ప్రక్షాళన చేయండి: డిప్యూటీ సీఎం | Revenue Minister Pilli Subhash Meeting With District officers In ATP | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన చేయండి: డిప్యూటీ సీఎం

Published Fri, Sep 27 2019 10:53 AM | Last Updated on Fri, Sep 27 2019 11:01 AM

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్,పక్కన మంత్రులు శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, కలెక్టర్‌ సత్యనారాయణ   - Sakshi

భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, విప్‌ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఆర్‌ఎస్‌ఆర్‌ తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. 

సాక్షి, అనంతపురం : ‘ప్రభుత్వ భూమి ప్రతి ఎకరమూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. లేదా ప్రజావసరాలకు వినియోగించబడాలి, పేదల వద్దనైనా ఉండాలి. అంతే తప్ప  పెద్దలు, సంపన్నల వద్ద ప్రభుత్వ భూమి ఉందంటే దానిని వెంటనే స్వాధీనం చేసుకోండి. బలవంతుడైన ముఖ్యమంత్రి మీ వెనుక ఉన్నాడు. ఎవరికీ తలవంచకండి’ అంటూ అధికారులకు డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాలతో కూడిన పిలుపునిచ్చారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డులు స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జిల్లా మంత్రి శంకరనారాయణ, విప్‌ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో వారు  సమీక్షించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ భూమి బలవంతులు, సంపన్నులు చేతిలో ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 1983 వరకు అమలులో ఉన్న జమాబందీ విధానం వల్ల భూ రికార్డులు సక్రమంగా ఉండేవని గుర్తు చేశారు. ఆ విధానం రద్దు అయిన తర్వాతే వ్యవస్థ గాడితప్పిందన్నారు. భూ యజమానుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు పాత విధానాన్ని కొనసాగించే సాహసోపేత నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు పోతోందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది. గృహ నిర్మాణానికి ఉపయోగపడేది ఎంత. ఇంకా ఎంత అవసరం ఉంది, ఇందుకు నిధులు ఎంత అవసరం అనేదానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

మూడు గ్రామాలను యూనిట్‌గా తీసుకోండి 
మూడు గ్రామాలను యూనిట్‌గా తీసుకుని భూ రికార్డుల స్వచ్ఛీకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఒక వీఆర్వో, సర్వేయర్‌తో కలిపి రికార్డులను పరిశీలించి తప్పులు సరిచేయాలన్నారు. జిల్లాలో ఆర్‌ఎస్‌ఆర్‌తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. ముఖ్యంగా జాయింట్‌ కలెక్టర్‌ భూ పరిపాలనలో నిమగ్నం కావాలని సూచించారు. ఆర్డీఓల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.   

ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు 
ఉగాది నాటికి సంతృప్తి స్థాయిలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం అందిన 1.89 లక్షల దరఖాస్తులను విచారణ చేసి అర్హులను గుర్తించాలన్నారు. ఒక కుటుంబం తెల్లకార్డులో తండ్రితో పాటు అతని పిల్లలు ఉంటారన్నారు. వారిలో ఒక కుమారునికి వివాహం జరిగి సంతానం కూడా ఉంటారని, అయితే వారికి వేరే కార్డు ఉండదన్నారు. ఈ క్రమంలో ఉదారంగా వ్యవహరించి వివాహం జరిగిన కుమారునికి కూడా ఇంటి పట్టా మంజూరు చేయాలన్నారు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేల సహకారంతో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. గతంలో జిల్లాలో 57 వేల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.91 కోట్లు బిల్లులు చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. వీటిపై విచారణ చేసి నివేదిక ఇస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, నగర పాలక కమిషనర్‌ ప్రశాంతి, పెనుకొండ సబ్‌కలెక్టర్‌ టి.నిశాంతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 
 మాట్లాడుతున్న హౌసింగ్‌ మినిస్టర్‌ చెరుకువాడ శ్రీరంగనాథరాజు  

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిఇవ్వాలనేది నవరత్నాల్లో ప్రధామైన అంశమన్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాగం అంకితభావంతో పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హాయంలో కొండలు, గుట్టలు, వంక పోరంబోకు స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, సమగ్ర విచారణ చేసి వాటికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలన్నారు. రెవెన్యూ రికార్డులు సరిచేసి భూ వివాదాలు లేకుండా చూడాలన్నారు. 

నిబంధనలు సడలించండి
కరవును దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పట్టాల మంజూరులో నిబంధనలు సడలించాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి కోరారు. 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట అర్హతగా తీసుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సూచించారు.  

శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలి
చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని, అధికారులు గుర్తించి తక్షణమే స్థలాలు కేటాయించాలని ఎంపీ గోరంట్ల మాధవ్‌ సూచించారు. కియా పరిశ్రమకు, ఎన్పీకుంట సోలార్‌ హబ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో కొందరికి పరిహారం అందలేదని వారందరికీ పరిహారం ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాల్లోని వారికి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

తహసిల్దారు కార్యాలయం అవసరం
నగర పరిధిలో 3 లక్షల జనాభా, రూరల్‌ పరిధిలో 2 లక్షల జనాభా ఉన్నా.. ఒకటే తహసీల్దారు కార్యాలయం ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అదనంగా మరో తహసీల్దారు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంతకల్లును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, చుక్కల భూముల సమస్యలకు ముగింపు పలకాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నగర పరిధిలో 2014 వరకు 14 వేల ఇళ్లకు బిల్లులు బకాయిలో ఉన్నాయని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

చుక్కల భూముల సమస్యలు అలాగే ఉన్నాయి 
చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో ఇళ్లను పొందిన వారు కూడా ప్రస్తుతం ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేస్తున్నారని, ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్ల పట్టాలు అనర్హుల చేతిలోకి వెళ్లకూడదని సూచించారు.  

మైనారిటీలకు కాలనీలు ఏర్పాటు చేయాలి
అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో పేద మైనారిటీలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సూచించారు. 2014 నుంచి 2019 వరకు భూ అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఐదారు వేల ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగులు, సంపన్నులకు కట్టబెట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి త్వరితగతిన భూ రికార్డులను సరిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. 

కంప్యూటర్‌ ఆపరేటర్ల చేతిలో వ్యవస్థ
కంప్యూటర్‌ ఆపరేటర్ల చేతిలో రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఇష్టానుసారంగా ఆన్‌లైన్‌లో భూముల వివరాలను వారు మార్చేస్తున్నారన్నారు. తప్పుడు పనులు చేస్తున్న ఆపరేటర్లను తొలగించాలన్నారు. లక్ష లోపు జనాభా ఉండే పట్టణాల్లో అపార్ట్‌మెంట్‌ పద్ధతిలో కాకుండా వ్యక్తిగత (ఇండిపెండెంట్‌) ఇళ్లను కేటాయించాలని సూచించారు.  

సాహసోపేత నిర్ణయం  
రెవెన్యూ భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనేది సాహసోపేత నిర్ణయమని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూముల సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా స్వచ్ఛీకరణ సక్రమంగా చేయాలని అధికారులకు సూచించారు.  క్రాస్‌ చెకింగ్‌ సిస్టం ఉండాలన్నారు. పాస్‌పోర్ట్‌ తరహా పట్టా పాసు పుస్తకం విధానం తీసుకొస్తే భూముల వివరాలు మార్పు సాధ్యం కాదని సూచించారు.  ఇళ్ల పట్టాల కోసం సేకరిస్తున్న భూమి ఆయా గ్రామల ప్రజలకు నివాసయోగ్యమా కాదా అనేది నిర్ధారించుకోవాలని, లేదంటే పథకం నిరుపయోగమవుతుందని హెచ్చరించారు.

వేల ఎకరాలకు పట్టాలిచ్చారు 
తహసీల్దార్లు బదిలీపై వెళుతూ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చేశారని మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వా మి తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్నారు. ‘ఎస్‌ఈజె డ్‌ కోసం 1,600 ఎకరాల భూమిని రైతుల నుంచి 2014లో సేకరించారు. 1బిని రద్దు చేశారు. అయితే 600 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చి, మిగిలిన భూమి ఇవ్వలేదు. దానికీ పరిహారం ఇవ్వాలి’ అని కోరారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ కళాశా లకు, అమరాపురంలో ఐటీఐ ఏర్పాటుకు, బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మాణానికి భూములు కేటాయించాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement