అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ నిర్లిప్తంగా సాగుతోంది. సాధారణ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు అడ్డంకిగా మారడంతో చాలా మందికి బదిలీలు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది.
నిబంధనలే అడ్డంకి
సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఈ ఏడాది అవకాశం కల్పించలేదు. కేవలం పరస్పర (మ్యూచివల్), అభ్యర్థన (రిక్వెస్ట్) బదిలీలకే అవకాశం కల్పించింది. పరిస్పర బదిలీలకు సంబంధించి మార్గదర్శకాల్లోనూ మెలిక పెట్టింది. దీంతో చాలా మంది ఉద్యోగులకు అవకాశం లేకుండా పోయింది. పరస్పర బదిలీల విషయంలో ఇరువురూ ప్రస్తుతం ఉన్న స్థానాల్లో తప్పని సరిగా మూడేళ్లు పనిచేసి ఉండాలి. ఈ నిబంధన పరస్పర బదిలీలు కోరుకునే వారికి అడ్డంకిగా మారింది. ఇక అభ్యర్థన బదిలీలకు సంబం«ధించి కూడా ఇలాంటి నిబంధనే ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాన్ని వారు కోరుకోవాల్సి ఉంది. ఇలాంటి స్థానాలు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి స్థానాల్లోకి అభ్యర్థన మేరకు వెళ్లేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు.
ఇప్పటికీ 20 దరఖాస్తులే...
రెవెన్యూ శాఖలో పరస్పర, అభ్యర్థన బదిలీలకు సంబంధించి ఈ నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దాదాపు 16 రోజులు గడుస్తున్నా.. నేటికీ కేవలం 20 దరఖాస్తులు మాత్రమే అందాయి. చివరి గడువు జూన్ 5వ తేదీ నాటికి మరో 20కి మించి వచ్చేలా లేవని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందిన దరఖాస్తులు కూడా ఏదో మొక్కుబడిగా చేసుకున్నట్లుగానే కనిపిస్తున్నాయి. సాధారణ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఉద్యోగుల్ని నిరాశపరిచింది
సాధారణ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడం సరైన చర్య కాదు. దూర ప్రాంతాల్లో దాదాపు మూడేళ్లగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను తీవ్ర నిరాశపరిచింది. పరస్పర, అభ్యర్థన బదిలీలకు మాత్రమే వీలు కల్పించడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు. – శీలా జయరామప్ప, జిల్లా అధ్యక్షుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment