నెలాఖరు వరకు ఫీజు రీయింబర్స్మెంట్
► కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సరళతరం
► జనవరి 26లోగా వెయ్యి ఎకరాల భూపంపిణీ
► వికలాంగుల శాఖ భవనానికి రూ.కోటి
► ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
► సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ నెల 15తో ముగిసిన చివరి తేదీని డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద వర్గాల వారి వివాహాలకు ప్రభుత్వం ఇచ్చే రూ.51వేల ఆర్థిక సహాయం పెళ్లికి ముందే అందేలా నిబంధనలు సరళతరం చేసేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో సంక్షేమ శాఖల పనితీరుపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంతి కడియం శ్రీహరి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రెండు నెలలుగా సమీక్షలు జరగలేదు. సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్షతో కడియం శ్రీహరి మళ్లీ ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల శాఖ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఏ ఇబ్బందీ లేకుండా సంక్షేమ శాఖల వసతి గృహాలను తీర్చిదిద్దాలని అధికారులకు చెప్పారు. కరెంటు, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో ఏ సమస్యలూ లేకుండా చర్యలు తీసుకోవాలని.. భవనాలకు రంగులు సైతం వేయించాలని ఆదేశించారు.
2016 జనవరి 15లోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అధికారులు, సంక్షేమ వసతిగృహాలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన సౌకర్యాలపై అంచనా నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతిపాదనల ఆధారంగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే మార్చిలో 10 తరగతి పరీక్షలు జరుగనున్నందున సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరంగల్లోని వికలాంగుల శాఖ వసతి గృహం నూతన భవనానికి ఒక కోటి రూపాయలు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కడియం శ్రీహరి తెలిపారు. సంక్షేమ శాఖలు పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలకు అందించేలా అవసరమైతే మార్గదర్శకాలకు సవరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న పథకాల కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వ ఆమోదం పొందిందని, లబ్దిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్, గ్రామసభల ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించాలన్నారు.
దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించి అర్హుల జాబితా కలెక్టర్ పంపించాలని, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అర్హుల జాబితాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం అందుతుందని చెప్పారు. ఇలాంటి పథకాలలో సబ్సిడీని ప్రభుత్వం భారీగా పెంచిందని పేర్కొన్నారు. 2016 జనవరి 26 నాటికి జిల్లాలోని భూమి లేని నిరుపేదలకు వెయ్యి ఎకరాలను పంపిణీ చేయాలని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వంద ఎకరాల చొప్పున.. వచ్చే జనవరి 25న ఎమ్మెల్యేలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీల పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. అంగన్వాడీలలో ఎక్కువ పిల్లలను చూపించి ప్రభుత్వం అందించే సౌకర్యాలను దుర్వినియోగపరుస్తున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్, అదనపు జేసీ తిరుపతిరావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.