క్రమబద్ధీకరణ గడువు పెంపు! | Sort increment date! | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరణ గడువు పెంపు!

Published Wed, Jan 14 2015 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

Sort increment date!

పెద్ద స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన లేకపోవడమే కారణం
రిజిస్ట్రేషన్ ధరలు అధికంగా ఉన్నాయంటున్న రెవెన్యూ వర్గాలు

ఈ నెల 30 వరకు పొడిగించాలని యోచన  సీఎంతో మరోసారి చర్చించి ప్రకటిస్తామన్న అధికారులు
 
హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువును పొడిగించాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 19వ తేదీ వరకు ఉన్న గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలని రెవెన్యూ ఉన్నతాధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే గడువు పెంపు విషయమై మరోమారు సీఎంతో చర్చించిన తర్వాతే ప్రకటన చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటి క్రమబద్ధీకరణకు గత నెల 31న ఉత్తర్వులను జారీచేసింది. జీవో 58 ప్రకారం 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని, జీవో 59 ప్రకారం 125 గజాలను మించిన స్థలాలను వివిధ కేటగిరీల కింద సొమ్ము వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఉచిత క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల దర ఖాస్తులు రాగా, సొమ్ము చెల్లించే కేటగిరీ కింద వచ్చిన దరఖాస్తుల సంఖ్య రెండంకెలు దాటలేదు.

ఇలాంటి స్థలాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో స్పందనే లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలక న్నా ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. రాష్ర్ట్ర విభజన అనంతరం రాజధానితోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ధరలు తగ్గాయని రెవెన్యూ అధికారులే అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం చివరిసారి నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరలనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఆక్రమణదారులు భూముల క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. అలాగే సంక్రాంతి పండుగతో వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు సమర్పణకు గడువు పెంచాలని, భూముల క్రమబద్ధీకరణకు 2013 ఏప్రిల్ కంటే ముందున్న రిజిస్ట్రేషన్ ధరలను వర్తింప జేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. జీవో 59 ప్రకారం ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణతో వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో గడువు పెంచి చూడాలని నిర్ణయానికి వచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement