రెండోవ రోజు కొనసాగుతున్న కూల్చివేతలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత బుధవారం వరుసగా రెండోరోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మహేందర్ వెల్లడించారు. అందుకోసం 5 బృందాలు, 100 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. అక్రమ కట్టడాలు కూల్చివేత నేపథ్యంలో అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల వద్ద భారీగా పోలీసులను మొహరించారు.
వేలాది కోట్ల రూపాయిల విలువ గల అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూములలో అధిక సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో సదరు భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దాంతో జీహెచ్ఎంసీ మంగళవారం రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.