సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్‌లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్‌గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్‌బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్‌వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment