ఏప్రిల్ 3 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు. పిల్లలు ఒత్తిడిలో ఉంటారు. పెద్దలు ఒత్తిడి పెడుతుంటారు. వీటికి తోడు పరీక్షా హాలులో ఇన్విజిలేటర్లు కూడా ఒత్తిడి పెడితే విద్యార్థుల పరిస్థితి సంకటంలో పడుతుంది.
‘ఇన్విజిలేటర్ల పని పిల్లలు ప్రశాంతంగా రాసేలా చూడటం. వారితో మృదువుగా ఉంటూనే పరీక్షల నియమ నిబంధనలు పాటించవచ్చు’ అంటారు పియాలి బెనర్జీ.
‘పిల్లలు ఎప్పుడూ కనిపించేలా అల్లరిగా కాకుండా గంభీరంగా మారిపోయే సమయం అది’ అంటుంది పియాలి బెనర్జీ పరీక్షల సమయం గురించి. ఆమె ముంబైలో సుదీర్ఘ కాలం హైస్కూల్‌లో ఇంగ్లిష్ బోధించింది. చాలాసార్లు ఇన్విజిలేటర్‌గా పని చేసింది.
‘ఇన్విజిలేటర్‌కు పిల్లలను పరీక్షలు రాయడానికి ఉత్సాహపరిచే స్వభావం ఉండాలి. అది లేనప్పుడు కనీసం ఊరికే ఉంటే చాలు. ఏవో ఒక మాటలు చెప్పి, గద్దించి వారిని నిరుత్సాహపరిచే హక్కు మాత్రం లేదు’ అంటుందామె. తాను ఇన్విజిలేటర్‌గా ఉన్నప్పుడు గమనించిన అంశాలు పియాలి చెప్పింది.
‘ఒకసారి ఒక పిల్లాడు తల ఒంచుకుని కూచుని ఉన్నాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అనుకున్నాను. రెండు నిమిషాలైనా కదల్లేదు. దగ్గరికెళ్లి చూశాను. నిద్రలో జారుకున్నాడు. పాపం రాత్రి ఎంతసేపు చదివాడో. మెల్లగా తట్టి లేపాను. ఉలిక్కిపడి లేచాడు. వాస్తవంలోకి వచ్చి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నానని గ్రహించి పూర్తిగా కంగారుపడిపోయాను.
మెల్లగా చెప్పాను– ఐదు నిమిషాలే పడుకున్నావు. ఏం కొంపలు మునగలేదు. రాయి అని. స్థిమితపడి రాయడంలో పడ్డాడు. పరీక్ష అయ్యాక మొహమాటంగా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. తల్లిదండ్రులు పరీక్ష ముందురోజు రాత్రి తొమ్మిదిన్నరకంతా పిల్లలను నిద్రపోయేలా చూడాలి. పిల్లల్ని అలా చదువు ప్లాన్ చేసుకోమని చెప్పాలి. ఇంకోసారి ఇంకో పిల్లాడు మాటిమాటికి టైమ్ వైపు చూసుకుంటూ కంగారుగా రాస్తున్నాడు.
టైమ్ సరిపోదేమోనని భయం. దగ్గరగా ఒంగి చెప్పాను– హైరానా పడకు. మూడు గంటల్లో పూర్తయ్యేలాగే నీ ప్రశ్నలు ఉంటాయి. వాచీ చూడకు. రాసుకుంటూ వెళ్లు. నేను టైమ్ అలెర్ట్ చెప్తానుగా అన్నాను. పిల్లలను టైమ్ చాలదని భయపెట్టకూడదు’ అంటుంది పియాలి బెనర్జీ.
కొంతమంది పిల్లలు హడావిడిలో పెన్ను పెన్సిల్ కూడా తీసుకురారు. ఇంక్ అయిపోయిందని పెన్ కోసం అడుగుతారు. అప్పుడు వారిని సూటిపోటిగా ఏదో ఒక మాట అంటే తర్వాత ఏం రాస్తారు? చిర్నవ్వుతో ఒక పెన్ అందిస్తే ఏం పోతుంది?’ అంటుందామె.
ఎగ్జామినేషన్ హాల్లో పెద్దగా అరవడం సరిౖయెన పద్ధతి కాదు అంటుందామె. ఎవరైనా కాపీ చేస్తూనో మరో కోతి పని చేస్తూనో దొరికిపోయినా హాలంతా అదిరిపోయేలా అరిచి అందరు పిల్లలనూ బెంబేలెత్తించకూడదు. చాలా నిశ్శబ్దంగానే ఆ కాపీ చేస్తున్న పిల్లలను హాలు బయటకు తీసుకెళ్లి వ్యవహారం తేల్చాలి అంటుందామె.
‘పిల్లలు ఏవైనా అనవసరమైనవి పెట్టుకున్నారా తమ దగ్గర అని ఒకసారి చెక్ చేస్తే చాలు. పరీక్ష మధ్యలో మాటి మాటికి వారిని శల్యపరీక్షకు గురి చేసి ఏకాగ్రతను భంగం కలిగించకూడదు’ అని చెబుతుంది.
‘పిల్లలు సరిగ్గా తమ నంబర్ వేశారో లేదో చెక్ చేయడం ఇన్విజిలేటర్ ప్రధానమైన పని. అది మాత్రం ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్లి చెక్ చేసి వారికి ఓకే చెప్పాలి. లేదంటే పరీక్ష రాసి ఇంటికెళ్లినా నంబర్ సరిగ్గా వేశానా లేదా అని కంగారు పడతారు’’ అంటుంది పియాలి.
పదో తరగతి పరీక్షలంటే పిల్లలు జీవితంలో మొదట ఎదుర్కొనే పరీక్షలు. ఆ సమయంలో ఇన్విజిలేటర్లు వారి దృష్టితో ఆలోచించి వీలైనంత కంఫర్ట్‌గా పరీక్ష రాసేలా చూడాలి. వారు రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్లు శ్రద్ధగా, విసుగు లేకుండా ఉండటం అన్నింటి కంటే ముఖ్యం అని సూచిస్తున్నదామె.
Comments
Please login to add a commentAdd a comment