కాసుల వేట!
క్రమబద్ధీకరణతో రూ.6,000 కోట్ల రాబడే లక్ష్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్‌సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. యూఎల్‌సీ భూముల వివరాలను గురువారంలోపు అఖిలపక్ష పార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎల్‌సీ స్థలాల లెక్క తేల్చిన సర్కారు.. నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు.. యూఎల్‌సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది.
ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగిన రాజకీయపార్టీల ప్రతినిధుల భేటీలో స్పష్టం చేసింది. అయితే, యూఎల్‌సీ స్థలాలపై స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే సర్వే నంబర్లవారీగా యూఎల్‌సీ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ఆధారంగా భూమి స్థితిగతులు, ఆక్రమణలు, విస్తీర్ణం తదితర అంశాలను పొందుపరుస్తూ నివేదిక సమర్పించింది. యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణపై ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
రెగ్యులరైజ్‌తో భారీ రాబడి అంచనా
యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణతో సుమారు రూ.6,000కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జిల్లాలోని 11 పట్టణ మండలా ల్లో 3,452.25 ఎకరాల యూఎల్‌సీ భూములుండగా, దీంట్లో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వివాదరహితంగా ఉన్న 2,083.06 ఎకరాల భూములే ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయి.
వీటిలో ప్రధానంగా శేరిలింగంపల్లిలోని అయ్యప్ప గురుకుల్ ట్రస్ట్ భూ ములున్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారానే భారీగా నిధులు సమీకరించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్థల యాజ మాన్య హక్కుల కోసం ఒకవైపు ట్రస్ట్, దేవాదాయ, యూఎల్‌సీ విభాగం కోర్టును ఆశ్రయించాయి. యూఎల్‌సీ, దే వాదాయ శాఖలను కేసులు ఉపసంహరించుకునేలా చేసి.. ట్రస్ట్‌కు కొంత మొత్తాన్ని కేటాయించడం ద్వారా క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది.
కనీస ధరపై కసరత్తు!
యూఎల్‌సీ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్ధేశించే ధరపై ఏకాభిప్రాయం కుదరడంలేదు. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా.. అది అసంబద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ ధరకంటే కూడా రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్నందున.. ప్రస్తుత విలువను ప్రామాణికంగా తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ధరను నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో 2008 నాటి కనీస ధర మేరకే క్రమబద్ధీకరించడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయానికి అనుగుణంగా ధరల నిర్ధారణలో మార్పులు చేర్పులు జరిగే అవకాశంలేకపోలేదని యంత్రాంగం అంటోంది.