
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూముల్లో ఏవి నిషేధిత భూములో తెలిపే జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు పంపే అధికారం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూముల జాబితా పంపే అధికారం తహసీల్దార్లకు లేదని స్పష్టం చేసింది. కలెక్టర్లు పంపిన జాబితా ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారులు నడుచుకోవాలని తెలిపింది. ఇతర శాఖల అధికారులు కూడా ఈ జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా పంపేందుకు మాత్రమే చట్టం అనుమతిస్తుందని తెలిపింది.
ఈ జాబితాలోని భూముల వివరాలను కలెక్టర్లు పరిశీలించి, సంతృప్తికరంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలని స్పష్టం చేసింది. కలెక్టర్లు కాకుండా ఇతర అధికారులు నేరుగా పంపిన జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులు వెనక్కి పంపి, కలెక్టర్ల ద్వారా జాబితా పంపాలని కోరవచ్చునని తెలిపింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండల తహసీల్దార్ అంగల్లు గ్రామంలోని 3.14 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తూ మదనపల్లి సబ్ రిజిష్ట్రార్‌కు పంపడాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటించింది.
ఆ జాబితా ఆధారంగా ఆ భూమిని విక్రయించేందుకు పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. ఆ డాక్యుమెంట్లను స్వీకరించి, ఆ భూములపై రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఇతర నిషేధ ఉత్తర్వులు ఏవీ లేకుంటే రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిష్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పునిచ్చారు.
ఇదీ నేపథ్యం
అంగల్లు గ్రామంలోని రెండు సర్వే నంబర్లలో 3.88 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు డి.కృష్ణమూర్తి నాయుడికి కేటాయించారు. ఆయన మరణానంతరం ఆ భూమిని పొందిన వ్యక్తులు అందులో 3.14 ఎకరాలని ఇతరులకు విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లు సమర్పించారు.
ఆ భూమి తహసీల్దార్ పంపిన నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో సబ్‌రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్లను స్వీకరించలేదు. దీంతో భూమి విక్రేతలు దొమ్మాలపాటి సరళ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది కొవ్వూరి వీఆర్ రెడ్డి, ప్రభుత్వం తరపున సహాయ న్యాయవాది (ఏజీపీ) వాదనలు వినిపించారు.