రాయవరం, న్యూస్‌లైన్:
పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖాధికారులకు కూడా టెన్షన్ మొదలైంది. పదో తరగతి ఫలితాలపైనే జిల్లా విద్యాశాఖాధికారుల పనితీరు ఆధారపడి ఉండడంతో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందు కు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
312 పరీక్షా కేంద్రాలు
జిల్లాలో 60,753 మంది రెగ్యులర్ విద్యార్థులు, 7,936 మంది ప్రైవేట్ విద్యార్థులు 312 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలను రాయనున్నారు. రాజమండ్రి, కాకినాడల్లో 13 పరీక్షా కేంద్రాలు (ఏ సెంటర్లు), పోలీస్టేషన్‌కు దగ్గర్లో 212 పరీక్షా కేంద్రాలు (‘బీ’ సెంటర్లు) ఉన్నాయి. పోలీస్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల పైబడి 87 పరీక్షా కేంద్రాలు (‘సీ’ సెంటర్లు) ఉన్నాయి. 312 పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్ట్‌మెంట్ అధికారుల నియమించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకట్రావు తెలిపారు.
15 ఫ్లెయింగ్ స్క్వాడ్స్
పరీక్షల్లో కాపీ జరగకుండా చూసేందుకు 15 ఫ్లెయింగ్‌స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెంకట్రావు తెలిపారు. ఈ స్క్వాడ్స్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు. అదేవిధంగా 87 సెంటర్లలో కార్ కస్టోడియన్లను నియమించామన్నారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆరు రోజులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి.
ఈ పేపర్లను ఆయా పరీక్షా కేంద్రాల దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్లో భద్రపరుస్తున్నారు. పరీక్ష రోజున వాటిని కేంద్రానికి తీసుకువెళతారు. మిగిలిన పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలు ఈ నెల 24వ తేదీ నాటికి జిల్లాకు రానున్నట్టు సమాచారం.
ఇన్విజిలేటర్ల సమస్య
ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించాల్సి ఉంది. దాని ప్రకారం జిల్లాలో 3,434 మంది ఇన్విజిలేటర్లు అవసరమవుతారు. పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ఎస్‌జీటీ ఉపాధ్యాయులను నియమించేవారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఇన్విజిలేషన్ విధులకు నియమించవద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను కోరాయి.
దాంతో పదోతరగతి ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, తప్పకపోతే ఎస్‌జీటీలను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షలు, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ సమస్యను జిల్లా విద్యాశాఖ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.
అ‘టెన్’షన్
Published Sun, Mar 23 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM
Advertisement