శంకర్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డిలను చూపిస్తున్న పోలీసులు ,స్వాధీనం చేసుకున్న తుపాకీ, బుల్లెట్లు
♦ నిందితులు, ఫిర్యాదు దారులంతా గతంలో ఒకే ముఠా
♦ పొలిటికల్, పోలీస్ అధికారులకు అమ్మాయిల ఎర
♦ కొందరి రాసలీలలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వైనం
♦ భర్త లేని ఒంటరి మహిళలే లక్ష్యంగా దందాలు
♦ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న చీకటి బాగోతాలు
♦ శంకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డిలను కోర్టులో హాజరుపరచిన పోలీసులు
రాజధాని ప్రాంతమైన గుంటూరులో వెలుగుచూసిన తుపాకీ చిక్కుముడి ఇంకా వీడలేదు. రెండు రోజులైనా తుపాకీ ఎవరిది.. ఎక్కడ నుంచి వచ్చింది.. అసలు దాని వెనుక ఉన్న కథ ఏమిటి.. అనే విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చలేకపోయారు. అయితే నిందితులతో పాటు ఫిర్యాదు దారులంతా గతంలో ఒకే ముఠా అని తేలింది. పోలీసుల విచారణలో కళ్లు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.
సాక్షి, గుంటూరు : గుంటూరులో రెండు రోజుల క్రితం తుపాకీ సహా లొంగిపోయిన విజయభాస్కరరెడ్డి ఘటన వెనుక చాలా పెద్ద వ్యవహారమే ఉందని తెలుస్తోంది. దీని వెనుక రాజకీయ నేతలు, పోలీసు అధికారులు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు, పోలీస్ అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి వారి రాసలీలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వాటిని బూచిగా చూపి ఈ ముఠా తమ పనులు చక్కబెట్టుకున్నట్టు సమాచారం. అయితే పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను హఠాత్తుగా తెరపైకి తేవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఠా సభ్యుల మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అన్నీ చిక్కుముడులే...
చలసాని ఝాన్సీ అనే మహిళను చంపమని తనకు శనగా సోమశంకర్‌రెడ్డి తుపాకీ ఇచ్చాడని, ఆమెను చంపకపోతే తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని మోదుగుల విజయ భాస్కరరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 15వ తేదీ రాత్రి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. దీన్ని పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు వెలికితీయాలని న్యాయమూర్తి తేజోవతి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో 16న సోమశంకర్‌రెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో మోదుగుల విజయభాస్కరరెడ్డితో పాటు సోమశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రెండు రోజులు గడిచినా తుపాకీ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మాత్రం తేలలేదు.
ఝాన్సీని సైతం పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేసుకుని పంపివేశారు. అయితే మోదుగుల విజయభాస్కరరెడ్డి చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్‌లో తుపాకీ ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు దాచి ఉంచారు.. పదేళ్ల క్రితం ముగిసిన ఝాన్సీ వివాదం ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది అనే అనుమానాలూ కలుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా తమ మధ్య వివాదాలు నడుస్తున్న తరుణంలో శత్రువైన విజయభాస్కరరెడ్డికి సోమశంకర్‌రెడ్డి తుపాకీ ఎందుకు ఇస్తాడనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. తుపాకీ తీసుకున్న వెంటనే లొంగిపోకుండా విజయభాస్కరరెడ్డి మూడు నెలల తరువాత లొంగిపోవడంలో ఆంతర్యం ఏమిటి అనే అనుమానాలూ కలుగుతున్నాయి.
ఇద్దరిపైనా కేసులు నమోదు...
తుపాకీ ఎవరిది అనే విషయంపై శంకర్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి ఒకరిపై ఒకరు చెప్పుకొంటుండటంతో పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. మూడు నెలలుగా అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నందుకు విజయభాస్కరరెడ్డిపై కేసు నమోదు చేశారు. మరోవైపు 2004 నుంచి ఆయుధం కలిగి ఉన్నాడని ఝాన్సీ చెప్పడం, ఆమెను హత్య చేయాలని విజయభాస్కరరెడ్డిని పురమాయించడంతో శంకర్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఆదివారం కోర్టులో హాజరుపరిచారు.
భర్త లేని ఒంటరి మహిళలే టార్గెట్...
భూములు, భవనాలు, ఇతర ఆస్తులు ఉండి భర్త చనిపోయిన ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని పదేళ్లుగా ఈ ముఠా దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుని మంచిగా వారికి దగ్గర కావడం, కొంత డబ్బు ఇచ్చి ఆస్తులు రాయించుకోవడం వీరికి పరిపాటిగా మారింది. అనంతరం వారిని శారీరకంగా లొంగదీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వీరికి అలవాటుగా మారింది. జిల్లాకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి వారిని బుట్టలో వేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల రాసలీలలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ తమ పనులు చక్కబెట్టుకున్నట్టు తెలిసింది.
ఇలా అనేక మంది మహిళలను మోసగించి నగరంలో ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తులను కాజేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ నేతలు, పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉండటంతో అసలు విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుపాకీ సైతం పోలీస్ అధికారుల అండతోనే వీరి వద్దకు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో చీకటి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్లు సమాచారం. తుపాకీ విషయం తేలకపోవటంతో.. పోలీసులు మరోసారి శంకర్‌రెడ్డి, విజయభాస్కరెడ్డిలను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించి లోతుగా విచారణ జరిపితే పెద్దల చీకటి బాగోతాలు బయటపడే అవకాశాలున్నాయి.