అనంతపురం: అనంతపురం మెడికల్ కళాశాల డెర్మటాలజీ విభాగంలో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న చల్లా నీలిమ బదిలీ ఉత్తర్వుల అమలులో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలంటూ ఆమెను రిలీవ్ చేయడం లేదు. గత నెల 17న జరిగిన బదిలీల్లో చల్లా నీలిమను విశాఖపట్నానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి అనంతపురానికి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు.
వాస్తవానికి అనంతపురంలో డెర్మటాలజీ పోస్టు గత నెల 20న ఖాళీ కాగా.. ఇదే పోస్టులో నీలిమను నియమిస్తూ గత నెల 17వ తేదీనే ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా నియమిస్తారంటూ అర్హులైన వైద్యులు విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దీంతో ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేశారు. అనంతపురం మెడికల్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయాలని గత నెల 27న డీఎంఈ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: (అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం)
కానీ ఆమెను అనంతపురం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ రిలీవ్ చేయడం లేదు. దీని వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా... నీలిమను రిలీవ్ చేయొద్దని ఉన్నతాధికారులు మౌఖికంగా తెలిపారని సమాధానమిచ్చారు. లిఖిత పూర్వక ఉత్తర్వులను అమలు చేయాల్సిన ప్రిన్సిపాల్.. మౌఖిక ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment