Regulation of the land
-
‘క్రమబద్ధీకరణ’ మళ్లీ మొదటికి!
30% దాటని భూముల క్రమబద్ధీకరణ లబ్ధిదారుల సంఖ్య కఠిన మార్గదర్శకాలే కారణం.. దిద్దుబాటు చర్యలకు పూనుకున్న ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వట్లేదు.దరఖాస్తుల పరిశీలన నిమిత్తం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు కఠినంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనికితోడు ఎక్కడైనా పొరపాటు జరిగితే సంబంధిత అధికారులనే బాధ్యులను చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెవెన్యూ వర్గాలు కూడా లబ్ధిదారుల ఎంపికలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో ఎంపికైన వారి సంఖ్య 30 శాతానికి మించలేదు. ఫలితంగా వీలైనంత ఎక్కువ మంది పేదలకు క్రమబద్ధీకరణ ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరని దుస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్లో ఉచిత కేటగిరిలో వచ్చిన మొ త్తం 64,843 దరఖాస్తుల్లో 42,835 అభ్యంతరకర భూములకు చెందినవిగా నిర్ధారించి తిరస్కరించారు. కేవలం 17,929 దరఖాస్తులనే అర్హమైనవిగా గుర్తించిన అధికారులు మరో 4,079 దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాల కు తగిన ఆధారాలు లేవని పక్కన పెట్టారు. దీంతో ప్రభుత్వం మార్గదర్శకాలను మరింతగా సడలిస్తూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. దీంతో క్రమబద్ధీకరణ మళ్లీ మొదటికొచ్చింది. తిరస్కారానికి గురైన దరఖాస్తులన్నింటినీ మళ్లీ పరిశీలించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. చెక్ మెమోతోనే ఈ దుస్థితి: ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఆయా(125గజాల్లోపు)భూములను ఉచితంగానూ, ఉన్నత వర్గాలకు నిర్ధేశిత రిజిస్ట్రేషన్ ధరతో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం గత డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కేటగిరీలో మొత్తం 3,47,499 దరఖాస్తులురాగా, చెల్లింపు కేటగిరీలో 28,336 దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తుల పరిశీలన నిమిత్తం ప్రభుత్వం జారీచేసిన చెక్మెమోలో పేర్కొన్న విధంగా దరఖాస్తుదారుని పేరు, వృత్తి, మతం, కులం, వీధి, వార్డు, గ్రామం, ఆదాయం, కుటుంబ సభ్యులు..తదితర వివరాలను పరిశీలనకు వెళ్లే రెవెన్యూ అధికారులు స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంది. వీటితోపాటు విద్యుత్, నీటి బిల్లులు, ఓటరు కార్డు, ఆధార్, రేషన్ కార్డులను సంబంధిత శాఖలతో నిర్ధారించుకోవాల్సి ఉంది. భూమి స్థితి అభ్యంతరకరమా, కాదా అన్న అంశాన్ని కూడా స్పష్టం చేయాలి. ఈ అంశాలన్నింటిని నిక్కచ్చిగా పాటించినందునే దరఖాస్తుల్లో 70 శాతం తిరస్కరించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఉచిత కేటగిరీ దరఖాస్తుల పరిశీలనే ఇంకా కొలిక్కి రాకపోవడంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించలేదు. ఆధార్ ఉంటే చాలు: దరఖాస్తుదారులుకు ఆధార్ లేదా రేషన్ కార్డు ఉంటే చాలని, మరే వివరాలను ధ్రువీకరించక్కర్లేదంటూ ప్రభుత్వం తాజాగా మౌఖిక ఆదేశాల్లో పేర్కొంది. అలాగే అభ్యంతరకర భూముల జాబితాలో పట్టాభూములు, కోర్టు వివాదాలు, మిలటరీ భూములు మినహా మిగిలిన అన్ని రకాల భూములను క్రమబద్ధీకరించాలని కూడా అధికారులను ఆదేశించింది. గతంలో దేవాదాయ, పురపాలక భూములు, మురుగు కాలవలు, ర హదారులు, శ్మశాన వాటికలు, శిఖంభూములు, హౌసింగ్ స్థలాలు, నిజాం భూములు, విద్యా, ఆరోగ్య శాఖలకు కేటాయించిన భూములను అభ్యంతరకర భూములుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయా భూముల్లో నివాసముంటున్న వారు దరఖాస్తు చేసినట్లైతే ఆయా దరఖాస్తులను తిరస్కరించాలని సూచించింది. -
క్రమబద్ధీకరణ గడువు పెంపు!
పెద్ద స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన లేకపోవడమే కారణం రిజిస్ట్రేషన్ ధరలు అధికంగా ఉన్నాయంటున్న రెవెన్యూ వర్గాలు ఈ నెల 30 వరకు పొడిగించాలని యోచన సీఎంతో మరోసారి చర్చించి ప్రకటిస్తామన్న అధికారులు హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువును పొడిగించాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 19వ తేదీ వరకు ఉన్న గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలని రెవెన్యూ ఉన్నతాధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే గడువు పెంపు విషయమై మరోమారు సీఎంతో చర్చించిన తర్వాతే ప్రకటన చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటి క్రమబద్ధీకరణకు గత నెల 31న ఉత్తర్వులను జారీచేసింది. జీవో 58 ప్రకారం 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని, జీవో 59 ప్రకారం 125 గజాలను మించిన స్థలాలను వివిధ కేటగిరీల కింద సొమ్ము వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఉచిత క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల దర ఖాస్తులు రాగా, సొమ్ము చెల్లించే కేటగిరీ కింద వచ్చిన దరఖాస్తుల సంఖ్య రెండంకెలు దాటలేదు. ఇలాంటి స్థలాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో స్పందనే లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలక న్నా ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. రాష్ర్ట్ర విభజన అనంతరం రాజధానితోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ధరలు తగ్గాయని రెవెన్యూ అధికారులే అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం చివరిసారి నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరలనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఆక్రమణదారులు భూముల క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. అలాగే సంక్రాంతి పండుగతో వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు సమర్పణకు గడువు పెంచాలని, భూముల క్రమబద్ధీకరణకు 2013 ఏప్రిల్ కంటే ముందున్న రిజిస్ట్రేషన్ ధరలను వర్తింప జేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. జీవో 59 ప్రకారం ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణతో వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో గడువు పెంచి చూడాలని నిర్ణయానికి వచ్చారు. -
జాగా.. పాగా!.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆదాయాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో భూముల క్రమబద్ధీకరణకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం యూఎల్సీ (అర్బన్ లాండ్ సీలింగ్) స్థలాలను జల్లెడ పడుతోంది. యూఎల్సీ భూముల్లో ఆక్రమణలపై ఇప్పటికే లెక్కలు తేల్చిన యంత్రాంగం.. ఆయా భూముల్లో నిర్మాణాలున్న విస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూములపై నిశిత పరిశీలన కొనసాగిస్తోంది. జిల్లాలో 11 మండలాల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తుండగా.. మిగతా 2,083.06 ఎకరాల భూములు ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 2,214.31 ఎకరాల్లో నిర్మాణాలు.. ప్రైవేటు పార్టీల ఆధీనంలో ఉన్న యూఎల్సీ భూముల్లో ఇప్పటికే ఎక్కవ శాతం విస్తీర్ణంలో శాశ్వత నిర్మాణాలున్నాయి. 11 మండలాల్లో 3,452.25 ఎకరాల్లోని యూఎల్సీ భూముల్లో 2,214.31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 1,482.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి వివాదాలు లేకపోగా, 732.11 ఎకరాల్లోని నిర్మాణాలు, స్థలాల అంశం న్యాయస్థానాల పరిధిలో ఉంది. మిగతా 1,237.34 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికీ 637.08 ఎకరాలకు సంబంధించి తాగాదాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. మిగతా భూముల్లో కొంతమేర ప్రహరీలు నిర్మించగా.. మిగతా స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో నిర్మాణాలు ఉన్న భూములకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా భూముల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. యూఎల్సీ పరిధిలో.. పరాధీనంలో ఉన్న యూఎల్సీ భూములకు సంబంధించి క్రమబద్ధీకరణకోసం గతంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా కొంత మేర డబ్బులు కూడా యూఎల్సీకి చెల్లించనప్పటికీ యూఎల్సీ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా 6,889 మందికి 578 ఎకరాలకు సంబంధించి క్రమబద్ధీకరణ అంశం యూఎల్సీ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 218.14 ఎకరాల్లో 200 గజాల విస్తీర్ణంలోపు ఉన్న దరఖాస్తులున్నాయి. 176.17 ఎకరాల్లో 200-500 విస్తీర్ణానికి సంబంధించి, 107.31 ఎకరాల్లో 500-100 గజాలకు సంబంధించి దరఖాస్తులున్నాయి. అదేవిధంగా 75.26 ఎకరాలో వెయ్యి గజాలకు పైబడిన దరఖాస్తులున్నాయి.