ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమే! | seaz to n convention buildings | Sakshi
Sakshi News home page

ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమే!

Published Sun, Jun 29 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమే!

ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమే!

తమ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్‌లో 1.12,
బఫర్ జోన్‌లోని 2 ఎకరాల్లో నిర్మాణం
సర్వేతో నిగ్గుతేల్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు
నోటీసులు జారీ చేస్తామన్న కమిషనర్ సోమేశ్‌కుమార్
ఇక అన్ని చెరువులపైనా దృష్టి సారిస్తామని వెల్లడి

 
హైదరాబాద్ : గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూల్చివేతలు.. సీజ్ చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై దృష్టి సారించారు. దీనికి నోటీసులు జారీ చేసేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై  శ్రద్ధ చూపారు. అందులో భాగంగా త మ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్‌పై సర్వే పూర్తి చేశారు. సర్వే మేరకు ప్రభుత్వ భూమిలో, చెరువు స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు తేలింది. దీంతో సంబంధిత యాజమాన్యానికి నోటీసు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తమ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే జరిపారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులతోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా సర్వేలో పాల్గొన్నారు. తమ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లోని 2 ఎకరాలు ఎన్ కన్వెన్షన్‌లో ఉన్నట్లు  జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. నిబంధనల మేరకు పూర్తిచేయాల్సిన ప్రక్రియను పూర్తిచేసి నోటీసు జారీ చే యనున్నట్లు వెల్లడించారు. సర్వేలోని పూర్తి వివరాలను సోమవారం విడుదల చేస్తామని చెప్పారు. ఖానామెట్ సర్వేనంబర్ 11/2, 11/36లలో తమ్మిడిచెరువుకు చెంది న స్థలాన్ని చదునుచేసి కన్వెన్షన్  నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు.

క్రమబద్ధీకరణకు దరఖాస్తు..

అనుమతుల్లేకుండా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను క్రమబద్ధీకరించాల్సిందిగా కోరుతూ 2010లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. 6.69 ఎకరాల మేర స్థలంలోని నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాల్సిందిగా దరఖాస్తు చేసుకోగా, అది ప్రభుత్వ భూమి అయినందున జీహెచ్‌ఎంసీ అధికారులు తిరస్కరించారు. దరఖాస్తుతో పాటు 0.45 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రం జతచేసినట్లు సమాచారం. విషయం కోర్టుకు వెళ్లడంతో చర్యలు తీసుకునే ముందు ఆ మేరకు తగిన సమాచారం ఇవ్వాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొనడంతో తాజాగా సర్వే జరిపారు. తమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29.24 ఎకరాలని అధికారులు తెలిపారు.

చెరువుల కబ్జాదారులను జైల్లో పెట్టాలి: చెరువులు పూడ్చిన వారిని జైల్లో పెట్టాలని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు. శనివారం ఆయన మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును సందర్శించారు. శివారుల్లో ఉన్న చెరువులు కనుమరుగయ్యాయని, వాటిని రక్షించాలన్నారు.

శేరిలింగంపల్లిలో సర్వే పూర్తి...: శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌లలోని ప్రభుత్వ భూములు, చెరువులు తదితర భూముల సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తిచేశారు. గత నెల 19వ తేదీనుంచి మండల పరిధిలోని ఖానామెట్ ఇజ్జత్ నగర్‌లలోనే గురుకుల్ ట్రస్ట్, ప్రభుత్వ, చెరువులు, కుంటల సర్వే కార్యక్రమం రెవెన్యూ, సర్వే డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులు ప్రారంభించారు. ముఖ్యంగా 5 టీంలు గురుకుల్ ట్రస్ట్‌లోని ఖాళీప్లాట్లు, భవనాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, ఎవరి అధీనంలో ఉన్నాయన్న వివరాలను సేకరించారు. శనివారంతో ఖానామెట్ ఇజ్జత్‌నగర్‌లలో సర్వే కార్యక్రమం పూర్తయినట్లు తహశీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. సేకరించిన వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తున్నామని, పూర్తి సమాచారం సోమవారం నాటికి అందే అవకాశం ఉందన్నారు.
 
అన్ని చెరువులపైనా దృష్టి

జీహెచ్‌ఎంసీలోని 168 చెరువులపైనా దృష్టి సారించి అక్రమాలుంటే చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అన్ని చెరువు ప్రాంతాలకు మార్కింగ్ చేస్తామన్నారు. దీనికి అన్ని సర్కిళ్లలోనూ ప్రత్యే క బృందాలను నియమిస్తామన్నారు. వారంలోగా చెరువు ప్రాంతాల్లో వెలసిన అక్రమ భవనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలపై చర్యలను ఆపే ప్రసక్తే లేదన్నారు. నిబంధనల  మేరకు పాటించాల్సిన విధివిధానాలు పాటిస్తామని చెప్పారు. గురుకుల్ ట్రస్ట్‌లోని భూములు అమ్మవద్దు.. కొనవద్దు.. అని శనివారం వరకు 125 భవనాలకు బోర్డులు అమర్చారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement