రెవెన్యూలో బది‘లీలలు’
– రాజకీయ సిఫారసు లేఖలతో ఉద్యోగులు
– ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి
– నిబంధనలు తుంగలో తొక్కే యత్నం
అనంతపురం అర్బన్ : రెవెన్యూ శాఖ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అంతా నేతల కనుసన్నల్లోనే నడుస్తోంది. వారిచ్చిన సిఫారసు లేఖలకే ప్రాధాన్యం లభిస్తోంది. అందువల్లే ఇపుడు ఆశాఖ ఉద్యోగులంతా అధికార, రాజకీయ నేతల సిఫారసులు సంపాదించే పనిలో పడ్డారు. ప్రజాప్రతినిధులు కూడా తమ కనుసన్నల్లో ఉండే అధికారులనే తమ ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఉద్యోగులంతా కోరుకున్న చోట పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో బదిలీల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తుంగలో తొక్కే యత్నం జరుగుతోంది.
సిఫారసు లేఖలతో...
బదిలీల నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉంటే తప్పని సరిగా బదిలీ చేయాలి. మూడేళ్లు పూర్తి చేసుకుంటే బదిలీకి అర్హత ఉంటుంది. అయితే రెవెన్యూ శాఖలో మాత్రం రాజకీయ పైరవీలకు ఉద్యోగులు తెరతీశారు. ఏడుగురు తహసీల్దారులు, 15 మంది డిప్యూటీ తహసీల్దారులు తాము కోరుకుంటున్న స్థానాలకు బదిలీ చేయించుకునేందుకు ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకొచ్చినట్లు సమాచారం. వీరు ఒకే చోట కనీసం మూడేళ్లు కూడా పూర్తి చేయని వారేనని తెలిసింది.
ఇటీవల పదోన్నతి పొందిన వారుకూడా..
ఇటీవల కొందరు డిప్యూటీ తహసీల్దారులుకు పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. వీరంతా విధుల్లోకి చేరి కనీసం నెల రోజులు కూడా కాలేదు. అయితే వీరిలో కొందరు తాము కోరుకున్న ‘ఫోకల్’ ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకొచ్చి అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులకు ఫోన్ చేయిస్తున్నట్లు సమాచారం.
గతంలోనూ ఇదే పరిస్థితి..
గతంలో తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారుల బదిలీల్లో రాజకీయ సిఫారసులకు అధికారులు తలొగ్గారు. ప్రజాప్రతినిధులు సిఫారసు చేసి మరీ తమ ప్రాంతంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఒక తహసీల్దారు నియామకం కోసం అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కొద్ది నెలల క్రితం నేరుగా ఉన్నతాధికారి వద్దకు వచ్చి దగ్గరుండి మరీ పోస్టింగ్ ఇప్పించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ శాఖలో ప్రజాప్రతినిధుల ప్రమేయం పూర్తి స్థాయిలో ఉందనేది స్పష్టమవుతోంది. బదిలీల్లో పారదర్శకం పాటిస్తున్నామని అధికారులు చెప్పుకుంటున్నా, లోలోపల మాత్రం రాజకీయ సిఫారసులకు లొంగక తప్పడం లేదనేది విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
రాజకీయ పలుకుబడి లేకపోతే..
రాజకీయ పలుకుబడిలేని తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు పరిస్థితి రెవెన్యూ శాఖలో దయనీయంగా ఉంటుంది. ఇలాంటి వారిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. గతంలో ఇలాంటి సందర్భాలు చాలానే చోటు చేసుకున్నాయి.