టీచర్లలో గుబులు!
– వెల్లడికాని హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా
– నేడు ఒక్కరోజే అభ్యంతరాల స్వీకరణకు గడువు
– కేఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలు
– ప్రభుత్వ తీరుతో బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు
అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీల ప్రక్రియతో ఉపాధ్యాయులకు కంటి మీద కునుకును ప్రభుత్వం దూరం చేసింది. దాదాపు రెన్నెళ్లుగా జీఓలు మీద జీఓలు, షెడ్యూలు మీద షెడ్యూలు, సవరణల మీద సవరణలు చేస్తూ టీచర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా షెడ్యూలు మార్చినా దాని ప్రకారం కూడా ముందుకు సాగడం లేదు. అన్ని కేటగిరీ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియార్టీ జాబితా మంగళవారం ప్రకటించాలి. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో పీఎస్‌హెచ్‌ఎం, ఎస్జీటీలు, పండిట్లు, పీఈటీల జాబితాలు మాత్రమే ఉంచారు. వీటిపై సుమారు 40కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితా బుధవారం రాత్రి వరకు ఆన్‌లైన్‌లో ఉంచలేదు. వీటిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంటుంది. కాగా, ప్రిపరెన్షియల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని ఫార్వర్డ్ చేసిన ఎంఈఓలపై చర్యలకు ఉపాధ్యాయ సంఘాలు పట్టుపడుతున్నాయి.
స్పౌజ్ పాయింట్ల రద్దుకు అనుమతి
ఎన్నడూ లేనంతగా ఈ సారి స్పౌజ్ కేటగిరీ పాయింట్లు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. స్పౌజ్ పని చేస్తున్న సమీపంలోకి వెళ్లాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తుండడం చాలామందికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. అయితే ఆ పాయింట్లను రద్దు చేసుకునేందుకు కూడా అనుమతివ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఎట్టకేలకు డీఈఓ లక్ష్మీనారాయణ స్పష్టత ఇచ్చారు. స్పౌజ్ పాయింట్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఆ పాయింట్ల రద్దుకు అనుమతులిస్తున్నామని, అయితే మళ్లీ చేర్చేందుకు అంగీకరించబోమంటూ స్పష్టం చేశారు. అది కూడా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు ఎంఈఓలతో, ఉన్నత పాఠశాలల టీచర్లయితే హెచ్‌ఎంలతో ధ్రువీకరించుకుని స్వయంగా బాధిత టీచర్లే వస్తేనే ఆ పాయింట్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు.