
సాక్షి, అమరావతి: షరతులు గల పట్టా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించవచ్చని కలెక్టర్లకు స్పష్టం చేస్తూ కొన్ని మార్గదర్శకాలతో ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. భూమి స్వభావం ప్రభుత్వ మెట్ట/మాగాణి/సాగు లభ్యత ఉన్న మెట్ట భూమి అయి ఉండి, రీసర్వే రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్)లో షరతుల గల పట్టా అని కొన్ని ప్రత్యేక సూచికలతో ఉన్న భూములను వీటి కింద పరిగణించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
ఆర్‌ఎస్‌ఆర్‌లోని పట్టాదారు కాలమ్‌లో పట్టాదారుడి పేరు అదే సర్వే నంబరులో ఉన్నట్లు రికార్డుల్లో ఉండాలని సూచించింది. అలాగే ఈ పట్టాలన్నీ 1954 జూన్ 18 లోపు ఇచ్చి ఉండాలని పేర్కొంది. ఈ మూడు అంశాలకు లోబడి రాష్ట్రంలో అన్నిజిల్లాల్లో షరతులు గల పట్టాలను 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ నుంచి తొలగించవచ్చని సూచించింది. కృష్ణా జిల్లాలో ఈ తరహా భూములు వేలాదిగా ఉన్నాయని, వాటిని 22ఏ నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు.
బ్రిటిష్ పాలనలో 1932–34ల్లో కొన్ని షరతులతో ఈ భూములను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన ప్రభుత్వానికి నివేదించారు. రెవెన్యూ కార్యాలయాల రికార్డుల్లో మాత్రం ఈ వివరాలేవీ లేవని పేర్కొన్నారు. రైతులు మాత్రం పూర్వం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ.. 2016 వరకు వాటి క్రయవిక్రయాలు కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు షరతులు గల పట్టా పేరుతో 18,285 ఎకరాలు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించింది. కృష్ణా జిల్లాలో ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 15 వేల ఎకరాలకుపైగా ఉన్నట్లు తేల్చారు. మరికొన్ని జిల్లాల్లోనూ షరతుల గల పట్టా భూములు ఉన్నాయని, వాటి విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని జేసీలతో నిర్వహించిన సమావేశంలో వారు కోరారు.
లోతుగా అధ్యయనం చేశాక వేలాది మంది రైతులకు మేలు చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment