ఏసీబీ వలలో పెద్దచేప | Into the trap of getting peddacepa | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో పెద్దచేప

Published Sat, Feb 15 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

Into the trap of getting peddacepa

  •     పట్టుబడ్డ యుఎల్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
  •      రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు
  •      అధికారితో పాటు అతని కుమారుడూ కటకటాలపాలు
  •      అవినీతి కూపంలో యుఎల్‌సీ కార్యాలయం
  •  అబిడ్స్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్‌సీ)లో విధులు నిర్వర్తించే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తానే లంచావతారం ఎత్తి తన కొడుకుతో డబ్బులు తీసుకున్న ఆ అధికారి తన కొడుకుతో సహా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    సరూర్‌నగర్ మండలంలోని నర్సింహాపురి కాలనీలో రెండు ప్లాట్లు రెగ్యులరైజ్ చేసేందుకు అదే ప్రాంతంలో ఉండే తుమ్మలపల్లి బాల్‌రెడ్డి 2005లో నాంపల్లిలోని యుఎల్‌సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అతనికి రెగ్యులరైజేషన్ డబ్బులు కట్టినప్పటికీ తన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయలేదు. ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు రెగ్యులరైజ్ చేస్తానంటూ అందుకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాల్‌రెడ్డి వెంకటేశ్వర్‌రావుతో ముందుగా రూ.50వేలు ఇస్తానని, మిగతా మొత్తం తర్వాత ఇవ్వనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

    గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు బాల్‌రెడ్డి ఫిర్యాదును స్వీకరించి శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వర్‌రావుకు రూ.50వేలు ఇవ్వాలని సూచించారు. కాగా సాయంత్రం 6 సమయంలో వెంకటేశ్వర్‌రావు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా తన కొడుకు అమర్‌దాస్‌కు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. డబ్బులు అమర్‌దాస్ తీసుకుని వెంకటేశ్వర్‌రావు తీసుకున్న కొద్ది సేపటికే ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, నాయుడు, అంజిరెడ్డిల బృందం వెళ్లింది. వారిని పసిగట్టిన వెంకటేశ్వర్‌రావు తీసుకున్న డబ్బులను సమీపంలో ఉన్న డ్రమ్‌లో పడేశాడు. ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని డ్రమ్ములో ఉన్న నగదును స్వాధీనపర్చుకున్నారు. తండ్రీ కొడుకులను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
     
    అవినీతి కూపంలో యుఎల్‌సీ...
     
    ఎంజెమార్కెట్-నాంపల్లి ప్రధాన రహదారిలో ఉన్న రాష్ట్ర యుఎల్‌సీ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. నాలుగు నెలల క్రితమే ఓ ఉన్నతాధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడగా తిరిగి శుక్రవారం సాయంత్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదిగా చంద్రవిహార్ భవనంలోని 3వ అంతస్తులో గల యుఎల్‌సీ కార్యాలయం పూర్తిగా అవినీతి నిలయంగా మారింది. నగరంతో పాటు శివారు ప్రాంతాలైన మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాలకు చెందిన వేల ఎకరాల భూమికి ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్ కోసం ప్రజలు తరలివస్తారు. శివారు ప్రాంతాల్లోని కొన్ని మండలాలలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్‌కు లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ యుఎల్‌సీ క్లియరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం.   
     
    ఫిర్యాదు చేయండి: డీఎస్పీ శంకర్‌రెడ్డి
     
    యుఎల్‌సీ కార్యాలయంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనుల కోసం లంచాలు అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేస్తే ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి సూచించారు. కొంత మంది ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో తమకు సమాచారం రావడం లేదన్నారు. ప్రతీ ఒక్కరు ధైర్యంగా లంచగొండి అధికారులపై ఫిర్యాదు చేస్తే ఏసీబీ ఆయా అధికారులను కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. ఫిర్యాదుల కోసం 9440446134 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement