సాక్షి, విశాఖపట్నం: దసరా నుంచి పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి కార్యాలయాలకు భవనాల ఎంపిక కోసం అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాన్ని మధురవాడలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దసరా నుంచి రాష్ట్ర పరిపాలన రాజధాని విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రితోపాటు విశాఖ వచ్చే ఉన్నతాధికారులు, ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలను వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాల ఏర్పాటు, పని విభజనపై కసరత్తు వడివడిగా జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం జాయింట్ కమిషనర్(జేసీ)–1, 2 కార్యాలయాలు, కొన్ని సర్కిల్ కార్యాలయాలు ముడసర్లోవ సమీపంలో ఉన్నాయి. ఈ భవనాన్నే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి కేటాయించాలని భావించారు. కానీ, సరిపడా గదులు లేకపోవడంతో దానికి ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని పన్నుల శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారుల కోసం కేటాయించాలని ప్రయత్నించారు.
దీనిపై ఉన్నతాధికారులకు విశాఖ డివిజన్ అధికారులు నివేదిక పంపించారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలో భవనాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. దీంతో విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ కార్యాలయ అధికారులు మధురవాడలో ఉన్న భవనాలను పరిశీలించారు. నాలుగు అంతస్తులు ఉన్న మూడు భవనాలను పరిశీలించి వాటి వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. రెండు వారాల్లోపు ఉన్నతాధికారుల బృందం వచ్చి ఆ భవనాలను పరిశీలించి ఒకదానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment