
టవర్‌సర్కిల్ (కరీంనగర్): ఒకప్పుడు ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టులంతా కరెప్షనిస్టులుగా మారారని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఐ పోరుబాట సభలో వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. 60 రోజులపాటు సాగిందని చెబుతున్న పోరుబాటలో ప్రజల నుంచి వారికి స్పందన కరువైందన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోరాటాలు చేస్తూ ఏం సాధించారని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ సాధించారని అన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్, టీడీపీలు వామపక్షాలకు మద్దతు ఎలా ఇచ్చారని, వామపక్ష ధోరణులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ప్రజల్లో వామపక్షాలపై అంతో ఇంతో ఉన్న అభిమానం కొరవడే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత ఎవరికీ లేదని, చిల్లర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.