రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వట్లేదు.
30% దాటని భూముల క్రమబద్ధీకరణ లబ్ధిదారుల సంఖ్య
కఠిన మార్గదర్శకాలే కారణం..
దిద్దుబాటు చర్యలకు పూనుకున్న ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వట్లేదు.దరఖాస్తుల పరిశీలన నిమిత్తం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు కఠినంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనికితోడు ఎక్కడైనా పొరపాటు జరిగితే సంబంధిత అధికారులనే బాధ్యులను చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెవెన్యూ వర్గాలు కూడా లబ్ధిదారుల ఎంపికలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో ఎంపికైన వారి సంఖ్య 30 శాతానికి మించలేదు. ఫలితంగా వీలైనంత ఎక్కువ మంది పేదలకు క్రమబద్ధీకరణ ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరని దుస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్‌లో ఉచిత కేటగిరిలో వచ్చిన మొ త్తం 64,843 దరఖాస్తుల్లో 42,835 అభ్యంతరకర భూములకు చెందినవిగా నిర్ధారించి తిరస్కరించారు. కేవలం 17,929 దరఖాస్తులనే అర్హమైనవిగా గుర్తించిన అధికారులు మరో 4,079 దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాల కు తగిన ఆధారాలు లేవని పక్కన పెట్టారు. దీంతో ప్రభుత్వం మార్గదర్శకాలను మరింతగా సడలిస్తూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. దీంతో క్రమబద్ధీకరణ మళ్లీ మొదటికొచ్చింది. తిరస్కారానికి గురైన దరఖాస్తులన్నింటినీ మళ్లీ పరిశీలించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
చెక్ మెమోతోనే ఈ దుస్థితి: ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఆయా(125గజాల్లోపు)భూములను ఉచితంగానూ, ఉన్నత వర్గాలకు నిర్ధేశిత రిజిస్ట్రేషన్ ధరతో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం గత డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కేటగిరీలో మొత్తం 3,47,499 దరఖాస్తులురాగా, చెల్లింపు కేటగిరీలో 28,336 దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తుల పరిశీలన నిమిత్తం ప్రభుత్వం జారీచేసిన చెక్‌మెమోలో పేర్కొన్న విధంగా దరఖాస్తుదారుని పేరు, వృత్తి, మతం, కులం, వీధి, వార్డు, గ్రామం, ఆదాయం, కుటుంబ సభ్యులు..తదితర వివరాలను పరిశీలనకు వెళ్లే రెవెన్యూ అధికారులు స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంది. వీటితోపాటు విద్యుత్, నీటి బిల్లులు, ఓటరు కార్డు, ఆధార్, రేషన్ కార్డులను సంబంధిత శాఖలతో నిర్ధారించుకోవాల్సి ఉంది. భూమి స్థితి అభ్యంతరకరమా, కాదా అన్న అంశాన్ని కూడా స్పష్టం చేయాలి. ఈ అంశాలన్నింటిని నిక్కచ్చిగా పాటించినందునే దరఖాస్తుల్లో 70 శాతం తిరస్కరించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఉచిత కేటగిరీ దరఖాస్తుల పరిశీలనే ఇంకా కొలిక్కి రాకపోవడంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించలేదు.
ఆధార్ ఉంటే చాలు: దరఖాస్తుదారులుకు ఆధార్ లేదా రేషన్ కార్డు ఉంటే చాలని, మరే వివరాలను ధ్రువీకరించక్కర్లేదంటూ ప్రభుత్వం తాజాగా మౌఖిక ఆదేశాల్లో పేర్కొంది. అలాగే అభ్యంతరకర భూముల జాబితాలో పట్టాభూములు, కోర్టు వివాదాలు, మిలటరీ భూములు మినహా మిగిలిన అన్ని రకాల భూములను క్రమబద్ధీకరించాలని కూడా అధికారులను ఆదేశించింది. గతంలో దేవాదాయ, పురపాలక భూములు, మురుగు కాలవలు, ర హదారులు, శ్మశాన వాటికలు, శిఖంభూములు, హౌసింగ్ స్థలాలు, నిజాం భూములు, విద్యా, ఆరోగ్య శాఖలకు కేటాయించిన భూములను అభ్యంతరకర భూములుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయా భూముల్లో నివాసముంటున్న వారు దరఖాస్తు చేసినట్లైతే ఆయా దరఖాస్తులను తిరస్కరించాలని సూచించింది.