తగ్గేది లేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అయ్యప్పసొసైటీలో మంగళవారం ఉదయం నుంచే కూల్చివేత చర్యలు చేపట్టారు. నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించిన 21 భవనాల్లో ఈ చర్యలు ప్రారంభించారు. వీటిల్లో ఐదింటిని సోమవారం రాత్రే కూల్చివేశా రు. మిగతా వాటిని మంగళవారం కూల్చారు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచే రంగంలోకి దిగిన అధికారులు భారీగా పోలీసు బందోబస్తుతో నిర్మాణాల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దగ్గరుం డి కూల్చివేతల్ని పర్యవేక్షించారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలతో సహా దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.
కొన్ని భవనాలను పూర్తిగా కూల్చివేసిన అధికారులు, మరికొన్నింటిని పాక్షికంగా కూల్చివేశారు. కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇటీవల నిర్మాణం చేపట్టిన.. నిర్మాణం జరుగుతున్న 21 భవనాలను గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఎలాంటి నోటీసులు అవసరం లేదని స్పష్టం చేశారు. బుధవారమూ కూల్చివేతలు జరుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎ.గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, రంగారావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రత్యేక స్క్వాడ్‌లు..
కొత్త నిర్మాణాలను పరిశీలించి కూల్చివేతలు జరిపేందుకు ఐదు డిమాలిషింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. వీటిల్లో టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పాటు 200 మంది పోలీసులు ఉంటారు. హైకోర్టు ఆదే శాల మేరకే కూల్చివేతలు జరుపుతున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. అధికారులంతా ఎన్నికల విధులకు వెళ్లడంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. కొత్తగా జరిగే నిర్మాణాలను ఏరోజుకారోజు తనిఖీలు చేసేందుకు టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, సిబ్బంది తోపాటు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని కూడా కేటాయించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు. మూడు బృందాలు విధుల్లో ఉంటాయన్నారు. ఇవి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నదీ గుర్తిస్తాయన్నారు. రాత్రివేళల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో ఈ బృందాలు 24 గంటల పాటు విధుల్లో ఉంటాయన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు జరుపుతున్న భవనాల సెల్లార్లలో డెబ్రిస్(నిర్మాణ వ్యర్థాలు) వేయాల్సిందిగా ఆయన తమ అధికారులకు సూచించారు. ప్రజలు అక్రమ నిర్మాణాలకు పాల్పడవద్దని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు దృష్టికి వచ్చినా వెంటనే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ కు(నంబర్ 21 11 11 11) ఫోన్ చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయ్యప్పసొసైటీలో కొత్తగా ఎలాంటి విద్యుత్, తాగునీరు, సివరేజి కనెక్షన్లు ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్, జలమండలి అధికారులకు ఇప్పటికే లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. అక్రమ కట్టడాలపై తీసుకుంటున్న చర్యల గురించి ఏరోజుకారోజు నివేదికలు అందజేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నోటీసులిచ్చి.. వాదనలు వినండి
గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో చట్టం నిర్దేశించిన నిబంధనలను అనుసరించాలని హైకోర్టు మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. నిర్మాణాలను కూల్చివేయాలంటే ముందు నోటీసులు జారీ చేసి, వారి వాదనలు విన్న తరువాత తగిన విధంగా స్పందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొందరు భవన యజమానులు మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు.