ఆదాయాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో భూముల క్రమబద్ధీకరణకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం యూఎల్‌సీ (అర్బన్ లాండ్ సీలింగ్) స్థలాలను జల్లెడ పడుతోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆదాయాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో భూముల క్రమబద్ధీకరణకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం యూఎల్‌సీ (అర్బన్ లాండ్ సీలింగ్) స్థలాలను జల్లెడ పడుతోంది. యూఎల్‌సీ భూముల్లో ఆక్రమణలపై ఇప్పటికే లెక్కలు తేల్చిన యంత్రాంగం.. ఆయా భూముల్లో నిర్మాణాలున్న విస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూములపై నిశిత పరిశీలన కొనసాగిస్తోంది. జిల్లాలో 11 మండలాల్లో 3,452.25 ఎకరాల యూఎల్‌సీ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తుండగా.. మిగతా 2,083.06 ఎకరాల భూములు ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నట్లు అధికారులు తేల్చారు.
2,214.31 ఎకరాల్లో నిర్మాణాలు..
ప్రైవేటు పార్టీల ఆధీనంలో ఉన్న యూఎల్‌సీ భూముల్లో ఇప్పటికే ఎక్కవ శాతం విస్తీర్ణంలో శాశ్వత నిర్మాణాలున్నాయి. 11 మండలాల్లో 3,452.25 ఎకరాల్లోని యూఎల్‌సీ భూముల్లో 2,214.31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 1,482.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి వివాదాలు లేకపోగా, 732.11 ఎకరాల్లోని నిర్మాణాలు, స్థలాల అంశం న్యాయస్థానాల పరిధిలో ఉంది. మిగతా 1,237.34 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికీ 637.08 ఎకరాలకు సంబంధించి తాగాదాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. మిగతా భూముల్లో కొంతమేర ప్రహరీలు నిర్మించగా.. మిగతా స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో నిర్మాణాలు ఉన్న భూములకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా భూముల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
యూఎల్‌సీ పరిధిలో..
పరాధీనంలో ఉన్న యూఎల్‌సీ భూములకు సంబంధించి క్రమబద్ధీకరణకోసం గతంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా కొంత మేర డబ్బులు కూడా యూఎల్‌సీకి చెల్లించనప్పటికీ యూఎల్‌సీ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా 6,889 మందికి 578 ఎకరాలకు సంబంధించి క్రమబద్ధీకరణ అంశం యూఎల్‌సీ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 218.14 ఎకరాల్లో 200 గజాల విస్తీర్ణంలోపు ఉన్న దరఖాస్తులున్నాయి. 176.17 ఎకరాల్లో 200-500 విస్తీర్ణానికి సంబంధించి, 107.31 ఎకరాల్లో 500-100 గజాలకు సంబంధించి దరఖాస్తులున్నాయి. అదేవిధంగా 75.26 ఎకరాలో వెయ్యి గజాలకు పైబడిన దరఖాస్తులున్నాయి.