, బీ పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పక్కా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment