Urban Land Ceiling
-
‘యూఎల్సీ’ లెక్క తేలింది!
సర్కారుకు అధికారుల నివేదిక నేడు అఖిలపక్ష సమావేశం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం సిటీబ్యూరో: నగరంలో పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఈ వివరాలను అఖిల పక్షం ముందు ఉంచాల్సి రావటంతో సత్వరమే ఇవ్వాలని ఉన్నతాధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యం త్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు... యూఎల్సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది. నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో యూఎల్సీ స్థలాలు అధికంగా ఉండటంతో స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేయటంతో... సర్వే నంబర్ల వారీగా వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. పార్టీలకు కూడా వీటిని అందజేసినట్లు తెలిసింది. యూఎల్సీ, ప్రభుత్వ భూములు, ఇళ్లు, భవనాల క్రమబద్ధీకరణపై మంగళవారం (ఈ నెల 16న) ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాసుల పంటపై భారీ ఆశలు హైదరాబాద్ జిల్లాలో యూఎల్సీ భూములు 1736 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 1614 ఎకరాలలో 35 వేలకు పైగా భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ శాఖ, వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా రూ. కోట్లలో ఆదాయాన్ని రాబట్టవచ్చునని సూచించినట్లు తెలుస్తోంది. వివాదాలు లేని యూఎల్సీ భూమి 72 ఎకరాలు ఉంటుందని అంచనా వేశారు. వీటి అమ్మకాల ద్వారా రూ.కోట్లలో నిధులు రాగలవని తేల్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమి 21.10 ఎకరాలు ఉందని, తద్వారా రూ.1500 కోట్లు రాబట్టుకోవచ్చునని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని 11 పట్టణ మండలాల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములు ఉండగా, ఇందులో 1369.19 ఎకరాలపై కోర్టు కేసులు ఉన్నాయి. 1482 ఎకరాల్లోని నిర్మాణాలు క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 601 ఎకరాల్లో భూములను విక్రయించవచ్చునంటున్నారు. వీటిలో శేరిలింగంపల్లిలోని భూములే ఎక్కువని సమాచారం. ధరపై ఏకాభిప్రాయం కరువు యూఎల్సీ, ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్దేశించాల్సిన ధరపై ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా... అది సరైన యోచన కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. -
జాగా.. పాగా!.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆదాయాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో భూముల క్రమబద్ధీకరణకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం యూఎల్సీ (అర్బన్ లాండ్ సీలింగ్) స్థలాలను జల్లెడ పడుతోంది. యూఎల్సీ భూముల్లో ఆక్రమణలపై ఇప్పటికే లెక్కలు తేల్చిన యంత్రాంగం.. ఆయా భూముల్లో నిర్మాణాలున్న విస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూములపై నిశిత పరిశీలన కొనసాగిస్తోంది. జిల్లాలో 11 మండలాల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తుండగా.. మిగతా 2,083.06 ఎకరాల భూములు ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 2,214.31 ఎకరాల్లో నిర్మాణాలు.. ప్రైవేటు పార్టీల ఆధీనంలో ఉన్న యూఎల్సీ భూముల్లో ఇప్పటికే ఎక్కవ శాతం విస్తీర్ణంలో శాశ్వత నిర్మాణాలున్నాయి. 11 మండలాల్లో 3,452.25 ఎకరాల్లోని యూఎల్సీ భూముల్లో 2,214.31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 1,482.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి వివాదాలు లేకపోగా, 732.11 ఎకరాల్లోని నిర్మాణాలు, స్థలాల అంశం న్యాయస్థానాల పరిధిలో ఉంది. మిగతా 1,237.34 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికీ 637.08 ఎకరాలకు సంబంధించి తాగాదాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. మిగతా భూముల్లో కొంతమేర ప్రహరీలు నిర్మించగా.. మిగతా స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో నిర్మాణాలు ఉన్న భూములకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా భూముల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. యూఎల్సీ పరిధిలో.. పరాధీనంలో ఉన్న యూఎల్సీ భూములకు సంబంధించి క్రమబద్ధీకరణకోసం గతంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా కొంత మేర డబ్బులు కూడా యూఎల్‌సీకి చెల్లించనప్పటికీ యూఎల్సీ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా 6,889 మందికి 578 ఎకరాలకు సంబంధించి క్రమబద్ధీకరణ అంశం యూఎల్సీ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 218.14 ఎకరాల్లో 200 గజాల విస్తీర్ణంలోపు ఉన్న దరఖాస్తులున్నాయి. 176.17 ఎకరాల్లో 200-500 విస్తీర్ణానికి సంబంధించి, 107.31 ఎకరాల్లో 500-100 గజాలకు సంబంధించి దరఖాస్తులున్నాయి. అదేవిధంగా 75.26 ఎకరాలో వెయ్యి గజాలకు పైబడిన దరఖాస్తులున్నాయి. -
ఏసీబీ వలలో పెద్దచేప
పట్టుబడ్డ యుఎల్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు అధికారితో పాటు అతని కుమారుడూ కటకటాలపాలు అవినీతి కూపంలో యుఎల్‌సీ కార్యాలయం అబిడ్స్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్‌సీ)లో విధులు నిర్వర్తించే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తానే లంచావతారం ఎత్తి తన కొడుకుతో డబ్బులు తీసుకున్న ఆ అధికారి తన కొడుకుతో సహా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్‌నగర్ మండలంలోని నర్సింహాపురి కాలనీలో రెండు ప్లాట్లు రెగ్యులరైజ్ చేసేందుకు అదే ప్రాంతంలో ఉండే తుమ్మలపల్లి బాల్‌రెడ్డి 2005లో నాంపల్లిలోని యుఎల్‌సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అతనికి రెగ్యులరైజేషన్ డబ్బులు కట్టినప్పటికీ తన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయలేదు. ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్రావు రెగ్యులరైజ్ చేస్తానంటూ అందుకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాల్‌రెడ్డి వెంకటేశ్వర్రావుతో ముందుగా రూ.50వేలు ఇస్తానని, మిగతా మొత్తం తర్వాత ఇవ్వనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు బాల్‌రెడ్డి ఫిర్యాదును స్వీకరించి శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వర్రావుకు రూ.50వేలు ఇవ్వాలని సూచించారు. కాగా సాయంత్రం 6 సమయంలో వెంకటేశ్వర్రావు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా తన కొడుకు అమర్దాస్కు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. డబ్బులు అమర్దాస్ తీసుకుని వెంకటేశ్వర్రావు తీసుకున్న కొద్ది సేపటికే ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నిరంజన్, నాయుడు, అంజిరెడ్డిల బృందం వెళ్లింది. వారిని పసిగట్టిన వెంకటేశ్వర్రావు తీసుకున్న డబ్బులను సమీపంలో ఉన్న డ్రమ్‌లో పడేశాడు. ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్రావును అదుపులోకి తీసుకుని డ్రమ్ములో ఉన్న నగదును స్వాధీనపర్చుకున్నారు. తండ్రీ కొడుకులను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అవినీతి కూపంలో యుఎల్‌సీ... ఎంజెమార్కెట్-నాంపల్లి ప్రధాన రహదారిలో ఉన్న రాష్ట్ర యుఎల్‌సీ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. నాలుగు నెలల క్రితమే ఓ ఉన్నతాధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడగా తిరిగి శుక్రవారం సాయంత్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదిగా చంద్రవిహార్ భవనంలోని 3వ అంతస్తులో గల యుఎల్‌సీ కార్యాలయం పూర్తిగా అవినీతి నిలయంగా మారింది. నగరంతో పాటు శివారు ప్రాంతాలైన మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాలకు చెందిన వేల ఎకరాల భూమికి ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్ కోసం ప్రజలు తరలివస్తారు. శివారు ప్రాంతాల్లోని కొన్ని మండలాలలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్‌కు లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ యుఎల్‌సీ క్లియరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేయండి: డీఎస్పీ శంకర్‌రెడ్డి యుఎల్‌సీ కార్యాలయంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనుల కోసం లంచాలు అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేస్తే ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి సూచించారు. కొంత మంది ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో తమకు సమాచారం రావడం లేదన్నారు. ప్రతీ ఒక్కరు ధైర్యంగా లంచగొండి అధికారులపై ఫిర్యాదు చేస్తే ఏసీబీ ఆయా అధికారులను కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. ఫిర్యాదుల కోసం 9440446134 ఫోన్ నెంబర్లో సంప్రదించాలన్నారు.