యూఎల్‌సీ ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా | LRS applications received so far are 71,808 | Sakshi
Sakshi News home page

యూఎల్‌సీ ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా

Published Wed, Mar 14 2018 2:09 AM | Last Updated on Wed, Mar 14 2018 2:09 AM

LRS applications received so far are 71,808 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అర్బన్‌లాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) భూముల్లోని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీకి అందిన 71,808 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో దాదాపు 36 వేలు పెండింగ్‌లో పడ్డాయి. వీటిలో 14,646 దరఖాస్తులు యూఎల్‌సీ భూముల్లోవే. వీటికి సంబంధించి ప్రజలకు సరైన సమాచారం, స్పష్టత లేకపోవడంతో షార్ట్‌ఫాల్స్‌ (అవసరమైన పత్రాలు)ను సమర్పించ లేకపోయారు. గత నెల 28 వరకే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి గడువునిచ్చిన ప్రభుత్వం దాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించడం తెలిసిందే. అయినప్పటికీ, ఇంకా షార్ట్‌ఫాల్స్‌ జత చేయడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రజలకు అవగాహన లేకే యూఎల్‌సీ భూముల్లోని వాటికి అవసరమైన షార్ట్‌ఫాల్స్‌ సమర్పించడం లేదని గుర్తించారు. వారికి తగిన అవగాహన కల్పించేందుకు, అవసరమైన పత్రాలు జత చేసేలా చూసేందుకు ఈ నెల 16, 17 తేదీల్లో యూఎల్‌సీ షార్ట్‌ఫాల్స్‌పై మేళా నిర్వహించా లని నిర్ణయించారు. ఈ మేళా తేదీల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  

పక్కా జాబితాలతో సత్వర పరిష్కారం 
యూఎల్‌సీ భూములకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో చర్చించి యూఎల్‌సీ భూములకు సంబంధించిన లేఔట్లు, సర్వే నంబర్లు.. ఆయా సర్వే నంబర్లలో ఏయే రకాల భూములున్నదీ పూర్తి వివరాలతో కూడిన మ్యాపుల్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సేకరించారు. ఆయా సర్వే నంబర్లలో కొన్ని ప్లాట్లకు యూఎల్‌సీ క్లియరెన్స్‌ అవసరం కాగా, కొన్ని ప్లాట్లు అసలు యూఎల్‌సీ లోనే లేవు. అయితే ఆ విషయం అటు ప్రజలకే కాక ఇటు అధికారులకు కూడా తెలియకపోవడంతో యూఎల్‌సీలో లేనివాటిని కూడా పరిష్కరించలేదు. ప్రస్తుతం రెవెన్యూ మండలాల వారీగా ఏ సర్వే నంబర్లలో ఏయే లేఔట్లు /ప్లాట్లు యూఎల్‌సీ పరిధిలో లేవో, ఏవి ఉన్నాయో అధికారుల వద్ద జాబితాలు న్నాయి. వాటి గురించి ప్రజలకు కూడా తెలియజేయనున్నారు. తద్వారా యూఎల్‌సీ పరిధిలో లేని దరఖాస్తుల్ని పరిష్కరించనున్నారు.  

మేళాల్లో ప్రజలకు అవగాహన
యూఎల్‌సీ భూముల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాల్లో సంబంధిత దరఖాస్తుదారులకు అన్ని వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తామని టౌన్‌ప్లానింగ్‌ విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ కె. శ్రీనివాసరావు తెలిపారు. మరికొన్ని లేఔట్లు /ప్లాట్లు యూఎల్‌సీ పరిధిలో ఉండగా, సంబంధిత జీవో ద్వారా క్లియరెన్స్‌ పొందిన వారు కూడా సదరు జీవో ప్రతుల్ని దరఖాస్తులతోపాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేదని శ్రీనివాసరావు తెలిపారు. అలాంటి వారు సంబంధిత జీవో ప్రతుల్ని సమర్పిస్తే వారి దరఖాస్తుల్ని పరిష్కరించనున్నారు. మరికొందరు యూఎల్‌సీ భూముల్లోని లేఔట్లకు రెవెన్యూ శాఖ నుంచి క్లియరెన్స్‌ పొందలేదు. అలాంటి వారు నిర్ణీత ఫీజు చెల్లించి, క్లియరెన్స్‌ తెచ్చుకుంటే వారి దరఖాస్తుల్ని కూడా పరిష్కరించనున్నారు. ఈ అంశాల్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు యూఎల్‌సీ భూములకు సంబంధించే రెండు రోజులు ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాలు నిర్వహించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement