సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిషేధిత భూముల జాబితాలో చేర్చిన పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ఇప్పటికే సుమోటోగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ముందుకెళుతోంది. అందులో భాగంగా డిసెంబర్ నెలాఖరు లేదంటే జనవరి నెలలో గ్రామాలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో రూపొందిస్తూనే.. జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే గ్రామస్థాయి కార్యాచరణపై సమాచారం అందించింది. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది.
జూలైలోనే అనుకున్నా...
ధరణి గ్రీవెన్సులు అధికారికంగానే 10లక్షలు దాటిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఆ సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూలై5న ప్రకటించారు. జూలై15 కల్లా వీటిని పూర్తి చేయాలని చెప్పినప్పటికీ అప్పట్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సాధ్యం కాలేదు. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా ములుగులో మాత్రం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
ఆ తర్వాత దసరా అనంతరం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, గ్రామస్థాయికి వెళ్లి ధరణి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రతిపాదన కూడా అమలు కాలేదు. అయితే, ఇటీవల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో సీసీఎల్‌ఏ వేదికగా నిషేధిత జాబితాను ప్రక్షాళన చేసే ప్రయత్నం జరిగింది. దీంతో మళ్లీ గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆరేడు వారాల్లో... దశల వారీగా
గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే కొత్త తలనొప్పులు వస్తాయేమోననే భయం రెవెన్యూ యంత్రాంగాన్ని వేధిస్తోంది. ఇప్పటికే ధరణి సమస్యలు ప్రతి గ్రా మంలో 150వరకు ఉంటాయని అంచనా. క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖకు సిబ్బంది కూడా తగినంతమంది లేరు. దీంతో ఒకేసారి అన్ని గ్రామాలకు వెళ్లకుండా దశల వారీగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అందులో భాగంగానే 7–10 వారాల పాటు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల నేతృత్వంలో రెండు బృందాలు ఏర్పాటు చేయాలని, ఆ బృందాలు రెండు గ్రామాలకు వెళ్లి వారంలో 2 రోజుల పాటు ధరణి సమస్యలపై దరఖాస్తులు తీసుకోవాలని, మిగిలిన నాలు గు రోజులు వాటి పరిష్కార ప్రక్రియ చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఇలా సదరు మండలంలో అన్ని గ్రామాలు పూర్తయ్యేంతవరకు కార్యక్రమా న్ని కొనసాగించనుంది. ఇలా చేస్తే ఆరేడు వారాల్లో ప్రతి మండలంలో అన్ని గ్రామాలు పూర్తవుతాయని, కొన్ని మండలాల్లో 10 వారాల వరకు వెళ్లినా మొత్తంగా 7–10 వారాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తవుతాయని సర్కారు భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్న ప్రభుత్వ వర్గాలు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లనున్నాయి. ఈ నేప థ్యంలో త్వరలో సీఎం సమక్షంలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కూడా ధరణి సమస్యల పరిష్కారంపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment