
సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేదల జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన భూములు చేతులు మారితే.. వారికి యాజమాన్య హక్కులు కల్పించేదిశగా యోచిస్తోంది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసైన్డ్‌దారు నుంచి పరాధీనమైన భూములను పీవోటీ చట్టం కింద వెనక్కి తీసుకున్న తర్వాతే భూముల ను క్రమబద్ధీకరించనుంది. అసైన్‌మెంట్ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24 లక్షల ఎకరాల మేర భూములను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో సుమారు 2.41 లక్షల ఎకరాల వరకు ఇతరుల గుప్పిట్లోకి వెళ్లినట్లు రెవెన్యూశాఖ తేల్చింది. పట్టణీకరణతో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వెలిశాయి. కొన్ని చోట్ల బడాబాబులు, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లి ఫాంహౌస్, విలాసకేంద్రాలుగా మారిపోయాయి.
అర్హులుగా తేలితేనే రీఅసైన్
అసైన్డ్‌దారుల నుంచి కొనుగోలు చేసినవారిలో అసైన్‌మెంట్ చట్ట ప్రకారం అర్హులుగా తేలితే(భూమిలేని పేదలైతే) వారికి రీఅసైన్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో గాకుండా ఇతరచోట్ల 2017 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే, అసైన్డ్‌దారుల నుంచి కొనుగోలు చేసినవారు దారిద్య్రరేఖకు ఎగువన ఉంటే వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఆర్థిక సమస్యలతో భూములను అమ్ముకున్న అసైనీలు భూమిలేని పేదలైతే మాత్రం పీవోటీ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగివారికే కేటాయిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసిన వారు ఈ చట్టానికి అర్హులుగా లేకపోతే మాత్రం రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సివుంటుంది. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే.
కాలనీలు.. కాసులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను 20 ఏళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశం కల్పించింది. ఇదే తరహాలోనే మన రాష్ట్రంలోనూ ఇతరుల చెరలో ఉన్న భూముల క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవడమేగాకుండా.. భూమి యజమాన్యహక్కులను కల్పించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ జీవోల ద్వారా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తున్న సర్కారు అసైన్డ్ భూముల్లో వెలిసిన స్థలాలను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్లు జరిగినా.. కొత్త చట్టం ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ తప్పనిసరి చేయడం, ప్రభుత్వ భూముల జాబితాలో ఉండడంతో మరింత కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో కాలనీలుగా వెలిసిన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరిస్తే ఖజానాకు కాసుల వర్షం, ప్రజలకు ఊరట లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment