బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న నలుగురు విలేకరులపై కేసు నమోదు Four journalists arrested for blackmailing | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న నలుగురు విలేకరులపై కేసు నమోదు

Published Mon, Jun 19 2023 7:41 AM | Last Updated on Mon, Jun 19 2023 7:41 AM

Four journalists arrested for blackmailing - Sakshi

హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి యజమానులను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు విలేకరులపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాలివీ... శ్రీనగర్‌ కాలనీ ప్రధాన రహదారిలోని కమలాపురి కాలనీలో మనీష్‌ జైన్‌ అనే వ్యాపారి ప్లాట్‌ నెంబర్‌ 117లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ నెల 4వ తేదీన తాము విలేకరులమంటూ నలుగురు వ్యక్తులు ఆయనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేశారు. తాము లోకల్‌ మీడియా రిపోర్టర్లమని పేర్కొంటూ తీవ్రంగా వేధింపులకు గురి చేశారు.

 ఆకుల కిరణ్‌ గౌడ్, సోపాల శ్రీనివాస్, తడక విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్‌ తదితరులు రోజూ 20 నుంచి 30 సార్లు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని వీరిపై బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేసులో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నిర్మిస్తున్న భవనంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ తన ఇంటి ఫొటోలు తీస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని బిల్డింగ్‌ కూలి్చవేయిస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. అయిదు సంవత్సరాల క్రితం కూడా ఈ నలుగురు విలేకరులు తమను డబ్బుల కోసం డిమాండ్‌ చేయడం జరిగిందని వీరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డట్లు ఆరోపించారు. 

బిల్డింగ్‌ కూలి్చవేయిస్తామని అప్పట్లోనే బెదిరించగా రూ. 12 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. తాజాగా మళ్లీ తనను డబ్బు ల కోసం బెదిరిస్తున్నాడని తనకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యంగా మారిందని వీరి బారి నుంచి రక్షించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్‌ పోలీసులు కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్, విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్‌లపై ఐపీసీ సెక్షన్‌ 447, 385, 386, 506 రెడ్‌విత్‌ 120(బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement