GHMC DC
-
అనుమతి ఉన్నా... కూల్చేశారు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులకు బుధవారం పెద్ద ఝలక్ తగిలింది. మునిసిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన భవనాన్ని కూడా అక్రమ నిర్మాణం అనుకుని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తాను నిబంధనల ప్రకారం భవనాన్ని నిర్మించానని యజమాని జీహెచ్ ఎంసీ అధికారులు ఎదుట ఆందోళనకు దిగాడు. దాంతో తమ తప్పు తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగేందుకు ప్రయత్నించారు. తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ అధికారులను భవన యజమాని ప్రశ్నించాడు. దాంతో నీళ్లు నమలడం జీహెచ్ఎంసీ అధికారుల వంతైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో గురుకుల ట్రస్ట్‌కు చెందిన భూముల్లో అక్రమ కట్టడాలని కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను సోమవారం ఆదేశించారు. దాంతో మంగళవారం రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రెండవ రోజు బుధవారం అక్రమకట్టడం కూల్చివేస్తు పక్కనే ఉన్న భవనాన్ని కూడా కూల్చివేశారు. దాంతో భవన యజమాని ఆందోళనకు దిగాడు. అ క్రమంలో భవన నిర్మాణానికి పొందిన అనుమతులను భవన యజమాని సదరు అధికారులకు చూపించారు. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు తప్పైపోయిందంటూ నాలిక కర్చుకున్నారు. -
రెండోవ రోజు కొనసాగుతున్న కూల్చివేతలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత బుధవారం వరుసగా రెండోరోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మహేందర్ వెల్లడించారు. అందుకోసం 5 బృందాలు, 100 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. అక్రమ కట్టడాలు కూల్చివేత నేపథ్యంలో అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల వద్ద భారీగా పోలీసులను మొహరించారు. వేలాది కోట్ల రూపాయిల విలువ గల అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూములలో అధిక సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో సదరు భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దాంతో జీహెచ్ఎంసీ మంగళవారం రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.