gurukul trust lands
-
కాసుల వేట!
క్రమబద్ధీకరణతో రూ.6,000 కోట్ల రాబడే లక్ష్యం! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. యూఎల్సీ భూముల వివరాలను గురువారంలోపు అఖిలపక్ష పార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎల్సీ స్థలాల లెక్క తేల్చిన సర్కారు.. నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు.. యూఎల్సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగిన రాజకీయపార్టీల ప్రతినిధుల భేటీలో స్పష్టం చేసింది. అయితే, యూఎల్సీ స్థలాలపై స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే సర్వే నంబర్లవారీగా యూఎల్సీ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ఆధారంగా భూమి స్థితిగతులు, ఆక్రమణలు, విస్తీర్ణం తదితర అంశాలను పొందుపరుస్తూ నివేదిక సమర్పించింది. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణపై ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెగ్యులరైజ్‌తో భారీ రాబడి అంచనా యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణతో సుమారు రూ.6,000కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జిల్లాలోని 11 పట్టణ మండలా ల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములుండగా, దీంట్లో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వివాదరహితంగా ఉన్న 2,083.06 ఎకరాల భూములే ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా శేరిలింగంపల్లిలోని అయ్యప్ప గురుకుల్ ట్రస్ట్ భూ ములున్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారానే భారీగా నిధులు సమీకరించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్థల యాజ మాన్య హక్కుల కోసం ఒకవైపు ట్రస్ట్, దేవాదాయ, యూఎల్సీ విభాగం కోర్టును ఆశ్రయించాయి. యూఎల్సీ, దే వాదాయ శాఖలను కేసులు ఉపసంహరించుకునేలా చేసి.. ట్రస్ట్‌కు కొంత మొత్తాన్ని కేటాయించడం ద్వారా క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. కనీస ధరపై కసరత్తు! యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్ధేశించే ధరపై ఏకాభిప్రాయం కుదరడంలేదు. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా.. అది అసంబద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ ధరకంటే కూడా రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్నందున.. ప్రస్తుత విలువను ప్రామాణికంగా తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ధరను నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో 2008 నాటి కనీస ధర మేరకే క్రమబద్ధీకరించడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయానికి అనుగుణంగా ధరల నిర్ధారణలో మార్పులు చేర్పులు జరిగే అవకాశంలేకపోలేదని యంత్రాంగం అంటోంది. -
‘ల్యాంకో’ భూములను స్వాధీనం చేసుకోవాలి
హైదరాబాద్: ల్యాంకో హిల్స్ భూములు నూటికి నూరు శాతం వక్ఫ్ భూములేనని, వాటిని స్వాధీనం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... గురుకుల్ ట్రస్టు భూముల్లో ఆక్రమణల తొలగింపు సరైనదేనని, ఇళ్లను కట్టుకున్నవాళ్లు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకపోవడం తప్పేనన్నారు. అయితే, మణికొండలోని వందల ఎకరాల వక్ఫ్ భూముల్లో 60 అంతస్తుల ఆకాశహర్మ్యాలు కడుతున్న ల్యాంకో హిల్స్ సంగతేంటని ముఖ్యమంత్రిని అడిగినట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు తెలంగాణలో ఆక్రమణలకు గురైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలన్నారు. కాగా, చాక్లెట్ కోసం చిన్నపిల్లవాడు వెళ్లినట్లుగా తమ ఎమ్మెల్సీలు పార్టీ మారారని విమర్శించారు. ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమి లేదన్నారు -
ఉక్కుపాదం
* అక్రమ నిర్మాణాలకు ఆదిలోనే అడ్డుకట్ట * రంగంలోకి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు * హైదరాబాద్ పరిధిలోని 18 సర్కిళ్లకు 18 టీమ్స్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వాటి నివారణకు ‘ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై ఈ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ రంగంలోకి దిగి అడ్డుకుంటాయి. తొలిదశలో సర్కిల్‌కి ఒకటి చొప్పున గ్రేటర్‌లోని 18 సర్కిళ్లకు వెరసి 18 ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్‌ల పనితీరును జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ సీసీపీ లేదా సీపీలు పర్యవేక్షిస్తారు. సర్కిల్లో ఉండే ఏసీపీ నేతృత్వంలో టీమ్ పనిచేస్తుంది. ఒక్కో ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారు. అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే అధికం.. జీహెచ్ఎంసీకి వివిధ వర్గాల నుంచి, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందినవి.. అందులోనూ అక్రమ నిర్మాణాలవే అధికం. వారం వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ప్రజావాణి’లో సైతం అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే ఎనభై శాతానికి పైగా ఉంటున్నాయి. వీటి పరిష్కారానికి ఒకటి రెండురోజుల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి, తగిన వ్యూహం, కార్యాచరణ రూపొందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. నాలాలు, చెరువుల భూముల్లో నిర్మాణాలు జరిపితే కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. తొందరపాటు చర్యలకు దిగబోమని, న్యాయనిపుణుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్ కన్వెన్షన్‌పై అక్రమ నిర్మాణ బోర్డు.... సర్వే చేసిన అధికారుల బృందం తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ ఉందని తేల్చిన విషయం తెలిసిందే. ఎన్కన్వెన్షన్ లోపల మార్కింగ్ అధికారులు తాజాగా ‘అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్’ అని రాశారు. గురుకుల్ ట్రస్టులోని నిర్మాణాలపైనా ఇదే తరహాలో రాస్తున్నారు. కాగా, తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసేందుకు సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని సోమవారం కలిశారు. చార్జీలు మూడు రెట్లు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని భవనాల్లో ఇప్పటికే కరెంటు, తాగునీటి సదుపాయం పొందుతున్న వారికి జూలై నెల నుంచి మూడు రెట్ల బిల్లులు అందనున్నాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు అక్రమ నిర్మాణాలు జరిపిన వారికి మూడు రెట్లు బిల్లులు వసూలు చేయవచ్చు. -
ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమే!
తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్లో 1.12, బఫర్ జోన్‌లోని 2 ఎకరాల్లో నిర్మాణం సర్వేతో నిగ్గుతేల్చిన జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తామన్న కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇక అన్ని చెరువులపైనా దృష్టి సారిస్తామని వెల్లడి హైదరాబాద్ : గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూల్చివేతలు.. సీజ్ చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై దృష్టి సారించారు. దీనికి నోటీసులు జారీ చేసేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ చూపారు. అందులో భాగంగా త మ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్‌పై సర్వే పూర్తి చేశారు. సర్వే మేరకు ప్రభుత్వ భూమిలో, చెరువు స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు తేలింది. దీంతో సంబంధిత యాజమాన్యానికి నోటీసు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే జరిపారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా సర్వేలో పాల్గొన్నారు. తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లోని 2 ఎకరాలు ఎన్ కన్వెన్షన్‌లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. నిబంధనల మేరకు పూర్తిచేయాల్సిన ప్రక్రియను పూర్తిచేసి నోటీసు జారీ చే యనున్నట్లు వెల్లడించారు. సర్వేలోని పూర్తి వివరాలను సోమవారం విడుదల చేస్తామని చెప్పారు. ఖానామెట్ సర్వేనంబర్ 11/2, 11/36లలో తమ్మిడిచెరువుకు చెంది న స్థలాన్ని చదునుచేసి కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు.. అనుమతుల్లేకుండా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను క్రమబద్ధీకరించాల్సిందిగా కోరుతూ 2010లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. 6.69 ఎకరాల మేర స్థలంలోని నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాల్సిందిగా దరఖాస్తు చేసుకోగా, అది ప్రభుత్వ భూమి అయినందున జీహెచ్ఎంసీ అధికారులు తిరస్కరించారు. దరఖాస్తుతో పాటు 0.45 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రం జతచేసినట్లు సమాచారం. విషయం కోర్టుకు వెళ్లడంతో చర్యలు తీసుకునే ముందు ఆ మేరకు తగిన సమాచారం ఇవ్వాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొనడంతో తాజాగా సర్వే జరిపారు. తమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29.24 ఎకరాలని అధికారులు తెలిపారు. చెరువుల కబ్జాదారులను జైల్లో పెట్టాలి: చెరువులు పూడ్చిన వారిని జైల్లో పెట్టాలని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు. శనివారం ఆయన మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును సందర్శించారు. శివారుల్లో ఉన్న చెరువులు కనుమరుగయ్యాయని, వాటిని రక్షించాలన్నారు. శేరిలింగంపల్లిలో సర్వే పూర్తి...: శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్, ఇజ్జత్నగర్లలోని ప్రభుత్వ భూములు, చెరువులు తదితర భూముల సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తిచేశారు. గత నెల 19వ తేదీనుంచి మండల పరిధిలోని ఖానామెట్ ఇజ్జత్ నగర్లలోనే గురుకుల్ ట్రస్ట్, ప్రభుత్వ, చెరువులు, కుంటల సర్వే కార్యక్రమం రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ప్రారంభించారు. ముఖ్యంగా 5 టీంలు గురుకుల్ ట్రస్ట్‌లోని ఖాళీప్లాట్లు, భవనాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, ఎవరి అధీనంలో ఉన్నాయన్న వివరాలను సేకరించారు. శనివారంతో ఖానామెట్ ఇజ్జత్‌నగర్‌లలో సర్వే కార్యక్రమం పూర్తయినట్లు తహశీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. సేకరించిన వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తున్నామని, పూర్తి సమాచారం సోమవారం నాటికి అందే అవకాశం ఉందన్నారు. అన్ని చెరువులపైనా దృష్టి జీహెచ్ఎంసీలోని 168 చెరువులపైనా దృష్టి సారించి అక్రమాలుంటే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అన్ని చెరువు ప్రాంతాలకు మార్కింగ్ చేస్తామన్నారు. దీనికి అన్ని సర్కిళ్లలోనూ ప్రత్యే క బృందాలను నియమిస్తామన్నారు. వారంలోగా చెరువు ప్రాంతాల్లో వెలసిన అక్రమ భవనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలపై చర్యలను ఆపే ప్రసక్తే లేదన్నారు. నిబంధనల మేరకు పాటించాల్సిన విధివిధానాలు పాటిస్తామని చెప్పారు. గురుకుల్ ట్రస్ట్‌లోని భూములు అమ్మవద్దు.. కొనవద్దు.. అని శనివారం వరకు 125 భవనాలకు బోర్డులు అమర్చారు. -
అనుమతి ఉన్నా... కూల్చేశారు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులకు బుధవారం పెద్ద ఝలక్ తగిలింది. మునిసిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన భవనాన్ని కూడా అక్రమ నిర్మాణం అనుకుని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తాను నిబంధనల ప్రకారం భవనాన్ని నిర్మించానని యజమాని జీహెచ్ ఎంసీ అధికారులు ఎదుట ఆందోళనకు దిగాడు. దాంతో తమ తప్పు తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగేందుకు ప్రయత్నించారు. తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ అధికారులను భవన యజమాని ప్రశ్నించాడు. దాంతో నీళ్లు నమలడం జీహెచ్ఎంసీ అధికారుల వంతైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో గురుకుల ట్రస్ట్‌కు చెందిన భూముల్లో అక్రమ కట్టడాలని కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను సోమవారం ఆదేశించారు. దాంతో మంగళవారం రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రెండవ రోజు బుధవారం అక్రమకట్టడం కూల్చివేస్తు పక్కనే ఉన్న భవనాన్ని కూడా కూల్చివేశారు. దాంతో భవన యజమాని ఆందోళనకు దిగాడు. అ క్రమంలో భవన నిర్మాణానికి పొందిన అనుమతులను భవన యజమాని సదరు అధికారులకు చూపించారు. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు తప్పైపోయిందంటూ నాలిక కర్చుకున్నారు. -
రెండోవ రోజు కొనసాగుతున్న కూల్చివేతలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత బుధవారం వరుసగా రెండోరోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మహేందర్ వెల్లడించారు. అందుకోసం 5 బృందాలు, 100 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. అక్రమ కట్టడాలు కూల్చివేత నేపథ్యంలో అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల వద్ద భారీగా పోలీసులను మొహరించారు. వేలాది కోట్ల రూపాయిల విలువ గల అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూములలో అధిక సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో సదరు భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దాంతో జీహెచ్ఎంసీ మంగళవారం రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. -
తగ్గేది లేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అయ్యప్పసొసైటీలో మంగళవారం ఉదయం నుంచే కూల్చివేత చర్యలు చేపట్టారు. నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించిన 21 భవనాల్లో ఈ చర్యలు ప్రారంభించారు. వీటిల్లో ఐదింటిని సోమవారం రాత్రే కూల్చివేశా రు. మిగతా వాటిని మంగళవారం కూల్చారు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచే రంగంలోకి దిగిన అధికారులు భారీగా పోలీసు బందోబస్తుతో నిర్మాణాల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దగ్గరుం డి కూల్చివేతల్ని పర్యవేక్షించారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలతో సహా దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. కొన్ని భవనాలను పూర్తిగా కూల్చివేసిన అధికారులు, మరికొన్నింటిని పాక్షికంగా కూల్చివేశారు. కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇటీవల నిర్మాణం చేపట్టిన.. నిర్మాణం జరుగుతున్న 21 భవనాలను గుర్తించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఎలాంటి నోటీసులు అవసరం లేదని స్పష్టం చేశారు. బుధవారమూ కూల్చివేతలు జరుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎ.గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, రంగారావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక స్క్వాడ్లు.. కొత్త నిర్మాణాలను పరిశీలించి కూల్చివేతలు జరిపేందుకు ఐదు డిమాలిషింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. వీటిల్లో టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పాటు 200 మంది పోలీసులు ఉంటారు. హైకోర్టు ఆదే శాల మేరకే కూల్చివేతలు జరుపుతున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. అధికారులంతా ఎన్నికల విధులకు వెళ్లడంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. కొత్తగా జరిగే నిర్మాణాలను ఏరోజుకారోజు తనిఖీలు చేసేందుకు టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, సిబ్బంది తోపాటు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని కూడా కేటాయించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు. మూడు బృందాలు విధుల్లో ఉంటాయన్నారు. ఇవి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నదీ గుర్తిస్తాయన్నారు. రాత్రివేళల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో ఈ బృందాలు 24 గంటల పాటు విధుల్లో ఉంటాయన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు జరుపుతున్న భవనాల సెల్లార్లలో డెబ్రిస్(నిర్మాణ వ్యర్థాలు) వేయాల్సిందిగా ఆయన తమ అధికారులకు సూచించారు. ప్రజలు అక్రమ నిర్మాణాలకు పాల్పడవద్దని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు దృష్టికి వచ్చినా వెంటనే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ కు(నంబర్ 21 11 11 11) ఫోన్ చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయ్యప్పసొసైటీలో కొత్తగా ఎలాంటి విద్యుత్, తాగునీరు, సివరేజి కనెక్షన్లు ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్, జలమండలి అధికారులకు ఇప్పటికే లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. అక్రమ కట్టడాలపై తీసుకుంటున్న చర్యల గురించి ఏరోజుకారోజు నివేదికలు అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నోటీసులిచ్చి.. వాదనలు వినండి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో చట్టం నిర్దేశించిన నిబంధనలను అనుసరించాలని హైకోర్టు మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. నిర్మాణాలను కూల్చివేయాలంటే ముందు నోటీసులు జారీ చేసి, వారి వాదనలు విన్న తరువాత తగిన విధంగా స్పందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొందరు భవన యజమానులు మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు. -
అక్రమ కట్టడాలను కూల్చేయండి: కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై సీరియస్‌గా స్పందించాలని ఉన్నతాధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అక్రమ కట్టడాలను కూల్చేయాలని, అవసరమైతే పోలీస్ ఫోర్స్‌ను వాడాలని సూచించారు. జీహెచ్ ఎంసీ, పోలీస్ ఉన్నతాధికారులతో కేసీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు తెలంగాణలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష జరిపారు. డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సచివాలయం భద్రత, బారికేడ్ల వివాదంపై కూడా సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి డీజీపీతో పాటు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా హాజరయ్యారు.