భూ సమస్యల భరతం పడదాం | Perfect Plan for the purge of revenue records | Sakshi
Sakshi News home page

భూ సమస్యల భరతం పడదాం

Published Wed, Sep 11 2019 4:51 AM | Last Updated on Wed, Sep 11 2019 5:35 AM

Perfect Plan for the purge of revenue records - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్‌లో16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది.అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు. ‘రెవెన్యూ రికార్డుల్లో తప్పులు వెతకడమంటే గొంగళిలో వెంట్రుకలు వెతకడం లాంటిదే. అందుకే వీటిని స్వచ్ఛీకరించడం అనడం కంటే ప్రక్షాళన చేయాలనడం సబబుగా ఉంటుంది’ అని రెవెన్యూ నిపుణులు చెబుతున్న మాటలు ఈ శాఖలో కుప్పలు తెప్పలుగా ఉన్న లోపాలకు అద్దం పడుతున్నాయి.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకలుగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన (స్వచ్ఛీకరించి) చేసి, లోప రహితంగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్లిష్టమైన ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని సర్కారు నడుం బిగించింది. ఇందులో భాగంగా ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి రాష్ట్రంలోని మొత్తం 670 మండలాల్లోని 670 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలెట్‌) తక్షణమే అమలు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్రామాల్లో రికార్డుల అప్‌డేషన్‌లో వచ్చే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవస రమైన మార్పులు చేర్పులతో రెండు నెలల్లోగా రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ యజ్ఞాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసింది. ఈ నెలాఖరులోగా 670 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి.. తద్వారా వచ్చిన అనుభవాలు, మార్పుచేర్పులపై నివేదికను రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించింది. సులభంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం కోసం ఆరు రకాల నమూనా పత్రాలను కూడా తహసీల్దారు కార్యాలయాలకు పంపింది. గ్రామసభలు పెట్టి అందరితో చర్చించి రికార్డులు, ఆధారాలు పరిశీలించి ఈ నమూనా పత్రాలను నింపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులను నియమించింది.  

రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఇవీ..
– వారసత్వంగా తమ తండ్రి నుంచి తమకు రావాల్సిన భూమిని కూడా తమకు ఆన్‌లైన్, మ్యుటేషన్‌ చేయడం లేదని కొందరు.. తమ తండ్రి భూమిని వేరేవారు అక్రమంగా నకిలీ పాసుపుస్తకాలతో ఆక్రమించారని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు.
– కొన్ని ప్రాంతాల్లో చట్టప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పటికీ ఆన్‌లైన్‌ కావడంలో ఇబ్బందులు, పాసు పుస్తకం చేతికి అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 
– మరి కొద్దిమంది అయితే.. నమ్మకంతో రిజిస్ట్రేషన్‌ లేకుండానే కేవలం అగ్రిమెంటు ప్రకారం భూమిని కొనుగోలు చేశారు. దీనిని సాధారణంగా సాదాబైనామాగా పేర్కొంటారు. అయితే, తమ పేరు మీద చట్టప్రకారం రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో పాసుపుస్తకం రాక ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు.
– కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూమి సబ్‌డివిజన్‌ చేసి పంపకాలు జరిగి ఉంటాయి. అయితే, ఇవి రికార్డుల్లోకి ఎక్కకుండా కేవలం నోషనల్‌గానే ఉన్నాయి. అయితే, రికార్డుల్లోకి ఎక్కకపోవడంతో ఆన్‌లైన్‌ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి.
– కొన్నిచోట్ల ఒకే పేరు మీద వివిధ ఖాతా నంబర్లు ఉంటున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి ఒకే ఖాతా నంబరు ఉండాలి. సదరు వ్యక్తికి ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉన్నప్పటికీ ఖాతా నంబరు మాత్రం ఒక్కటే ఉండాలి. అయితే, అనేక ప్రాంతాల్లో డూప్లికేట్‌ ఖాతా నంబర్లతో ఒకే భూమికి ఇద్దరు, ముగ్గురు పేర్లతో దొంగ పాసుపుస్తకాలు పుట్టించుకుని నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
– అన్నింటికీ మించి.. రెవెన్యూ సిబ్బంది మాయతో అనేక ప్రాంతాల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే అదనంగా పాసుపుస్తకాల్లో భూమి రికార్డు అయ్యింది. తద్వారా వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూ విస్తీర్ణానికి, ఆర్‌ఎస్‌ఆర్‌ (రెవెన్యూ సర్వీసు రికార్డ్‌)కు మధ్య వ్యత్యాసం వస్తోంది.  
– ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా, ప్రభుత్వ భూమి ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లతో రికార్డులున్న సంఘటనలు అనేకం. 
– వివిధ కారణాల వల్ల భూ యాజమాన్య హక్కు పత్రాలు లేకుండానే వంశపారంపర్యంగా భూములను అనుభవిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 

ఆరు నమూనా పత్రాలతో మార్గదర్శకాలు
1. వారసుల పేరుతో మార్పు
(చనిపోయిన పట్టాదారు పేరు, ఇతర వివరాలకు సంబంధించి మొత్తం పది కాలంలు పెట్టారు. ఈ నమూనా పత్రం ప్రకారం మృతుల పేర్లతో ఉన్న భూములను వారి వారసుల పేర్లతో మ్యుటేషన్‌ చేస్తారు.) 
2. భూమి కొనుగోలు చేసిన వారి పేరుతో మార్పు
(అమ్మిన వ్యక్తి పేరుతో ఉన్న భూమిని కొనుగోలు చేసిన వారి పేరుతో మార్చడం. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఆధారంగా గ్రామంలో విచారించి కొనుగోలుదారుల పేర్లతో అడంగల్, 1బీలో మార్పులు చేస్తారు. ఇందుకోసం గత అయిదేళ్లలో జరిగిన క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్‌ వివరాలను తహసీల్దార్లకు పంపించాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే గత 20 ఏళ్ల రిజిస్ట్రేషన్‌ డేటా కూడా పంపాలని కూడా ఆదేశించింది. ఈ వివరాల ప్రకారం విచారించి మ్యుటేషన్లు చేస్తారు.) 
3. వారసత్వం, రిజిస్ట్రేషన్‌ ద్వారా కాకుండా ఇతరత్రా మ్యుటేషన్లు
(ఆధారాలను పరిశీలించి గ్రామసభలో చర్చించి అనుభవదారు/ పిటిషనర్‌ పేరుతో భూమిని మ్యుటేషన్‌ చేస్తారు. సాదాబైనామా కింద అంటే.. రిజిస్ట్రేషన్‌ లేకుండా కేవలం అగ్రిమెంట్‌ ద్వారా జరిగిన భూ లావాదేవీలను పరిష్కరించడం.) 
4. ఒక వ్యక్తి పేరుతో ఒకే ఖాతా
(ఒక వ్యక్తి పేరుతో రెండు మూడు ఖాతాలు ఉంటే తొలగించి ఒకే ఖాతాగా మార్పు చేస్తారు. గ్రామ సభలో చర్చించి పట్టాదారుకు నోటీసు జారీ చేసి, నిబంధనల ప్రకారం డూప్లికేట్‌ ఖాతాలను తొలగిస్తారు.)
5. శాశ్వత ఖాతాలుగా మార్పు
(వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో 10 లక్షలకు పైగా తాత్కాలిక (నోషనల్‌) ఖాతాలు ఉన్నాయి. వీటిని శాశ్వత ఖాతాలుగా మారుస్తారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులందరూ తమ పరిధిలోని గ్రామాల్లో తాత్కాలిక ఖాతాలన్నింటినీ శాశ్వత ఖాతాలుగా మార్చడానికి తహసీల్దారుకు ప్రతిపాదనలు ఇవ్వాలి. అనంతరం తహసీల్దారు వీటిని శాశ్వత ఖాతాగా మార్పు చేస్తారు.) 
6. భూ విస్తీర్ణం తేడాల్లో మార్పు
(రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌), వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌/ మాన్యువల్‌ అడంగల్‌ మధ్య భూమి విస్తీర్ణం చాలా సర్వే నంబర్లలో తేడా ఉంది. దీని ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తహసీల్దారుకు నివేదిక ఇచ్చిన అనంతరం సరిచేస్తారు.) 

గ్రామ సభల్లో ఇలా..
రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఆరు రకాల నమూనా పత్రాలను పంపిన ఉన్నతాధికారులు గ్రామసభల్లోనే వీటిని పూరించాలని పేర్కొన్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను స్పష్టంగా వివరించారు. ఏ తేదీన ఏ రెవెన్యూ గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తారో ముందుగా తెలియజేస్తారు. రెవెన్యూ రికార్డులను ఆ గ్రామానికి తీసుకెళ్లి సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, అది ఎవరి పేర్లతో ఉందో చదువుతారు. మార్పులు, చేర్పులు ఎవరైనా కోరితే వారి వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని గ్రామ సభలో చర్చిస్తారు.  అనంతరం ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్న భూ విస్తీర్ణానికి, వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూ విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం లేకుండా వాస్తవ భూ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేస్తారు. ఈ గ్రామ సభలకు గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దారు/ తహసీల్దారు హాజరవుతారు. పైలెట్‌ ప్రాజెక్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేప్పుడు తహసీల్దార్‌ నేతృత్వంలో ఒక బృందం, డిప్యూటీ తహసీల్దార్‌ అధ్యక్షతన మరో బృందం వేర్వేరు గ్రామాలకు వెళతాయి. 

– వైస్సార్‌ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం 15–20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఇప్పటికీ అడంగల్‌లో ఈ భూమి ప్రైవేట్‌ వ్యక్తి పేరుతోనే ఉంది. 
– గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో వందలాది ఎకరాల పట్టా భూములు ప్రైవేట్‌ వ్యక్తులవి అయినప్పటికీ అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు. 
– వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం అనంత సముద్రం గ్రామంలో ఒకే సర్వే నంబరులోని ఒకే భూమికి ఓబుల గంగిరెడ్డి (పట్టా నంబరు 514), హెచ్‌.చంగమ్మ (పట్టా నంబరు 537) పట్టాదారులుగా ఉన్నారు. 
– రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్‌లో 16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది. అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు.
– శ్రీకాకుళం జిల్లాలోని 95 గ్రామాల్లో అధికారులు సర్వే చేయగా ఒక్కో గ్రామంలో 40 నుంచి 80 శాతం వరకు తప్పులు ఉన్నట్లు తేలింది.
– రాష్ట్రంలో మొత్తం భూ కమతాలు, సబ్‌ డివిజన్ల మధ్య 77 లక్షల భారీ వ్యత్యాసం ఉంది.

కష్టమైనా సరే చేయాల్సిందే..
భూముల సమగ్ర రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాలంటే ముందుగా భూ రికార్డులు సరిదిద్దాలి. ఇందుకోసమే ప్రక్షాళన చేయాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశాం. దశాబ్దాలుగా బూజుపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సులభమైన ప్రక్రియ కాదు. కానీ, ఎంత కష్టమైనా ప్రజల కోసం ఈ మార్పు  చేయాలనుకున్నాం. రాష్ట్రమంతా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. క్షేత్ర స్థాయిలో వచ్చే సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలతో ముందుకెళ్లేందుకే ఒక్కో మండలంలో ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ చేపడతాం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.
– పిల్లి సుభాష్‌ చంద్రబోస్, రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement