TRANSFER ISSUE
-
బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు..
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ వర్గాల్లో బదిలీల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల సెగ పది రోజుల్లో జిల్లాలను తాకవచ్చన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని కొందరు డీసీపీలతోపాటు వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలోని పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లకు స్థానచలనం తప్పదన్న చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు పదేళ్లపాటు కమిషనరేట్ పరిధిలో కీలక ఠాణాలు, సబ్డివిజన్లలో పనిచేసిన అధికారులకు బదిలీలు తప్పవంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఫలితాలు తారుమారవడంతో రూటు మార్చిన కొందరు ‘కౌంటింగ్ సెంటర్’లనుంచే లాబీయింగ్ మొదలెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసినప్పటికీ స్పష్టమైన హామీ దొరకలేదన్న ప్రచారం ఉంది. బదిలీలపై ప్రభుత్వ పాలసీ తేలడం లేదని దాటవేస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం లూప్లైన్లో ఉండి కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించని అఽధికా రులను ఇప్పుడు తెరపైకి తెచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా త్వరలోనే పోలీసు అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా కమిషనరేట్‌లో పలువురికి స్థాన చలనం కలగనుంది. బదిలీ ఎవరెవరికో..? అసెంబ్లీతో మొదలైన ఎన్నికల ప్రక్రియ సర్పంచ్‌లు మొదలు పార్లమెంట్, జిల్లా, మండలపరిషత్‌ల వరకు సాగనుంది. వచ్చే నెలాఖరుకు క్షేత్రస్థాయిలో పాలనకు కీలకమైన సర్పంచ్ల పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీల వారీగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికలు తప్పవంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖలోని వివిధ స్థాయిల అధికారుల మార్పు ఉండవచ్చని చెబుతున్నారు. కొన్ని నెలల్లో పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నవారు మినహా చాలామందికి స్థాన చలనం ఉంటుందంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కమిషనరేట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వారిని పూర్తిగా మార్చి తమకు అనుకూలమైన వారిని తీసుకొచ్చే అవకాశం ఉందని సీనియర్ కీలక ప్రజాప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. బదిలీల ప్రచారంలో డీసీపీలు, ఏసీపీలు.. వరంగల్ కమిషనరేట్‌లో కీలకమైన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లకు ఎంఏ బారీ, పి.రవిందర్, పి.సీతారాంలు డీసీపీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోటాపోటీ ప్రయత్నాల మధ్య ఈ పోస్టింగ్‌లు సాధించారన్న ప్రచారం ఉంది. ఈ మూడు జోన్ల పరిధిలోని 9 సబ్ డివిజన్లలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)లు పలువురు గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ నేతలతో అంటకాగారన్న ఆరోపణలు ఉన్నాయి. సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్‌ల పరిధిలోని ఇద్దరు ఏసీపీలు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులున్నాయి. ఈస్ట్‌జోన్‌లోని ఓ ఏసీపీపైనా ఇవే ఆరోపణలు ఉన్నాయి. కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఏసీపీలకు ఎన్నికలకు ముందు బదిలీ అయినా.. బీఆర్ఎస్ పెద్దల ప్రమేయంతో తిరిగి ఆ బదిలీలను రద్దు చేసుకుని అవే స్థానాల్లో కొనసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులకు దగ్గరగా ఉండేవారిని బెదిరింపులకు గురి చేశారన్న ఫిర్యాదులున్నాయి. అదే విధంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట, నర్సంపేట, పరకాల, మామునూరు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట సబ్ డివిజన్ల పరిధిలో పని చేసిన కొందరు ఇన్స్పెక్టర్లు అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి వ్యతిరేక పార్టీకి చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వారు సైతం మంచి పోస్టింగ్‌ల్లో కొనసాగేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతుండటం పోలీస్‌శాఖలో చర్చనీయాంశం అవుతోంది. బాస్ మార్పు ఉంటుందా...? ఎన్నికల సంఘం ఆదేశానుసారం షెడ్యూల్ విడుదల అనంతరం పలు కమిషనరేట్లు, జిల్లాలకు నాన్ కేడర్ అధికారుల స్థానంలో ఐపీఎస్ అధికారులను పోలీస్ బాస్‌లుగా నియమించారు. ఈ క్రమంలో వరంగల్ సీపీగా ఉన్న ఏవీ రంగనాథ్ అక్టోబర్ 11న బదిలీ కాగా ఆయన స్థానంలో అంబర్ కిషోర్ ఝాను నియమించారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న సీపీ అంబర్ కిషోర్‌కు నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారనే పేరుంది. అధి కార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుతీరును పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో వారే కొనసాగుతారా..? కొత్తవారు వస్తారా అనేది కొంతకాలం ఆగితేనే తెలుస్తుంది. ఇవి చదవండి: ‘రాజకీయ బదిలీ’లపై కొత్త పోలీసు కమిషనర్ల దృష్టి -
ఢిల్లీ హైకోర్టుకు ‘యస్ బ్యాంక్ ఒత్తిడి రుణ’ బదలాయింపు వివాదం
న్యూఢిల్లీ: జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి యస్ బ్యాంక్‌కు చెందిన రూ. 48,000 కోట్ల స్ట్రెస్ అసెట్ (మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న) పోర్ట్‌ఫోలియోను బదిలీ చేయడంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బదలాయింపుపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్రం, ఆర్బీఐ, సెబీల ప్రతి స్పందనను కోరింది. సమాధానానికి నాలుగు వారాల గడువును ఇస్తూ, తదుపరి కేసును జూలై 14న లిస్ట్ చేయాలని ఆదేశించింది. రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యం స్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరహా ఒప్పందాల్లో ఎటువంటి వివాదాలకూ తావివ్వకుండా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని, ఇందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, సెబీలను ఆదేశించాలని ఆయన ఈ పిటిషన్లో కోరారు. ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ షేర్లకు సంబంధించిన మూడేళ్ల లాకిన్ వ్యవధి ఈ నెల 13వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్ బ్యాŠంక్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు రూ. 10,000 కోట్ల చొప్పున సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్ బ్యాంక్‌ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్ విధించారు. యస్ బ్యాంక్ షేర్ ఎన్ఎస్ఈలో శుక్రవారం 1 శాతం పెరిగి రూ.15.05కు చేరింది. -
డాక్టర్ నీలిమపై ఎందుకంత ప్రేమ?
అనంతపురం: అనంతపురం మెడికల్ కళాశాల డెర్మటాలజీ విభాగంలో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న చల్లా నీలిమ బదిలీ ఉత్తర్వుల అమలులో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలంటూ ఆమెను రిలీవ్ చేయడం లేదు. గత నెల 17న జరిగిన బదిలీల్లో చల్లా నీలిమను విశాఖపట్నానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి అనంతపురానికి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి అనంతపురంలో డెర్మటాలజీ పోస్టు గత నెల 20న ఖాళీ కాగా.. ఇదే పోస్టులో నీలిమను నియమిస్తూ గత నెల 17వ తేదీనే ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా నియమిస్తారంటూ అర్హులైన వైద్యులు విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దీంతో ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేశారు. అనంతపురం మెడికల్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయాలని గత నెల 27న డీఎంఈ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) కానీ ఆమెను అనంతపురం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ రిలీవ్ చేయడం లేదు. దీని వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా... నీలిమను రిలీవ్ చేయొద్దని ఉన్నతాధికారులు మౌఖికంగా తెలిపారని సమాధానమిచ్చారు. లిఖిత పూర్వక ఉత్తర్వులను అమలు చేయాల్సిన ప్రిన్సిపాల్.. మౌఖిక ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
‘చెత్త’ సమస్యకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకూ వెలుస్తున్న కొత్త ఆవాసాలు, కాలనీలకనుగుణంగా చెత్త కూడా పెరుగుతోంది. ఈ చెత్త ఒకేచోట గుట్టలుగా పేరుకుపోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే చిన్న మొత్తాల్లో నిల్వ చేసేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా సర్కిల్‌కు మూడు వంతున 30 సర్కిళ్లకు 90 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్(ఎస్‌సీటీపీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొన్ని సర్కిళ్లలో మూడు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు దొరకకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో దొరికినా స్థానికుల నుంచి ఎదురైన వ్యతిరేకతతో ఎలాగోలా 24 ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేయగలిగారు. స్థల సమస్య కారణంగా మిగతా 66 ఎస్సీటీపీలను ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ చెత్త నిర్వహణ పకడ్బందీగా సాగాలంటే ఏరోజుకారోజు తరలించేందుకు వీలుగా ఎస్సీటీపీలు లేని ప్రాంతాల్లో మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచి వాటి ద్వారా చెత్త తరలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో ఆరు వాహనాలు అదనంగా ఉంచి 72 (రెఫ్యూజి కంటైనర్) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. వీటినే మొబైల్ ఎస్సీటీపీలుగా చెబుతోంది. కనీసం వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఉన్నా ఎస్సీటీపీలను ఏర్పాటు చేయగలమని జీహెచ్ఎంసీ పేర్కొంది. అందుకోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి ఎస్సీటీపీలతోపాటు మొబైల్ ఎస్సీటీపీల వల్ల సర్కిళ్లనుంచి చెత్తను ఎప్పటికప్పుడు జవహర్‌నగర్ డంపింగ్యార్డుకుతరలిస్తునట్లు తెలిపింది. డంపింగ్‌యార్డుకు తరలించేవాహనాల్లో పోర్టబుల్ సెల్ఫ్ కాంపాక్టర్, స్టాటిక్ కాంపాక్టర్, సీల్డ్ కంటైనర్ సదుపాయాలున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తుండటంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొంది. -
రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
కవాడిగూడ(హైదరాబాద్): బోధన చేసే ఉపాధ్యాయలోకం వేదనతో రోడ్డెక్కింది.. రాష్ట్రం నలమూలల నుంచి వేలాదిమంది టీచర్లు కదిలివచ్చారు. నినాదాలతో ధర్నాచౌక్‌ను హోరెత్తించారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ మహాధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌కు వచ్చే రహదారులపై బైఠాయించారు. పీఆర్సీని అమలు చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టా లని డిమాండ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పైసా ఖర్చు లేని బదిలీలూ చేపట్టరా: నర్సిరెడ్డి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాలను మొత్తం తన వద్ద ఉంచు కోకుండా విద్యారంగానికి సంబంధించిన అధికారాలను విద్యాశాఖ మంత్రికి ఇవ్వాలని, తక్షణమే పీఆర్సీ, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపట్టే బదిలీలు, పదోన్నతులు సైతం ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. టీచర్లు పోలీసుస్టేషన్లలోనా? మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ.. 3 నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ 30 నెలలుగా ఎందుకు జాడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. క్లాసు రూం లో ఉండాల్సిన టీచర్లను అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్లో ఉంచడం సిగ్గుచేటన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ లేటుతో టీచర్లకు 18 నెలలుగా ఐఆర్ ఇస్తూ ఆదుకుంటున్నారని, మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యు డు అజీజ్‌పాషా, సీపీఎం నేత వెంకట్, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, కె.గోవర్ధన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు రవి, కె.రమణ, శ్రీనివాసులు, సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దుర్మార్గం: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సాక్షి, హైదరాబాద్: హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. చక్రధరరావు, హరగోపాల్‌లు తీవ్రంగా ఖండిచారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తప్పుబట్టారు. న్యాయమైన డి మాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉ ద్యమాన్ని అణిచివేసేలా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. టీచర్ల పట్ల, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. -
నన్నే బదిలీ చేస్తావా? పెట్రోల్ పోసి తగలబెడతా
అల్లాదుర్గం (మెదక్) : ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేయడంపై ఆగ్రహించిన అంగన్వాడీ సూపర్వైజర్ కుటుంబ సభ్యులతో కార్యాలయానికి వచ్చి దాడికి యత్నించడమే కాక, పెట్రోల్ పోసి చంపుతానని బెదిరించిన సంఘటన అల్లాదుర్గంలో సోమవారం చోటు చేసుకుంది. అల్లాదుర్గం సీడీపీఓ సోమ శేఖరమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద శంకరంపేట మండలం మల్కపూర్ సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీశైల శనివారం ఆమె భర్త వీరయ్య స్వామి, ఇద్దరు కూతుళ్లు, అల్లుడు కలిసి అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయానికి వచ్చి దాడికి యత్నించారు. తన చాంబర్లో నిర్భందించేందుకు ప్రయత్నించగా మరో గదిలోకి వెళ్లే క్రమంలో సూపర్వైజర్ కూతురు భుజం పట్టుకొని దాడి చేశారు. శ్రీశైలను రేగోడ్ నుంచి పెద్ద శంకరంపేట సెక్టార్‌కు బదిలీ చేయడంతో కక్ష కట్టి దాడికి పాల్పడింది. కుటుంబ సభ్యులతో వచ్చి పెట్రోల్ పోసి చంపేస్తామని సిబ్బంది ముందే బెదిరించింది. సోమవారం సూపర్వైజర్ కార్యాలయ ఆవరణలోనే తిరుగుతూ ఉందని, తనపై దాడి చేసేందుకు యత్నిస్తున్నట్టు సోమ శేఖరమ్మ చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కార్యాలయానికి రాగానే సూపర్వైజర్ వెళ్లిపోయినట్టు తెలిపారు. ప్రాణ భయం ఉండడంతో పై అధికారులకు తెలియజేసి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సంఘటనపై సీడీపీఓ ఫిర్యాదు మేరకు శ్రీశైల భర్త శంకరయ్య, ఇద్దరు కూతుళ్లు, అల్లుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ గంగయ్య తెలిపారు. -
ఎక్కేమెట్టు.. దిగేమెట్టు..రెండూ అక్కడే
సాక్షి, కాకినాడ : స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వారి స్థానాలను వదిలేందుకు ఇష్టపడడంలేదు. సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోవడంతో చేయి తడపందే ఏ పనీ జరగడంలేదు. వారు సమయపాలన పాటించకపోవడంతో కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు.సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా చిట్‌ఫండ్, జిల్లా ఆడిట్ కార్యాలయాలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు ‘ఎ’ కేటగిరీలోను, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్, ఆడిట్ కార్యాలయాల ఉద్యోగులు ‘సి’ కేటగిరిలో ఉంటారు. బదిలీల సందర్భంలో ఎ కేటగిరీలో పని చేసే ఉద్యోగులు సి కేటగిరీలోకి (జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్ కార్యాలయం, ఆడిట్ కార్యాలయాలు) బదిలీ అవుతారు. నెల రోజుల అనంతరం ఏలూరు డీఐజీ కార్యాలయంలో పైరవీలు చేయించుకుని ఆఫీస్ ఆర్డర్ పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని యథాస్థానాలకు చేరిపోతారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని మూడు విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నవారు సుమారు 15 నుంచి 20 ఏళ్ల పాటు ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు కాకినాడలోని ఈ మూడు విభాగాల్లోనే రంగులరాట్నంలా తిరుగుతున్నారు. ఈ కార్యాలయంలో చాలామంది ఉద్యోగులు సమయ పాలన పాటించిన దాఖలాలు లేవు. డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఏ పనీ జరగదు. ఇప్పుడు బదిలీల్లో మళ్లీ ఇదే తంతు నడుస్తోంది. ఆఫీస్ ఆర్డర్‌తో బదిలీలు ఇలా... కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నప్పటికీ గత కౌన్సెలింగ్‌లో వాటిని భర్తీ చేయలేదు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో ఆఫీస్ ఆర్డర్ పేరుతో ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందుకు ఏడాదికి రూ.2 లక్షల చొప్పున ఒక ఉద్యోగి నుంచి ఉన్నతాధికారులు తీసుకుంటారని, ఆఫీసర్ ఆర్డర్ పేరుతో బదిలీ చేస్తారని ఉద్యోగవర్గాలు చెబుతున్నారు. ఈ బదిలీల కౌన్సెలింగ్‌లోనైనా పైరవీలకు తావులేకుండా సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తారో లేదో వేచి చూడాలి. బదిలీల జాబితాల్లో అవకతవకలు ఏళ్ల తరబడి ఉన్న సీనియర్ అసిస్టెంట్లు గ్రూపుగా ఏర్పడి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా జాబితా తయారు చేసుకుని, ఇతర ప్రాంతాలకు చెందిన సీనియర్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల జాబితాల్లో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం కాకినాడలోనే ఎ కేటగిరీలో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ సి కేటగిరీగా ఉన్నట్టు బదిలీల జాబితాలో తయారు చేసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. -
టీచర్ల కౌన్సెలింగ్ నేటితో సమాప్తం!
– చివరిరోజు ఎస్జీటీ తెలుగు 3,301 నుంచి చివరిదాకా – తప్పనిసరి బదిలీ..అయినా గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. బుధవారంతో అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవవుతాయి. అయితే అప్‌గ్రేడ్ చేసిన పండిట్ పోస్టులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిడంతో వారికి మాత్రం మళ్లీ కౌన్సెలింగ్ ఉంటుంది. ‘నాట్‌ఆప్ట్’ ఆప్షన్లే ఎక్కువ డీఈఓ లక్ష్మీనారాయణ, పరిశీలకులు జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. రెక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఎక్కువమంది టీచర్లు వారికి అనుకూలమైన స్థానాలు రాకపోవడంతో ‘నాట్‌ఆప్ట్’ ఆప్షన్ ఇచ్చారు. రాత్రి 8 గంటలకు కౌన్సెలింగ్ ముగిసింది. బుధవారం సీనియార్టీ జాబితా 3,301 నుంచి చివరి నంబరు దాకా టీచర్లు హాజరుకావాలని డీఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. ఉదయం 7 గంటలకే సైన్స్ సెంటర్‌కు చేరుకోవాలన్నారు. తప్పనిసరి బదిలీ...గైర్హాజరు హిందూపురం మండలం చెక్‌పోస్టుకాలనీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ పోస్టు రేషనలైజేషన్ ప్రభావంతో రద్దయింది. ఇక్కడ పని చేస్తున్న సరోజబాయి (సీనియార్టీ జాబితా సీరియల్ నంబర్ 3,018) తప్పనిసరి బదిలీ కావాలి. కానీ కౌన్సెలింగ్ సమయంలో ఈమె గైర్హాజరయ్యారు. అధికారులు పలుమార్లు అనౌన్స్ చేసినా రాలేదు. దీనిపై డీఈఓ మాట్లాడుతూ, చివరికి మిగిలిపోయిన ఖాళీలకు ఆమెను పంపుతామని ప్రకటించారు. అలాగే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అనుకూలమైన స్థానం కోసం.... రెండు రోజుల కిందట జరిగిన కౌన్సెలింగ్‌లో సుధాకర్ అనే టీచరు ఉరవకొండ మండలం కోనాపురం ప్రాథమిక పాఠశాల కోరుకున్నాడు. వాస్తవానికి అక్కడ పోస్టు ఖాలీ లేదు. దీంతో సదరు టీచరు డీఈఓ వద్ద రిపోర్ట్ చేసుకున్నారు. అయితే గార్లదిన్నె మెయిన్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న సురేఖ (సీరియల్ నంబర్ 2,806) రెక్వెస్ట్ బదిలీలో భాగంగా మంగళవారం జరిగిన కౌన్సెలింగ్‌లో బొమ్మనహాల్ మండలం వెళ్లింది. ఈ స్థానానికి ముందురోజు కోనాపురం వెళ్లి వెనక్కు వచ్చిన టీచరును పంపే ప్రయత్నం చేశారు. దీన్ని కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు అడ్డుకున్నారు. సురేఖ తర్వాత 2,813 సీరియల్ నంబర్లో ఉన్న పెద్దవడుగూరు మండలం రాయాపురం పాఠశాలలో పని చేస్తున్న గుర్రప్ప అనే టీచరు గార్లదిన్నె స్కూల్ కోరుకున్నాడు. అయితే సుధాకర్‌కు కనగానపల్లి మండలం దాదులూరు స్కూల్‌కు బదిలీ చేశారు. రెండు రోజుల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
బదిలీలకు వేలాయె!
- నేడు కౌన్సెలింగ్ ప్రారంభం - కుప్పలు తెప్పలుగా సమస్యలు - చాలా అంశాల్లో కొరవడిన స్పష్టత - జీఓ అమలు చేయాలంటూ సాయంత్రం ఉత్తర్వులు - గందరగోళంలో ఉపాధ్యాయులు - ఉదయం హెచ్ఎంలు, మధ్యాహ్నం పీడీలు, పీఈటీలకు కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. చాలా అంశాల్లో స్పష్టత లేకుండానే కౌన్సెలింగ్‌కు ముందుకు వెళ్తున్నారు. శనివారం స్థానిక సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్నం 2 గంటలకు పీడీ, పీఈటీలకు కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ లక్ష్మీనారాయణ శుక్రవారం తెలిపారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సరిచేసి శుక్రవారం నాటికి తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి వరకు తుదిజాబితా రాలేదు. రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ద్వారా ఎన్ని స్కూళ్లు మూతపడుతున్నాయి..ఎన్ని పోస్టులు ఇతర స్కూళ్లకు విలీనం అవుతున్నాయి...ఎంతమంది టీచర్లు ప్రభావితం అవుతున్నారనే వివరాలపై చివరి రోజు వరకు స్పష్టత లేదు. అలాగే సబ్జెక్టుల వారీగా ఖాళీలు లేక్క తేల్చనేలేదు. ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపామని చెప్తున్నా.. ఎప్పుడు ఆమోద ముద్ర పడుతుందో వారికే తెలియాలి. దీంతో అన్ని కేడర్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 177 మంది ప్రధానోపాధ్యాయులు, 218 మంది పీఈటీలు, 49 మంది పీడీలు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. జీఓ అమలు చేయాలంటూ ఉత్తర్వులు : 70 శాతం వికలత్వం ఉంటే ప్రిపరెన్షియల్ కేటగిరీకి అర్హులు. అయితే తాజాగా ఇచ్చిన 50 జీఓ ప్రకారం 40 శాతం వికలత్వం ఉంటే చాలు ప్రిపరెన్షియల్ కేటగిరీకి అర్హులు. గురువారం జీఓ విడుదల చేసినా...జిల్లా అధికారులకు శుక్రవారం సాయంత్రం 50 జీఓ అమలు చేయాలంటూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అనేక సమస్యలతో అల్లాడుతున్న విద్యాశాఖ సిబ్బంది ఆగమేఘాల మీద ప్రధానోపాధ్యాయులకు గ్రూపు మెసేజ్‌లు, వాట్సాఫ్ల ద్వారా సమాచారం చేరవేశారు. 50 జీఓ ప్రకారం 40 శాతం వికలత్వం కలిగిన హెచ్ఎంలు రాత్రి 8 గంటలకు సంబంధిత వైద్యధ్రువీకరణ పత్రం, ఎస్ఆర్, దరఖాస్తు హార్డ్‌కాపీ తీసుకొని సైన్స్సెంటర్కు రావాలని సమాచారం ఇచ్చారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి రావాలంటే ఎలా సాధ్యమని హెచ్ఎంలు మండిపడుతున్నారు. కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి : కౌన్సెలింగ్ నిర్వహించడానికి జిల్లా సైన్స్ సెంటర్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు హెచ్ఎంల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయినులు ఒకరిని తోడుగా కేంద్రంలోకి తీసుకెళ్లవచ్చు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకునే కౌన్సెలింగ్ హాలులోకి అనుమతిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు పీడీలు, పీఈటీలకు కౌన్సెలింగ్ ఉంటుంది. సమస్యలు దండిగా...: అనేక సమస్యలపై స్పష్టత కరువైంది. అర్హులైన వారికి రావాల్సిన పాయింట్లు రాలేదు. అనర్హులకు వచ్చిన పాయింట్లు తొలిగించలేదు. అయినా కౌన్సెలింగ్ ప్రక్రియను మొండిగా కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు పాయింట్ల తేడాతోనే సీనియార్టీ జాబితాలో వందల సంఖ్య తేడాలోకి వెళ్తారు. రావాల్సిన పాయింట్లు కూడా రాక, అధికారులు పట్టించుకోక టీచర్లు అల్లాడిపోతున్నారు. – తాడిపత్రి మండలం బోడాయిపల్లి, వెలమనూరు, యల్లనూరు మండలం వేములపల్లి, గుత్తి మండలం అబ్బేదొడ్డి, యాడికి మండలం సి.వెంగనపల్లి, నగరూరు తదితర పాఠశాలలు గతంలో నాల్గో కేటగిరిలో ఉన్నాయి. వీటిలో కొన్ని స్కూళ్లు 2–3 ఏళ్లు ఉన్నా.. 4–5 ఏళ్లు నాల్గో కేటగిరీ ఉన్నట్లు పాయింట్లు వాడుకున్నారు. అయితే కొందరు టీచర్లు పొరబాటున ఈ పాయింట్లు వేసుకున్నామని రాతపూర్వకంగా రాసిచ్చినా...ఆన్లైన్లో మాత్రం అప్డేట్ కాలేదు. నేటికీ పాయింట్లు అలానే కొనసాగుతున్నాయి. – ఎండీఎంకు సంబంధించిన రూపొందించిన యాప్‌లో బెళుగుప్ప మండలం కాలువపల్లి, పామిడి మండలం ఖాదర్‌పేట స్కూళ్లు లేవు. దీనికి హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు స్కూళ్లకు ఎండీఎం పాయింట్లు ‘0’గా చూపుతున్నాయి. హెచ్ఎంతో పాటు టీచర్లందరూ పాయింట్లు కోల్పోవాల్సిన పరిస్థితి. అధికారులతో పాటు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. – యూపీ స్కూళ్ల హెచ్ఎంలు సీసీఈ పాయింట్లు లేదా హెచ్ఎం పాయింట్లలో ఏదో ఒకటి పొందొచ్చని స్వయంగా కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. చాలా మంది హెచ్ఎంలు ఫిర్యాదులు చేసినా పాయింట్లు జనరేట్ కాలేదు. – నార్పల మండలం పి.బండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో నలుగురు టీచర్లు పని చేస్తున్నారు. వీరందరికీ సీసీఈ పాయింట్లు నమోదు కాలేదు. ఫిర్యాదు చేయగా ముగ్గురి టీచర్లకు జనరేట్ అయ్యాయి. బి. చంద్ర అనే టీచరుకు పాయింట్లు జనరేట్ కాలేదు. అయితే పాయింట్లు అయినట్లు మొబైల్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది కానీ దరఖాస్తులో పాయింట్లు మారలేదు. -
ఇవేం బది‘లీలలు’
- కంప్లైంట్ బాక్స్‌పై ఉపాధ్యాయుల కంప్లైట్లు - మధ్యాహ్నం వరకు ఆన్లైన్లో ఓపెన్ కాని కంప్లైంట్ బాక్స్ - తలలు పట్టుకున్న టీచర్లు - సైన్స్ సెంటర్ చుట్టూ ప్రదక్షిణలు - ముగిసిన అభ్యంతరాల గడువు - కుప్పలు తెప్పలుగా పెండింగ్ అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల్లో ‘లీలలు’ చోటు చేసుకుంటున్నాయి. బదిలీల్లో భాగంగా తాత్కాలిక సీనియార్టీ జాబితాలు రాక ఓ వైపు ఆందోళన..పాయింట్లు పడక మరోవైపు ఉపాధ్యాయులు దిక్కులు చూస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి పాఠశాల.. అక్కడి నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్‌కు వెళ్లడం.. ఇదీ మెజార్టీ ఉపాధ్యాయులు రోజువారి దినచర్య. కుప్పలు తెప్పలుగా తప్పులు వస్తున్నాయి. వాటిని సరిదిద్ది పాయింట్లు నమోదు చేసే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు తాత్కాలిక సీనియార్టీ జాబితా ఈనెల 18న ప్రకటించాల్సి ఉంది. తర్వాత రెండు రోజులు అంటే గురువారం వరకు వాటిపై అభ్యంతరాలు తెలియజేయాల్సి ఉంది. కానీ అభ్యంతరాల గడువు రోజు వరకు సీనియార్టీ జాబితాలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. ఫిర్యాదు బాక్సు పనిచేయక అవస్థలు : వాస్తవానికి అభ్యంతరాల స్వీకరణకు స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఒకరోజు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఆ కేంద్రాలను ఎత్తేశారు. గురువారం ఉదయం నుంచి ఆన్లైన్లో కంప్లైంట్ బాక్స్ పని చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయులు తమ ఫిర్యాదులు నమోదు చేయడానికి అవస్థలు పడ్డారు. గురువారం ఒక్కరోజే గడువు ఉండడంతో అందరూ సైన్స్ సెంటర్‌కు పరుగులు పెట్టారు. అక్కడికి రాగానే డీఈఓ కార్యాలయ సిబ్బంది అభ్యంతరాలను తీసుకునేందుకు ససేమిరా అంగీకరించలేదు. ఏదైనా ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి తప్ప.. మ్యానువల్‌గా తీసుకునేదిలేదని తేల్చి చెప్పడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆన్లైన్ పని చేసినా సర్వర్ సాంకేతిక సమస్య కారణంగా ఆశించిన స్థాయిలో ఫిర్యాదులు చేయలేకపోయారు. ఫిర్యాదు చేసేందుకు అవస్థలు : ఉపాధ్యాయుడి ట్రెజరీ ఐడీ, పుట్టిన రోజు ఆధారంగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదివరకే ఇదే ఐడీ, పుట్టిన తేదీ ఆధారంగా ఏదైనా ఫిర్యాదు చేసి ఉంటే అది పరిష్కారం కాకుండా మరో ఫిర్యాదు స్వీకరించడం లేదు. అందులోనూ ఒక వ్యక్తి ఒక ఫిర్యాదు మాత్రమే చేయాలి తప్ప అంతకు మించి తీసుకోవడం లేదు. స్పౌజ్ పాయింట్లు రద్దుకు రావాలని చెప్పి... స్పౌజ్ పనిచేస్తున్న సమీపంలోకి వెళ్లాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తుండడంతో చాలా మందికి ఇబ్బందికరంగా మారుతోంది. స్పౌజ్ పాయింట్లు రద్దు చేసుకునేందుకు అనుమతివ్వకడంతో పలువురు ఉపాధ్యాయులు సైన్స్ సెంటర్‌కు చేరుకున్నారు. నేరుగా ఎంఈఓ, హెచ్ఎంలో ధ్రువీకరణ తీసుకొని వచ్చారు. అయితే వాటిని రద్దు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ససేమిరా అంటూ వెనక్కు పంపారు. ఏదైనా ఉంటే నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి తప్ప మ్యానువల్‌గా చేయడం కుదరదని తేల్చి చెప్పడంతో వారంతా ఊసూరుమంటూ వెనుతిరిగారు. పాయింట్లు రీజనరేట్ కాలేదు : వందలాది మంది టీచర్లకు సంబంధించి వివిధ పాయింట్లు రీజనరేట్ కావడం లేదు. ఆధారాలతో సహా ధ్రువపత్రాలు ఇస్తున్నా...ఆన్లైన్లో నమోదు చేసినా కూడా పాయింట్లు మాత్రం పడడం లేదు. అగళి జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న నీలిమ అనే టీచర్‌కు మొత్తం 27.5787 పాయింట్లు వచ్చాయి. ఆన్లైన్లో మొత్తం తప్పుగా వచ్చి 25 పాయింట్లుగా నమోదయ్యింది. సీనియార్టీ జాబితాలో సుమారు 70 - 80 మంది వెనక్కి వెళ్లిపోయింది. ఈమె పలుమార్లు ఫిర్యాదు చేసి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. అలాగే కొత్తచెరువు మండలం పోతులకుంట జెడ్పీహెచ్ఎస్లో ఎల్పీటీగా సుగుణమ్మ పని చేస్తోంది. ఈమె స్వయంగా ఆర్జేడీకి సమీప బంధువు. ఈమె స్పౌజ్ కేటగిరికింద దరఖాస్తు చేసుకోవడంతో 37 పాయింట్లు వచ్చాయి. దరఖాస్తు ఎంఈఓ లాగిన్ నుంచి డీఈఓ లాగిన్‌కు వెళ్లగానే స్పౌజ్ పాయింట్లు తొలిగిపోయాయి. కేవలం 31 పాయింట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. -
టీచర్లలో గుబులు!
– వెల్లడికాని హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా – నేడు ఒక్కరోజే అభ్యంతరాల స్వీకరణకు గడువు – కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలు – ప్రభుత్వ తీరుతో బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీల ప్రక్రియతో ఉపాధ్యాయులకు కంటి మీద కునుకును ప్రభుత్వం దూరం చేసింది. దాదాపు రెన్నెళ్లుగా జీఓలు మీద జీఓలు, షెడ్యూలు మీద షెడ్యూలు, సవరణల మీద సవరణలు చేస్తూ టీచర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా షెడ్యూలు మార్చినా దాని ప్రకారం కూడా ముందుకు సాగడం లేదు. అన్ని కేటగిరీ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియార్టీ జాబితా మంగళవారం ప్రకటించాలి. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో పీఎస్‌హెచ్‌ఎం, ఎస్జీటీలు, పండిట్లు, పీఈటీల జాబితాలు మాత్రమే ఉంచారు. వీటిపై సుమారు 40కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితా బుధవారం రాత్రి వరకు ఆన్లైన్లో ఉంచలేదు. వీటిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంటుంది. కాగా, ప్రిపరెన్షియల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని ఫార్వర్డ్ చేసిన ఎంఈఓలపై చర్యలకు ఉపాధ్యాయ సంఘాలు పట్టుపడుతున్నాయి. స్పౌజ్ పాయింట్ల రద్దుకు అనుమతి ఎన్నడూ లేనంతగా ఈ సారి స్పౌజ్ కేటగిరీ పాయింట్లు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. స్పౌజ్ పని చేస్తున్న సమీపంలోకి వెళ్లాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తుండడం చాలామందికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. అయితే ఆ పాయింట్లను రద్దు చేసుకునేందుకు కూడా అనుమతివ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఎట్టకేలకు డీఈఓ లక్ష్మీనారాయణ స్పష్టత ఇచ్చారు. స్పౌజ్ పాయింట్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఆ పాయింట్ల రద్దుకు అనుమతులిస్తున్నామని, అయితే మళ్లీ చేర్చేందుకు అంగీకరించబోమంటూ స్పష్టం చేశారు. అది కూడా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు ఎంఈఓలతో, ఉన్నత పాఠశాలల టీచర్లయితే హెచ్ఎంలతో ధ్రువీకరించుకుని స్వయంగా బాధిత టీచర్లే వస్తేనే ఆ పాయింట్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. -
రెవెన్యూలో బది‘లీలలు’
– రాజకీయ సిఫారసు లేఖలతో ఉద్యోగులు – ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి – నిబంధనలు తుంగలో తొక్కే యత్నం అనంతపురం అర్బన్ : రెవెన్యూ శాఖ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అంతా నేతల కనుసన్నల్లోనే నడుస్తోంది. వారిచ్చిన సిఫారసు లేఖలకే ప్రాధాన్యం లభిస్తోంది. అందువల్లే ఇపుడు ఆశాఖ ఉద్యోగులంతా అధికార, రాజకీయ నేతల సిఫారసులు సంపాదించే పనిలో పడ్డారు. ప్రజాప్రతినిధులు కూడా తమ కనుసన్నల్లో ఉండే అధికారులనే తమ ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఉద్యోగులంతా కోరుకున్న చోట పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో బదిలీల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తుంగలో తొక్కే యత్నం జరుగుతోంది. సిఫారసు లేఖలతో... బదిలీల నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉంటే తప్పని సరిగా బదిలీ చేయాలి. మూడేళ్లు పూర్తి చేసుకుంటే బదిలీకి అర్హత ఉంటుంది. అయితే రెవెన్యూ శాఖలో మాత్రం రాజకీయ పైరవీలకు ఉద్యోగులు తెరతీశారు. ఏడుగురు తహసీల్దారులు, 15 మంది డిప్యూటీ తహసీల్దారులు తాము కోరుకుంటున్న స్థానాలకు బదిలీ చేయించుకునేందుకు ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకొచ్చినట్లు సమాచారం. వీరు ఒకే చోట కనీసం మూడేళ్లు కూడా పూర్తి చేయని వారేనని తెలిసింది. ఇటీవల పదోన్నతి పొందిన వారుకూడా.. ఇటీవల కొందరు డిప్యూటీ తహసీల్దారులుకు పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. వీరంతా విధుల్లోకి చేరి కనీసం నెల రోజులు కూడా కాలేదు. అయితే వీరిలో కొందరు తాము కోరుకున్న ‘ఫోకల్’ ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకొచ్చి అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులకు ఫోన్ చేయిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఇదే పరిస్థితి.. గతంలో తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారుల బదిలీల్లో రాజకీయ సిఫారసులకు అధికారులు తలొగ్గారు. ప్రజాప్రతినిధులు సిఫారసు చేసి మరీ తమ ప్రాంతంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఒక తహసీల్దారు నియామకం కోసం అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కొద్ది నెలల క్రితం నేరుగా ఉన్నతాధికారి వద్దకు వచ్చి దగ్గరుండి మరీ పోస్టింగ్ ఇప్పించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ శాఖలో ప్రజాప్రతినిధుల ప్రమేయం పూర్తి స్థాయిలో ఉందనేది స్పష్టమవుతోంది. బదిలీల్లో పారదర్శకం పాటిస్తున్నామని అధికారులు చెప్పుకుంటున్నా, లోలోపల మాత్రం రాజకీయ సిఫారసులకు లొంగక తప్పడం లేదనేది విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి లేకపోతే.. రాజకీయ పలుకుబడిలేని తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు పరిస్థితి రెవెన్యూ శాఖలో దయనీయంగా ఉంటుంది. ఇలాంటి వారిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. గతంలో ఇలాంటి సందర్భాలు చాలానే చోటు చేసుకున్నాయి. -
ఎటూతేలని బదిలీలు
రాయవరం :బదిలీలపై ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. బదిలీ చేస్తున్నట్టు విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టతా లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. గత నెల్లో వివిధ శాఖల్లో బదిలీలు చేపట్టినా ఉపాధ్యాయుల విషయంలో ఎటువంటి ప్రకటనా జారీ కాలేదు. బదిలీలు చేపట్టాలంటే ముందుగా రేషనలైజేషన్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియే మొదలుకాకపోవడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. గందరగోళంలో అయ్యవార్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనల్లో ఉండడంతోనే ఉపాధ్యాయుల బదిలీలపై ఎటువంటి స్పష్టత రాలేదని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంధ్యారాణి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. ఇప్పుడు బదిలీలపై ఉత్తర్వులు ఇచ్చినా ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఏటా బదిలీల ప్రక్రియను వేసవి సెలవుల్లోనే ముగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రక్రియ విద్యా సంవత్సరం మధ్యలోనే జరుగుతోంది. గతేడాది కూడా బదిలీలు అక్టోబరులోనే నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఉపాధ్యాయ బదిలీలపై ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేక పోవడంతో ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు టీచర్ డేటా అప్లోడ్, ఆధార్ అనుసంధానం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 1వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ ముగిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో అమలు కాలేదు. జిల్లాలో వివిధ క్యాడర్లకు చెందిన ఉపాధ్యాయులు సుమారు 22వేల వరకు ఉన్నారు. పాయింట్ల విధానమంటే బెదురు.. పాయింట్ల విధానం అన్న పదం వింటేనే ఉపాధ్యాయులు భయపడి పోతున్నారు. గతేడాది జరిగిన బదిలీల్లో పాయింట్ల విధానం అనుసరించడంతో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ విధానంలో లోపాలు సరిదిద్దిన తర్వాతే బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది వెబ్ కౌన్సిలింగ్ విధానంలో బదిలీ చేపట్టారు. పనితీరు పాయింట్ల ఆధారంగా చేపట్టిన బదిలీల్లో జిల్లాలో సుమారు మూడు వేల మందికి బదిలీలు జరిగాయి. తప్పుడు సంకేతాలు పోతున్నాయి.. విద్యా సంవత్సంలో మధ్యలో బదిలీలు నిర్వహించడం సరైన విధానం కాదు. దీని వల్ల కుటుంబ పరంగా నష్టం జరగడమే కాకుండా, మధ్యలో బదిలీలు చేపట్టడం వలన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. – చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ. గందరగోళంపై స్పష్టత ఇవ్వాలి.. వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ వంటి పనులను పూర్తి చేసి ఉండాల్సింది. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే బోధనలో నిమగ్నం అయ్యే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – టీవీ కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఉపాధ్యాయ సమస్యలు, బదిలీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బదిలీలు చేపడతామని అంటున్నారే తప్ప షెడ్యూల్ విడుదల చేయడం లేదు. బదిలీల సస్పెన్స్‌కు ప్రభుత్వం తెరదించాల్సిన అవసరం ఉంది. – పి.సుబ్బరాజు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ