Regularize
-
‘కాంట్రాక్టు’.. ఇక ‘పర్మినెంట్’
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సర్క్యులర్ మెమో ద్వారా బుధవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 10 వేల మందికి మేలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రెగ్యులరైజేషన్ ఇలా.. 2014 జూన్ 2కి ముందు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులై అర్హులైన వారందరూ రెగ్యులరైజేషన్‌కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా శాఖాధిపతులు, శాఖల్లో మంజూరు చేసిన పోస్టులో రిజర్వేషన్, రోస్టర్ విధానంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులైన అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయనున్నారు. అర్హులైన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో విధానంలో కాకుండా ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో వీలైనంత త్వరగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. ♦ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను ఆయా శాఖాధిపతులు తొలుత వెరిఫికేషన్ చేసి సర్టిఫై చేయాలి. ♦ ఆ తర్వాత సచివాలయ శాఖలు ఆయా దరఖాస్తులను ధ్రువీకరించి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ♦ పిదప ట్రెజరీస్ డైరెక్టర్ దరఖాస్తులను ఆడిట్ చేసి సిఫార్సు చేయాలి. ♦ చివరగా ఆర్థిక శాఖ (హెచ్ఆర్) విభాగం అర్హులైన ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆమోదం తెలుపుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులు పుట్టిన తేదీ, విద్యా అర్హతలు, కమ్యూనిటీ, మంజూరైన పోస్టులో నియమించారా, లేదా అనే విషయాలను ఆయా శాఖాధిపతులు ్ర«ధువీకరణ చేయాల్సి ఉంటుంది. సీఎం జగన్‌కు ఉద్యోగులుబాసటగా నిలవాలి.. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగులందరూ బాసటగా నిలవాలి. దశాబ్దాల కాంట్రాక్టు ఉద్యోగుల కలను నెరవేర్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. కొన్ని పత్రికలు, చానళ్లు ప్రభుత్వంపై నిత్యం విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని అక్కసుతో దించేసే కుట్రను ఉద్యోగులు అడ్డుకోవాలి. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి 100 మందిని లక్ష్యంగా పెట్టుకుని వాస్తవాలు వివరించాలి. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, బడుల రూపురేఖలు మార్చి, ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్న సీఎం జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలి. – ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ అరవ పాల్ 20 ఏళ్ల కల సాకారం కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధికరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడం పట్ల ఆనందంగా ఉంది. 20 ఏళ్ల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్మీడియెట్ విభాగంలో 3 వేల మందికి, పాలిటెక్నిక్, డిగ్రీ స్థాయిల్లో మరో 1,000 మందికి మేలు జరుగుతుంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేలాది కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారు.. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. మేనిఫెస్టోలో చేర్చి మరీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మేలు చేశారు. తాజా నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం. – వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధికరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధీకరించిన సీఎంకు మా కృతజ్ఞతలు. – కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ -
రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్‌గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్‌బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్‌వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
కాంగ్రెస్ నేతలవి పిచ్చి మాటలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కాంగ్రెస్ నాయకులు వీఆర్ఏలను, పంచాయతీ కార్యదర్శులను రెచ్చగొట్టాలని చూశారు.. కానీ వారిని రెగ్యులరైజ్ చేశాము.. రేషన్‌డీలర్ల సమస్యనూ పరిష్కరించాం.. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇంటింటికీ మంచినీరు వంటి పథకాలతో మహిళలు సీఎం కేసీఆర్‌కు జైకొడుతున్నారు.. ఇక ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు’’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన బీసీ బంధు లబ్ధిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారానికి సంబంధించిన డబ్బులను బ్యాంకు వెబ్సైట్లపై స్వయంగా మీట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ సభలకు ప్రజలు రాకపోవడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదన్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు తిరిగి బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తారా అని నిలదీశారు. రైతులే తేల్చుకోవాలి.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్ కావాలో.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీ కావాలో.. మూడు పంటలు పండించేలా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కావాలో రైతులే తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా అయ్యేదని, ఎరువుల బస్తాల కోసం పోలీస్స్టేషన్లలో క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు రావాల్సిన రూ.35 వేల కోట్లు నిలిపివేసిందని, ఆ నిధులను కేంద్రం ఎందుకు ఆపిందో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. -
భూముల క్రమబద్ధీకరణకు నేటి నుంచి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, స్థలాల క్రమబద్ధీకరణకుగాను నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జీవో 58, 59లకు అనుగుణంగా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు మరోమారు అవకాశమిస్తూ ఈ నెల 14న ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2014 జూన్ 2వ తేదీనాటికి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్లో ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం వర్తించనుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం 125 గజాలలోపు స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వాటిని ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 చదరపు గజాలలోపు ప్రభుత్వ విలువలో 50 శాతం, 250–300 గజాల్లోపు 75 శాతం, 500–1000 గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్న వారు 100 శాతం ప్రభుత్వ విలువను చెల్లిస్తే క్రమబద్ధీకరించనున్నారు. అయితే, గృహేతర భూములు ఆక్రమణలో ఉంటే విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వ విలువ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/ఏదైనా డాక్యుమెంట్), స్థలం అధీనంలో ఉన్నట్లుగా ఆస్తిపన్ను చెల్లించిన రశీదు/విద్యుత్ బిల్లు/ తాగునీటి బిల్లు/రిజిస్టర్డ్ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి జత చేయాల్సి ఉంటుంది. గతంలోని ఉత్తర్వుల ప్రకారం అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. అయితే, ఈ దరఖాస్తులను ఎవరు పరిశీలించాలి, ఏ స్థాయిలో దరఖాస్తును ఎవరు పరిష్కరించాలనే నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం నేడు విడుదల చేయనుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ !
సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేదల జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన భూములు చేతులు మారితే.. వారికి యాజమాన్య హక్కులు కల్పించేదిశగా యోచిస్తోంది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసైన్డ్‌దారు నుంచి పరాధీనమైన భూములను పీవోటీ చట్టం కింద వెనక్కి తీసుకున్న తర్వాతే భూముల ను క్రమబద్ధీకరించనుంది. అసైన్మెంట్ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24 లక్షల ఎకరాల మేర భూములను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో సుమారు 2.41 లక్షల ఎకరాల వరకు ఇతరుల గుప్పిట్లోకి వెళ్లినట్లు రెవెన్యూశాఖ తేల్చింది. పట్టణీకరణతో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వెలిశాయి. కొన్ని చోట్ల బడాబాబులు, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లి ఫాంహౌస్, విలాసకేంద్రాలుగా మారిపోయాయి. అర్హులుగా తేలితేనే రీఅసైన్ అసైన్డ్‌దారుల నుంచి కొనుగోలు చేసినవారిలో అసైన్మెంట్ చట్ట ప్రకారం అర్హులుగా తేలితే(భూమిలేని పేదలైతే) వారికి రీఅసైన్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో గాకుండా ఇతరచోట్ల 2017 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే, అసైన్డ్‌దారుల నుంచి కొనుగోలు చేసినవారు దారిద్య్రరేఖకు ఎగువన ఉంటే వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఆర్థిక సమస్యలతో భూములను అమ్ముకున్న అసైనీలు భూమిలేని పేదలైతే మాత్రం పీవోటీ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగివారికే కేటాయిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసిన వారు ఈ చట్టానికి అర్హులుగా లేకపోతే మాత్రం రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సివుంటుంది. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే. కాలనీలు.. కాసులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను 20 ఏళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశం కల్పించింది. ఇదే తరహాలోనే మన రాష్ట్రంలోనూ ఇతరుల చెరలో ఉన్న భూముల క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవడమేగాకుండా.. భూమి యజమాన్యహక్కులను కల్పించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ జీవోల ద్వారా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తున్న సర్కారు అసైన్డ్ భూముల్లో వెలిసిన స్థలాలను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్లు జరిగినా.. కొత్త చట్టం ప్రకారం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడం, ప్రభుత్వ భూముల జాబితాలో ఉండడంతో మరింత కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో కాలనీలుగా వెలిసిన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరిస్తే ఖజానాకు కాసుల వర్షం, ప్రజలకు ఊరట లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
దయనీయం వీరి పరిస్థితి..!!
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ (నామినల్ మస్టర్ రోల్)లు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాతికేళ్లుగా పనిచేస్తున్నా.. వారికి ఇంతవరకు ఉద్యోగ భద్రత లేదు. మరోవైపు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించే ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా వీరికి వర్తించడం లేదు. గతంలో గ్రామపంచాయతీలలో పనిచేసిన వారు నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో మున్సిపల్ శాఖకు మారారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వీరి పాత్ర కీలకం కాగా.. కనీస వేతనాలు కూడా అందడం లేదు. కారుణ్య నియామకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేని వీరు తమ సర్వీసును ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. రెగ్యులరైజ్ చేయకపోయినా టైమ్‌స్కేల్ అందించినా కనీస వేతనాలు లభిస్తాయని.. ఆ దిశగా మున్సిపల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని వారు కోరుతున్నారు. – కోదాడ నుంచి ఆవుల మల్లికార్జునరావు సరిపడా లేని సిబ్బంది.. వాస్తవానికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో సరిపడా సిబ్బంది లేరు. మేజర్ గ్రామపంచాయతీలు నగర పంచాయతీ, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌లను మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకుంటున్నారు. అయినా.. వారి సర్వీసును మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు. 2013లో విడుదల చేసిన జీవో నెంబర్ 125 ప్రకారం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 1,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి వాటిని రెండు దశలలో నింపేందుకు నిర్ణయించారు. అయితే.. ఈ పోస్టులలో ఎన్‌ఆర్‌ఎంలను రెగ్యులరైజ్ చేసేందుకు ఉద్దేశించిన పబ్లిక్ హెల్త్ విభాగంలో తక్కువ పోస్టులు ఉండగా, మిగిలిన విభాగాలో పోస్టులను సూచించలేదు. దీంతో ఆ జీవో వచ్చినా ఎన్ఆర్ఎంలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. వాస్తవానికి ప్రతీ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో మాత్రం స్వీపర్లు, పబ్లిక్ హెల్త్, విద్యుత్, నీటి సరఫరాల విభాగాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఈ పోస్టుల్లో కొన్నింటిని ఎన్ఆర్ఎంలతో, మరి కొన్నింటిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తాత్కాలికంగా భర్తీ చేస్తున్నారు. అమలు కాని 212 జీవో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌లను రెగ్యులరైజ్ చేసే విషయంలో నవంబర్ 28, 1993న అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 212ను విడుదల చేసింది. దీని ప్రకారం 1993 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎన్‌ఆర్‌ఎంలను ఆ జీవో కింద రెగ్యులరైజ్ చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది. వారిని ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో నియమించాలని, తద్వారా ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. అయితే.. ఈ జీవో మాత్రం పంచాయతీరాజ్ శాఖలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. గ్రామపంచాయతీలలో ప్రభుత్వం కేటాయించిన పోస్టులు తక్కువగా ఉండడం.. ఎన్ఆర్ఎంల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఖాళీలు ఏర్పడినప్పుడు దశల వారీగా ఉద్యోగులను వారి సీనియారిటీని బట్టి నియమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఎంలలో చాలా మంది అనార్యోగం బారిన పడి మృతి చెందారు. అయితే.. వీరి కుటుంబ సభ్యుల్లో మరొకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. కుటుంబాలకు ఎలాంటి భద్రత కల్పించకుండానే లోకం వదులుతున్నారు. 350 మంది ఎదురుచూపు.. రాష్ట్రవ్యాప్తంగా 2009 తరువాత ఏర్పడిన కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 350 మంది ఎన్‌ఎంఆర్‌లు రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తమను రెగ్యులరైజ్ చేసి కనీసం టైమ్ స్కేల్ అందించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై గతంలోనే పలుమార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. మున్సిపాలిటీలలో అదే పరిస్థితి.. ఉమ్మడి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు 2009లో అప్పటి ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న ఎన్ఆర్ఎంలతో ఖాళీలు భర్తీ చేయవచ్చని జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఎన్‌ఆర్‌ఎంలను పబ్లిక్ హెల్త్ వర్కర్లు, స్వీపర్లు, విద్యుత్, నీటి సరఫరా విభాగాలలో నియమించి వారిని రెగ్యులరైజ్ చేశారు. ఆ తరువాత ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మాత్రం అమలు కాలేదు. ఇతడి పేరు కుక్కల దేవయ్య. ఈయన కోదాడ మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్నాడు. కోదాడ గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు అనగా 30 ఏళ్లుగా పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతడికి ఆరోగ్య భద్రత లేకపోగా ఉద్యోగ భద్రత కూడా లేదు. -
హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
-
రెగ్యులరైజ్ అయ్యే ఉద్యోగులకు 50 శాతం వేతన బకాయిలు ఇవ్వాలి
ఎల్ఐసీకి ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు సవరణ న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 3వ, 4వ తరగతి తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో పాటు, వారికి వేతన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని, సంబంధిత ప్రయోజనాలనూ కల్పించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. పూర్తి వేతన బకాయిలు చెల్లించటం వల్ల సంస్థపై భారీగా ఆర్థిక భారం పడుతుందని.. తొలుత ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ ఎల్ఐసీ రివ్యూ పిటిషన్ వేయటంతో.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కార్మికులకు 50% వేతన బకాయిలు చెల్లించాలని సవరించిన ఆదేశాల్లో పేర్కొంది. -
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్: ఈటల
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలో పర్మినెంట్ చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రంలో 89లక్షల కుటుంబాలకు ఆహార పంపిణీ కార్డుల పంపకం జరుగుతుందని అన్నారు. పౌరసరఫరాల్లో లొసుగులు ఉన్నాయన్నమాట వాస్తవమేనని మంత్రి చెప్పారు. అయితే, ఈ శాఖలో తప్పు చేసేవారిని అంత తేలికగా వదిలిపెట్టబోమని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమార్కులపై తొలిసారి పీడీ, టాడా యాక్ట్ ప్రకారం కేసులు పెట్టామని చెప్పారు. -
కాసుల వేట!
క్రమబద్ధీకరణతో రూ.6,000 కోట్ల రాబడే లక్ష్యం! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. యూఎల్సీ భూముల వివరాలను గురువారంలోపు అఖిలపక్ష పార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎల్సీ స్థలాల లెక్క తేల్చిన సర్కారు.. నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు.. యూఎల్సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగిన రాజకీయపార్టీల ప్రతినిధుల భేటీలో స్పష్టం చేసింది. అయితే, యూఎల్సీ స్థలాలపై స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే సర్వే నంబర్లవారీగా యూఎల్సీ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ఆధారంగా భూమి స్థితిగతులు, ఆక్రమణలు, విస్తీర్ణం తదితర అంశాలను పొందుపరుస్తూ నివేదిక సమర్పించింది. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణపై ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెగ్యులరైజ్‌తో భారీ రాబడి అంచనా యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణతో సుమారు రూ.6,000కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జిల్లాలోని 11 పట్టణ మండలా ల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములుండగా, దీంట్లో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వివాదరహితంగా ఉన్న 2,083.06 ఎకరాల భూములే ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా శేరిలింగంపల్లిలోని అయ్యప్ప గురుకుల్ ట్రస్ట్ భూ ములున్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారానే భారీగా నిధులు సమీకరించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్థల యాజ మాన్య హక్కుల కోసం ఒకవైపు ట్రస్ట్, దేవాదాయ, యూఎల్సీ విభాగం కోర్టును ఆశ్రయించాయి. యూఎల్సీ, దే వాదాయ శాఖలను కేసులు ఉపసంహరించుకునేలా చేసి.. ట్రస్ట్‌కు కొంత మొత్తాన్ని కేటాయించడం ద్వారా క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. కనీస ధరపై కసరత్తు! యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్ధేశించే ధరపై ఏకాభిప్రాయం కుదరడంలేదు. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా.. అది అసంబద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ ధరకంటే కూడా రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్నందున.. ప్రస్తుత విలువను ప్రామాణికంగా తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ధరను నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో 2008 నాటి కనీస ధర మేరకే క్రమబద్ధీకరించడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయానికి అనుగుణంగా ధరల నిర్ధారణలో మార్పులు చేర్పులు జరిగే అవకాశంలేకపోలేదని యంత్రాంగం అంటోంది. -
‘కాంట్రాక్టు’ను రెగ్యులరైజ్ చేయొద్దు
తెయూ(డిచ్పల్లి): కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీ బాలుర వసతి గృహం వద్ద సోమవారం జేఏసీ నాయకులు తమ మెడలకు తాళ్లతో ఉరి బిగించుకుని వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాల పేరిట నిరుద్యోగ విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనం, వెయిటేజీ ఇస్తే నిరుద్యోగ విద్యార్థులకు ఇబ్బం ది లేదని, కానీ వారిని రెగ్యులరైజ్ చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి తన పదవికి రాజీనా మా చేసి విద్యార్థులను విమర్శిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు రాజ్‌కుమార్, చైర్మన్ సంతోశ్‌గౌడ్, బాలాజీ, సంతోశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉంటుందా.. ఊడుతుందా..?
మోర్తాడ్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులు సంబురపడ్డారు. ఇప్పుడు కాంట్రాక్టుల ముగింపు తేదీ దగ్గరకు వస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. వీరి కాంట్రాక్టును పొడిగించడమా.. క్రమబద్దీకరించడమా.. అనే విషయాన్ని ఇంకా తేల్చలేదు. పన్నెండేళ్లుగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకల ఆ స్పత్రుల్లో ఎంపీహెచ్ఏ, ఏఎన్ఎం, ఫార్మసిస్టు, ల్యాబ్ అసిస్టెంట్, స్టాఫ్ నర్సులుగా 362 మంది కాంట్రాక్టు ప ద్ధతిన పని చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్లుగా విధులు ని ర్వర్తిస్తున్నా గత ప్రభుత్వాల తీరుతో వీరి జీవితాలు ఇంకా గాడిలో పడలేదు. దివంగత ముఖ్యమంత్రి రా జశేఖరరెడ్డి కాంట్రాక్టు వైద్య ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హమీ ఇచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించే లోపే ఆయన ప్రమాదవశాత్తు మృతిచెందడంతో వైద్య ఉద్యోగుల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఎన్నికల పుణ్యమా అని వివిధ రాజకీయ పార్టీలు కాంట్రాక్టు ఉద్యోగులపై వరాలు గుప్పించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. మార్చితోనే ముగింపు కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల ఒప్పందం మార్చితోనే ముగిసింది. వీరి సేవలు అత్యవసరం కావడంతో గవర్నర్ నరసింహాన్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వారి ని కొనసాగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వరకు ఉద్యోగుల కాంట్రాక్టు పొడిగించారు. ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా తుది నిర్ణయానికి సమయం పడుతుంది. అంతలోపే ఉద్యోగుల కాంట్రాక్టు ముగిసిపోనుండటంతో వారు తమ ఉద్యోగం ఉంటుందో.. ఊ డుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 235మంది ఏఎన్ఎంలు, 72మంది ఎంపీహెచ్ఏలు, ముగ్గురు ఫార్మసిస్టులు, ఐదుగురు ల్యాబ్‌అసిస్టెంట్లు, 47మంది స్టాఫ్‌నర్సులు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని రెగ్యులరైజ్ చేయాలని వారు కోరుతున్నారు. ఎన్నికల హమీని నిలబెట్టుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వైద్య సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగులతోపాటు వారి కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయి. ఈ నెలాఖరుతో కాంట్రాక్టు ముగిసిపోనున్న దృష్ట్యా వీలైనంతా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. - అశోక్, పారామెడికల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు