ulc lands
-
యూఎల్సీ ఎల్ఆర్ఎస్ మేళా
సాక్షి, హైదరాబాద్: అర్బన్‌లాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల్లోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీకి అందిన 71,808 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో దాదాపు 36 వేలు పెండింగ్‌లో పడ్డాయి. వీటిలో 14,646 దరఖాస్తులు యూఎల్సీ భూముల్లోవే. వీటికి సంబంధించి ప్రజలకు సరైన సమాచారం, స్పష్టత లేకపోవడంతో షార్ట్‌ఫాల్స్ (అవసరమైన పత్రాలు)ను సమర్పించ లేకపోయారు. గత నెల 28 వరకే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువునిచ్చిన ప్రభుత్వం దాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించడం తెలిసిందే. అయినప్పటికీ, ఇంకా షార్ట్‌ఫాల్స్ జత చేయడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రజలకు అవగాహన లేకే యూఎల్సీ భూముల్లోని వాటికి అవసరమైన షార్ట్‌ఫాల్స్ సమర్పించడం లేదని గుర్తించారు. వారికి తగిన అవగాహన కల్పించేందుకు, అవసరమైన పత్రాలు జత చేసేలా చూసేందుకు ఈ నెల 16, 17 తేదీల్లో యూఎల్సీ షార్ట్ఫాల్స్పై మేళా నిర్వహించా లని నిర్ణయించారు. ఈ మేళా తేదీల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. పక్కా జాబితాలతో సత్వర పరిష్కారం యూఎల్సీ భూములకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో చర్చించి యూఎల్సీ భూములకు సంబంధించిన లేఔట్లు, సర్వే నంబర్లు.. ఆయా సర్వే నంబర్లలో ఏయే రకాల భూములున్నదీ పూర్తి వివరాలతో కూడిన మ్యాపుల్ని జీహెచ్ఎంసీ అధికారులు సేకరించారు. ఆయా సర్వే నంబర్లలో కొన్ని ప్లాట్లకు యూఎల్సీ క్లియరెన్స్ అవసరం కాగా, కొన్ని ప్లాట్లు అసలు యూఎల్సీ లోనే లేవు. అయితే ఆ విషయం అటు ప్రజలకే కాక ఇటు అధికారులకు కూడా తెలియకపోవడంతో యూఎల్‌సీలో లేనివాటిని కూడా పరిష్కరించలేదు. ప్రస్తుతం రెవెన్యూ మండలాల వారీగా ఏ సర్వే నంబర్లలో ఏయే లేఔట్లు /ప్లాట్లు యూఎల్సీ పరిధిలో లేవో, ఏవి ఉన్నాయో అధికారుల వద్ద జాబితాలు న్నాయి. వాటి గురించి ప్రజలకు కూడా తెలియజేయనున్నారు. తద్వారా యూఎల్సీ పరిధిలో లేని దరఖాస్తుల్ని పరిష్కరించనున్నారు. మేళాల్లో ప్రజలకు అవగాహన యూఎల్సీ భూముల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాల్లో సంబంధిత దరఖాస్తుదారులకు అన్ని వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తామని టౌన్‌ప్లానింగ్ విభాగం అడిషనల్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు. మరికొన్ని లేఔట్లు /ప్లాట్లు యూఎల్సీ పరిధిలో ఉండగా, సంబంధిత జీవో ద్వారా క్లియరెన్స్ పొందిన వారు కూడా సదరు జీవో ప్రతుల్ని దరఖాస్తులతోపాటు ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదని శ్రీనివాసరావు తెలిపారు. అలాంటి వారు సంబంధిత జీవో ప్రతుల్ని సమర్పిస్తే వారి దరఖాస్తుల్ని పరిష్కరించనున్నారు. మరికొందరు యూఎల్సీ భూముల్లోని లేఔట్లకు రెవెన్యూ శాఖ నుంచి క్లియరెన్స్ పొందలేదు. అలాంటి వారు నిర్ణీత ఫీజు చెల్లించి, క్లియరెన్స్ తెచ్చుకుంటే వారి దరఖాస్తుల్ని కూడా పరిష్కరించనున్నారు. ఈ అంశాల్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు యూఎల్సీ భూములకు సంబంధించే రెండు రోజులు ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించనున్నారు. -
యూఎల్‌సీకి మంగళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: యూఎల్సీ (పట్టణ భూ గరిష్ట పరిమితి) భూములపై నెలకొన్న వివాదాలన్నిటికీ చరమగీతం పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైనవారందరికీ రెగ్యులరైజ్ చేయడం.. తక్కినవాటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోనే అత్యంత విలువైన, అత్యధిక భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా సీలింగ్ భూములతో విసుగెత్తి వే సారిన భూ యజమానులకు కొంత ఊరట.. మరోపక్క ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. నగర శివార్లలోని 11 మండలాల్లో 3,453.70 ఎకరాల యూఎల్సీ భూములను కాపాడడం సర్కారుకు తలనొప్పిగా తయారైంది. ఇబ్బడిముబ్బడిగా ఆక్రమణలు జరుగుతుండడం.. వీటిని అరికట్టాల్సిన యూఎల్సీ విభాగానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ లేకపోవడంతో జిల్లా యంత్రాంగానికి గుదిబండగా మారింది. క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడం.. అక్రమార్కులు కోర్టులను ఆశ్రయిస్తుండడంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎల్సీ స్థలాలను వీలైనంత మేర క్రమబద్ధీకరించాలని యోచిస్తోంది. ఉభయ ప్రయోజనం.. బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ సర్కారు.. భూముల అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు సమకూర్చుకుంటామని ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ, సీలింగ్ భూములను క్ర మబద్ధీకరించాలని నిర్ణయించింది. మరీ ముఖ్యంగా విలువైన యూఎల్‌సీకి చెందిన స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడం... వీటిని తొలగించడం ఆషామాషీ కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఘట్కేసర్ గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనే నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన సర్కారు.. ఈ జాగాల క్రమబద్ధీకరణకు మొగ్గు చూపుతోంది. తద్వారా ఖజానా నింపుకోవడమేకాకుండా ఏళ్ల తరబడి యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న భూ యజమానులకు ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది. ధరల నిర్ధారణపై మల్లగుల్లాలు క్రమబద్ధీకరణతో దాదాపు యూఎల్సీ స్థలాల కథకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న సర్కారు... కోర్టు కేసులకు కూడా త్వరితగతిన ముగింపు పలకాలని నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు పోగా మిగిలిన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఖరారు చేయాల్సిన ధరలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూఎల్సీ స్థలాలు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. కనీస ధర నిర్ధారణపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే, ప్రస్తుత కనీస (బేసిక్ మార్కెట్ వాల్యూ) ధరలు భారీగా పలుకుతున్నందున.. 2008 ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది. యూఎల్సీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఏ ధరలను వర్తింపజేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. ⇒మాదాపూర్‌లో 2003లో చదరపు గజం (బేసిక్ మార్కెట్ వాల్యూ) కనీస ధర రూ.2వేలు పలకగా, 2008లో రూ.13వేలు.. ఇప్పుడు రూ.20వేలు పలుకుతుంది. ⇒గచ్చిబౌలిలో 2003లో చదరపు గజం కనీస ధర రూ.ఒక వెయ్యి కాగా, 2008లో రూ.12వేలు.. తాజాగా రూ.15వేలుగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేస్తోంది. ⇒రాయదుర్గంలో 2003లో చ.గజం కనీస ధర రూ.1000 ఉండగా, 2008లో రూ.11వేలు.. ప్రస్తుతం రూ.20వేలు ఉంది. 2008 ప్రభుత్వ కనీస మార్కెట్ విలువ ఆధారంగా రూ.7,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. క్రమబద్ధీకరణ ప్రక్రియను చకచకా పూర్తి చేయాలని భావిస్తోంది. ⇒ఈ నెల 16న జరిగే అఖిలపక్ష సమావేశం అనంతరం నిర్దేశిత ధరను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. -
జాగా.. పాగా!.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆదాయాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో భూముల క్రమబద్ధీకరణకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం యూఎల్సీ (అర్బన్ లాండ్ సీలింగ్) స్థలాలను జల్లెడ పడుతోంది. యూఎల్సీ భూముల్లో ఆక్రమణలపై ఇప్పటికే లెక్కలు తేల్చిన యంత్రాంగం.. ఆయా భూముల్లో నిర్మాణాలున్న విస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూములపై నిశిత పరిశీలన కొనసాగిస్తోంది. జిల్లాలో 11 మండలాల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తుండగా.. మిగతా 2,083.06 ఎకరాల భూములు ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 2,214.31 ఎకరాల్లో నిర్మాణాలు.. ప్రైవేటు పార్టీల ఆధీనంలో ఉన్న యూఎల్సీ భూముల్లో ఇప్పటికే ఎక్కవ శాతం విస్తీర్ణంలో శాశ్వత నిర్మాణాలున్నాయి. 11 మండలాల్లో 3,452.25 ఎకరాల్లోని యూఎల్సీ భూముల్లో 2,214.31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 1,482.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి వివాదాలు లేకపోగా, 732.11 ఎకరాల్లోని నిర్మాణాలు, స్థలాల అంశం న్యాయస్థానాల పరిధిలో ఉంది. మిగతా 1,237.34 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికీ 637.08 ఎకరాలకు సంబంధించి తాగాదాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. మిగతా భూముల్లో కొంతమేర ప్రహరీలు నిర్మించగా.. మిగతా స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో నిర్మాణాలు ఉన్న భూములకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా భూముల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. యూఎల్సీ పరిధిలో.. పరాధీనంలో ఉన్న యూఎల్సీ భూములకు సంబంధించి క్రమబద్ధీకరణకోసం గతంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా కొంత మేర డబ్బులు కూడా యూఎల్‌సీకి చెల్లించనప్పటికీ యూఎల్సీ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా 6,889 మందికి 578 ఎకరాలకు సంబంధించి క్రమబద్ధీకరణ అంశం యూఎల్సీ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 218.14 ఎకరాల్లో 200 గజాల విస్తీర్ణంలోపు ఉన్న దరఖాస్తులున్నాయి. 176.17 ఎకరాల్లో 200-500 విస్తీర్ణానికి సంబంధించి, 107.31 ఎకరాల్లో 500-100 గజాలకు సంబంధించి దరఖాస్తులున్నాయి. అదేవిధంగా 75.26 ఎకరాలో వెయ్యి గజాలకు పైబడిన దరఖాస్తులున్నాయి. -
కాసుల వేట!
క్రమబద్ధీకరణతో రూ.6,000 కోట్ల రాబడే లక్ష్యం! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. యూఎల్సీ భూముల వివరాలను గురువారంలోపు అఖిలపక్ష పార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎల్సీ స్థలాల లెక్క తేల్చిన సర్కారు.. నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు.. యూఎల్సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగిన రాజకీయపార్టీల ప్రతినిధుల భేటీలో స్పష్టం చేసింది. అయితే, యూఎల్సీ స్థలాలపై స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే సర్వే నంబర్లవారీగా యూఎల్సీ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ఆధారంగా భూమి స్థితిగతులు, ఆక్రమణలు, విస్తీర్ణం తదితర అంశాలను పొందుపరుస్తూ నివేదిక సమర్పించింది. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణపై ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెగ్యులరైజ్‌తో భారీ రాబడి అంచనా యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణతో సుమారు రూ.6,000కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జిల్లాలోని 11 పట్టణ మండలా ల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములుండగా, దీంట్లో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వివాదరహితంగా ఉన్న 2,083.06 ఎకరాల భూములే ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా శేరిలింగంపల్లిలోని అయ్యప్ప గురుకుల్ ట్రస్ట్ భూ ములున్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారానే భారీగా నిధులు సమీకరించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్థల యాజ మాన్య హక్కుల కోసం ఒకవైపు ట్రస్ట్, దేవాదాయ, యూఎల్సీ విభాగం కోర్టును ఆశ్రయించాయి. యూఎల్సీ, దే వాదాయ శాఖలను కేసులు ఉపసంహరించుకునేలా చేసి.. ట్రస్ట్‌కు కొంత మొత్తాన్ని కేటాయించడం ద్వారా క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. కనీస ధరపై కసరత్తు! యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్ధేశించే ధరపై ఏకాభిప్రాయం కుదరడంలేదు. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా.. అది అసంబద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ ధరకంటే కూడా రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్నందున.. ప్రస్తుత విలువను ప్రామాణికంగా తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ధరను నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో 2008 నాటి కనీస ధర మేరకే క్రమబద్ధీకరించడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయానికి అనుగుణంగా ధరల నిర్ధారణలో మార్పులు చేర్పులు జరిగే అవకాశంలేకపోలేదని యంత్రాంగం అంటోంది.