List of Lands
-
Dharani Portal: సమస్యల్లేని ‘ధరణి’! పక్కా ప్లాన్ రెడీ చేస్తున్న తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిషేధిత భూముల జాబితాలో చేర్చిన పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ఇప్పటికే సుమోటోగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ముందుకెళుతోంది. అందులో భాగంగా డిసెంబర్ నెలాఖరు లేదంటే జనవరి నెలలో గ్రామాలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో రూపొందిస్తూనే.. జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే గ్రామస్థాయి కార్యాచరణపై సమాచారం అందించింది. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. జూలైలోనే అనుకున్నా... ధరణి గ్రీవెన్సులు అధికారికంగానే 10లక్షలు దాటిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఆ సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూలై5న ప్రకటించారు. జూలై15 కల్లా వీటిని పూర్తి చేయాలని చెప్పినప్పటికీ అప్పట్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సాధ్యం కాలేదు. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా ములుగులో మాత్రం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత దసరా అనంతరం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, గ్రామస్థాయికి వెళ్లి ధరణి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రతిపాదన కూడా అమలు కాలేదు. అయితే, ఇటీవల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో సీసీఎల్ఏ వేదికగా నిషేధిత జాబితాను ప్రక్షాళన చేసే ప్రయత్నం జరిగింది. దీంతో మళ్లీ గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆరేడు వారాల్లో... దశల వారీగా గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే కొత్త తలనొప్పులు వస్తాయేమోననే భయం రెవెన్యూ యంత్రాంగాన్ని వేధిస్తోంది. ఇప్పటికే ధరణి సమస్యలు ప్రతి గ్రా మంలో 150వరకు ఉంటాయని అంచనా. క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖకు సిబ్బంది కూడా తగినంతమంది లేరు. దీంతో ఒకేసారి అన్ని గ్రామాలకు వెళ్లకుండా దశల వారీగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 7–10 వారాల పాటు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల నేతృత్వంలో రెండు బృందాలు ఏర్పాటు చేయాలని, ఆ బృందాలు రెండు గ్రామాలకు వెళ్లి వారంలో 2 రోజుల పాటు ధరణి సమస్యలపై దరఖాస్తులు తీసుకోవాలని, మిగిలిన నాలు గు రోజులు వాటి పరిష్కార ప్రక్రియ చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇలా సదరు మండలంలో అన్ని గ్రామాలు పూర్తయ్యేంతవరకు కార్యక్రమా న్ని కొనసాగించనుంది. ఇలా చేస్తే ఆరేడు వారాల్లో ప్రతి మండలంలో అన్ని గ్రామాలు పూర్తవుతాయని, కొన్ని మండలాల్లో 10 వారాల వరకు వెళ్లినా మొత్తంగా 7–10 వారాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తవుతాయని సర్కారు భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్న ప్రభుత్వ వర్గాలు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లనున్నాయి. ఈ నేప థ్యంలో త్వరలో సీఎం సమక్షంలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కూడా ధరణి సమస్యల పరిష్కారంపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. -
ఆ భూముల్ని 22ఏ నుంచి తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: షరతులు గల పట్టా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించవచ్చని కలెక్టర్లకు స్పష్టం చేస్తూ కొన్ని మార్గదర్శకాలతో ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. భూమి స్వభావం ప్రభుత్వ మెట్ట/మాగాణి/సాగు లభ్యత ఉన్న మెట్ట భూమి అయి ఉండి, రీసర్వే రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో షరతుల గల పట్టా అని కొన్ని ప్రత్యేక సూచికలతో ఉన్న భూములను వీటి కింద పరిగణించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆర్ఎస్ఆర్లోని పట్టాదారు కాలమ్‌లో పట్టాదారుడి పేరు అదే సర్వే నంబరులో ఉన్నట్లు రికార్డుల్లో ఉండాలని సూచించింది. అలాగే ఈ పట్టాలన్నీ 1954 జూన్ 18 లోపు ఇచ్చి ఉండాలని పేర్కొంది. ఈ మూడు అంశాలకు లోబడి రాష్ట్రంలో అన్నిజిల్లాల్లో షరతులు గల పట్టాలను 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ నుంచి తొలగించవచ్చని సూచించింది. కృష్ణా జిల్లాలో ఈ తరహా భూములు వేలాదిగా ఉన్నాయని, వాటిని 22ఏ నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ పాలనలో 1932–34ల్లో కొన్ని షరతులతో ఈ భూములను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన ప్రభుత్వానికి నివేదించారు. రెవెన్యూ కార్యాలయాల రికార్డుల్లో మాత్రం ఈ వివరాలేవీ లేవని పేర్కొన్నారు. రైతులు మాత్రం పూర్వం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ.. 2016 వరకు వాటి క్రయవిక్రయాలు కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు షరతులు గల పట్టా పేరుతో 18,285 ఎకరాలు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించింది. కృష్ణా జిల్లాలో ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 15 వేల ఎకరాలకుపైగా ఉన్నట్లు తేల్చారు. మరికొన్ని జిల్లాల్లోనూ షరతుల గల పట్టా భూములు ఉన్నాయని, వాటి విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని జేసీలతో నిర్వహించిన సమావేశంలో వారు కోరారు. లోతుగా అధ్యయనం చేశాక వేలాది మంది రైతులకు మేలు చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది. -
ఆ అధికారం జిల్లా కలెక్టర్లకే ఉంది
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూముల్లో ఏవి నిషేధిత భూములో తెలిపే జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు పంపే అధికారం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూముల జాబితా పంపే అధికారం తహసీల్దార్లకు లేదని స్పష్టం చేసింది. కలెక్టర్లు పంపిన జాబితా ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారులు నడుచుకోవాలని తెలిపింది. ఇతర శాఖల అధికారులు కూడా ఈ జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా పంపేందుకు మాత్రమే చట్టం అనుమతిస్తుందని తెలిపింది. ఈ జాబితాలోని భూముల వివరాలను కలెక్టర్లు పరిశీలించి, సంతృప్తికరంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలని స్పష్టం చేసింది. కలెక్టర్లు కాకుండా ఇతర అధికారులు నేరుగా పంపిన జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులు వెనక్కి పంపి, కలెక్టర్ల ద్వారా జాబితా పంపాలని కోరవచ్చునని తెలిపింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండల తహసీల్దార్ అంగల్లు గ్రామంలోని 3.14 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తూ మదనపల్లి సబ్ రిజిష్ట్రార్‌కు పంపడాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటించింది. ఆ జాబితా ఆధారంగా ఆ భూమిని విక్రయించేందుకు పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. ఆ డాక్యుమెంట్లను స్వీకరించి, ఆ భూములపై రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఇతర నిషేధ ఉత్తర్వులు ఏవీ లేకుంటే రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిష్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పునిచ్చారు. ఇదీ నేపథ్యం అంగల్లు గ్రామంలోని రెండు సర్వే నంబర్లలో 3.88 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు డి.కృష్ణమూర్తి నాయుడికి కేటాయించారు. ఆయన మరణానంతరం ఆ భూమిని పొందిన వ్యక్తులు అందులో 3.14 ఎకరాలని ఇతరులకు విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లు సమర్పించారు. ఆ భూమి తహసీల్దార్ పంపిన నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో సబ్‌రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్లను స్వీకరించలేదు. దీంతో భూమి విక్రేతలు దొమ్మాలపాటి సరళ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది కొవ్వూరి వీఆర్ రెడ్డి, ప్రభుత్వం తరపున సహాయ న్యాయవాది (ఏజీపీ) వాదనలు వినిపించారు. -
‘క్రమబద్ధీకరణ’ మళ్లీ మొదటికి!
30% దాటని భూముల క్రమబద్ధీకరణ లబ్ధిదారుల సంఖ్య కఠిన మార్గదర్శకాలే కారణం.. దిద్దుబాటు చర్యలకు పూనుకున్న ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వట్లేదు.దరఖాస్తుల పరిశీలన నిమిత్తం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు కఠినంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనికితోడు ఎక్కడైనా పొరపాటు జరిగితే సంబంధిత అధికారులనే బాధ్యులను చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెవెన్యూ వర్గాలు కూడా లబ్ధిదారుల ఎంపికలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో ఎంపికైన వారి సంఖ్య 30 శాతానికి మించలేదు. ఫలితంగా వీలైనంత ఎక్కువ మంది పేదలకు క్రమబద్ధీకరణ ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరని దుస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్‌లో ఉచిత కేటగిరిలో వచ్చిన మొ త్తం 64,843 దరఖాస్తుల్లో 42,835 అభ్యంతరకర భూములకు చెందినవిగా నిర్ధారించి తిరస్కరించారు. కేవలం 17,929 దరఖాస్తులనే అర్హమైనవిగా గుర్తించిన అధికారులు మరో 4,079 దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాల కు తగిన ఆధారాలు లేవని పక్కన పెట్టారు. దీంతో ప్రభుత్వం మార్గదర్శకాలను మరింతగా సడలిస్తూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. దీంతో క్రమబద్ధీకరణ మళ్లీ మొదటికొచ్చింది. తిరస్కారానికి గురైన దరఖాస్తులన్నింటినీ మళ్లీ పరిశీలించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. చెక్ మెమోతోనే ఈ దుస్థితి: ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఆయా(125గజాల్లోపు)భూములను ఉచితంగానూ, ఉన్నత వర్గాలకు నిర్ధేశిత రిజిస్ట్రేషన్ ధరతో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం గత డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కేటగిరీలో మొత్తం 3,47,499 దరఖాస్తులురాగా, చెల్లింపు కేటగిరీలో 28,336 దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తుల పరిశీలన నిమిత్తం ప్రభుత్వం జారీచేసిన చెక్మెమోలో పేర్కొన్న విధంగా దరఖాస్తుదారుని పేరు, వృత్తి, మతం, కులం, వీధి, వార్డు, గ్రామం, ఆదాయం, కుటుంబ సభ్యులు..తదితర వివరాలను పరిశీలనకు వెళ్లే రెవెన్యూ అధికారులు స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంది. వీటితోపాటు విద్యుత్, నీటి బిల్లులు, ఓటరు కార్డు, ఆధార్, రేషన్ కార్డులను సంబంధిత శాఖలతో నిర్ధారించుకోవాల్సి ఉంది. భూమి స్థితి అభ్యంతరకరమా, కాదా అన్న అంశాన్ని కూడా స్పష్టం చేయాలి. ఈ అంశాలన్నింటిని నిక్కచ్చిగా పాటించినందునే దరఖాస్తుల్లో 70 శాతం తిరస్కరించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఉచిత కేటగిరీ దరఖాస్తుల పరిశీలనే ఇంకా కొలిక్కి రాకపోవడంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించలేదు. ఆధార్ ఉంటే చాలు: దరఖాస్తుదారులుకు ఆధార్ లేదా రేషన్ కార్డు ఉంటే చాలని, మరే వివరాలను ధ్రువీకరించక్కర్లేదంటూ ప్రభుత్వం తాజాగా మౌఖిక ఆదేశాల్లో పేర్కొంది. అలాగే అభ్యంతరకర భూముల జాబితాలో పట్టాభూములు, కోర్టు వివాదాలు, మిలటరీ భూములు మినహా మిగిలిన అన్ని రకాల భూములను క్రమబద్ధీకరించాలని కూడా అధికారులను ఆదేశించింది. గతంలో దేవాదాయ, పురపాలక భూములు, మురుగు కాలవలు, ర హదారులు, శ్మశాన వాటికలు, శిఖంభూములు, హౌసింగ్ స్థలాలు, నిజాం భూములు, విద్యా, ఆరోగ్య శాఖలకు కేటాయించిన భూములను అభ్యంతరకర భూములుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయా భూముల్లో నివాసముంటున్న వారు దరఖాస్తు చేసినట్లైతే ఆయా దరఖాస్తులను తిరస్కరించాలని సూచించింది.