రాయవరం :బదిలీలపై ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. బదిలీ చేస్తున్నట్టు విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టతా లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. గత నెల్లో వివిధ శాఖల్లో బదిలీలు చేపట్టినా ఉపాధ్యాయుల విషయంలో ఎటువంటి ప్రకటనా జారీ కాలేదు. బదిలీలు చేపట్టాలంటే ముందుగా రేషనలైజేషన్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియే మొదలుకాకపోవడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది.
గందరగోళంలో అయ్యవార్లు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనల్లో ఉండడంతోనే ఉపాధ్యాయుల బదిలీలపై ఎటువంటి స్పష్టత రాలేదని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంధ్యారాణి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. ఇప్పుడు బదిలీలపై ఉత్తర్వులు ఇచ్చినా ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఏటా బదిలీల ప్రక్రియను వేసవి సెలవుల్లోనే ముగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రక్రియ విద్యా సంవత్సరం మధ్యలోనే జరుగుతోంది. గతేడాది కూడా బదిలీలు అక్టోబరులోనే నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఉపాధ్యాయ బదిలీలపై ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేక పోవడంతో ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు టీచర్ డేటా అప్‌లోడ్, ఆధార్ అనుసంధానం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 1వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ ముగిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో అమలు కాలేదు. జిల్లాలో వివిధ క్యాడర్లకు చెందిన ఉపాధ్యాయులు సుమారు 22వేల వరకు ఉన్నారు.
పాయింట్ల విధానమంటే బెదురు..
పాయింట్ల విధానం అన్న పదం వింటేనే ఉపాధ్యాయులు భయపడి పోతున్నారు. గతేడాది జరిగిన బదిలీల్లో పాయింట్ల విధానం అనుసరించడంతో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ విధానంలో లోపాలు సరిదిద్దిన తర్వాతే బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది వెబ్ కౌన్సిలింగ్ విధానంలో బదిలీ చేపట్టారు. పనితీరు పాయింట్ల ఆధారంగా చేపట్టిన బదిలీల్లో జిల్లాలో సుమారు మూడు వేల మందికి బదిలీలు జరిగాయి.
తప్పుడు సంకేతాలు పోతున్నాయి..
విద్యా సంవత్సంలో మధ్యలో బదిలీలు నిర్వహించడం సరైన విధానం కాదు. దీని వల్ల కుటుంబ పరంగా నష్టం జరగడమే కాకుండా, మధ్యలో బదిలీలు చేపట్టడం వలన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.
– చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ.
గందరగోళంపై స్పష్టత ఇవ్వాలి..
వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ వంటి పనులను పూర్తి చేసి ఉండాల్సింది. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే బోధనలో నిమగ్నం అయ్యే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– టీవీ కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఉపాధ్యాయ సమస్యలు, బదిలీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బదిలీలు చేపడతామని అంటున్నారే తప్ప షెడ్యూల్ విడుదల చేయడం లేదు. బదిలీల సస్పెన్స్‌కు ప్రభుత్వం తెరదించాల్సిన అవసరం ఉంది.
– పి.సుబ్బరాజు, జిల్లా అధ్యక్షుడు, ఎస్‌టీయూ