సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు.
దేశంలో మోదీ క్రేజ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment