ఆ భూముల నిగ్గు తేల్చేద్దాం...
ఇక ఎఫ్‌టీఎల్‌లు, నాలా భూముల వంతు సర్వేకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ వచ్చే వారం నుంచి కూల్చివేతలు
హైదరాబాద్ : ఐదురోజులుగా గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుపుతున్న జీహెచ్‌ఎంసీ అధికారులు తాజాగా చెరువుల ఎఫ్‌టీఎల్‌లు(పూర్తిస్థాయి నీటిమట్టం), నాలా భూములు ఆక్రమించి నిర్మాణాలు జరిపిన భవనాలపై దృష్టి సారించారు. ఎఫ్‌టీఎల్‌లు, నాలా ప్రాంతాల్లోని భవనాలెన్ని ఉన్నాయో సర్వే చేసే పనుల్లో పడ్డారు. సర్వే పూర్తిచేసి సదరు ప్రాంతాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రేటర్ పరిధిలోని 18 సర్కిళ్లలో వెంటనే ఈ సర్వే చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, ఇతరత్రా ప్రభుత్వ స్థలాల్లో వెలసిన నిర్మాణాల సర్వే చే యాలని భావిస్తున్నారు.
నగరంలో వాన కురిస్తే నీరు వెళ్లే దారి లేదు. ఇందుకు కారణం చెరువుల ఎఫ్‌టీఎల్ ప్రదేశాలు, నాలా భూముల్లోనూ భారీ భవంతులు వెలియడమే కారణమని గుర్తించారు. ఎఫ్‌టీఎల్, నాలా ప్రదేశాల్లో వెలసిన భవనాలపై సర్వే పూర్తయ్యాక, కమిషనర్ ఆదేశాల కనుగుణంగా కూల్చివేతల చర్యలు చేపడతామని జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాకు సంబంధించిన ప్రదేశంలోనే దాదాపు వెయ్యి ఇళ్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన గ్రేటర్ మొత్తంలో నాలాలు, ఎఫ్‌టీఎల్‌ల పరిధిలో వెలసిన భవనాలు వేలాదిగా ఉంటాయని భావిస్తున్నారు. వీటితోపాటు నివాస గృహాలకు అనుమతులు పొంది వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న భవనాలపైనా చర్యలు తీసుకోనున్నారు. కాగా, టాటానగర్, తదితర ప్రాంతాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా ఏర్పాటైన ప్లాస్టిక్ గోడౌన్లపై శనివారం దాడి చేసి కూల్చివేతలు చేపట్టారు. 54 కూల్చివేతలు జరపగా, వాటిల్లో 40కి పైగా ప్లాస్టిక్ గోడౌన్లు, ఇతరత్రా షెడ్లే ఉన్నాయి. వనస్థలిపురం, హయత్‌నగర్, హనుమాన్ టెకిడి, కల్యాణ్‌నగర్, మాదాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, యాప్రాల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చే వారం నోటీసు జారీ చేసే యోచనలో జీహెచ్‌ఎంసీ అధికారులున్నారు. హైకోర్టు కాపీ అందడంతో దానిని పరిశీలించి.. వచ్చే వారం నోటీసు జారీ చేసే యోచనలో ఉన్నారు. కాగా, ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి మరో కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
యూఎల్‌సీ భూముల సర్వే ముమ్మరం
శేరిలింగంపల్లి మండల పరిధిలోని యూఎల్‌సీ మిగులు భూముల సర్వే కార్యక్రమం ఈ నెల 21 నుంచి ముమ్మరంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూముల సర్వేను పూర్తిచేసిన అధికారులు ఇతర భూముల సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు 15 టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా టీంలతో వారం రోజుల్లో యూఎల్‌సీ మిగులు భూముల సర్వే పూర్తి చేస్తామని తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు.
కూల్చివేతలను నిలువరించండి హైకోర్టు సీజేకు సింగిరెడ్డి లేఖ
జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను వెంటనే నిలువరించాలంటూ జీహెచ్‌ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శనివారం లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు సామాన్యులను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు జరుపుతున్నారని ఆరోపించారు. అక్రమాలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రజలను వేధిస్తున్నారన్నారు. కూల్చివేతలు జరుపకుండా అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, ఎంఐఎం ఎమ్మెల్యేలకు చెందిన 24 వాణిజ్య భవనాలు, దారుసలాం భవనం, డెక్కన్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజి, బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, ఖైరతాబాద్ షాదాన్ కాలేజీలకు అవసరమైన భవన నిర్మాణ అనుమతులు ఉన్నదీ లేనిదీ జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేయాలన్నారు. లేఖలో తాను ప్రస్తావించిన అంశాల్ని పిల్‌గా లేదా అత్యవసర సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలవాల్సిన కార్పొరేటర్లు అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో కలవలేదని తెలుస్తోంది.